తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ఇరవై ఏళ్లలో ప్రజలలో తనదైన బలమైన ముద్ర వేసుకుందనడానికి ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. తెలంగాణలో రెండుసార్లు ఇప్పటికే గెలిచి పాలన చేస్తున్న టీఆర్‌ఎస్ మరో విజయానికి సన్నద్ధం అవుతోంది. కేసీఆర్ విజయ రహస్యం ఏమిటి అని నిశితంగా పరిశీలిస్తే అర్థం అయ్యేదేమిటంటే, బక్కపలుచగా ఉన్న ఆయన తెలంగాణకు బలమైన గొంతుకగా మారడమే! తెలంగాణ వాదాన్ని ఆయనలా బలంగా మర్రి చెన్నారెడ్డితో సహా మరెవరూ ముందుకు తీసుకు వెళ్లలేకపోయారు. మన యాస, మన గోస, మన బతుకమ్మ, మన సంస్కృతి అంటూ ప్రజలలోకి తన భావజాలాన్ని తీసుకువెళ్లగలిగారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని పదవులు వచ్చినా తెలంగాణ వాదాన్ని వదలిపెట్టలేదు.
మన యాస, మన గోస, మన బతుకమ్మ, మన సంస్కృతి అంటూ ప్రజలలోకి తన భావజాలాన్ని తీసుకువెళ్లగలిగారు కేసీఆర్. గతంలో ఎంతమంది పెద్ద నేతలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపినా, వారి పరిధి తక్కువగా ఉండేది. ఉద్యోగాలలో అన్యాయం జరిగిందనీ, రాజకీయ పదవులలో న్యాయం జరగలేదనీ అన్నంతవరకు పరిమితం అయ్యేది. కానీ కేసీఆర్ ఎన్ని పదవులు వచ్చినా తెలంగాణ భావజాలాన్ని వదలి పెట్టలేదు. నిధులు, నీళ్లు, నియామకాల నినాదంతో పాటు తెలంగాణ మాండలికానికి కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పరస్పర విరుద్ధ రాజకీయ పార్టీలుగా ఉండే కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ వంటివాటిని జేఏసీ పేరుతో ఒకే వేదిక మీదకు తేవడం ఆయన ఘనతే. ఉద్యమ సమయంలో హింస చాలా తక్కువగా ఉండటానికి కారణం కూడా ఆయనే. అప్పట్లో తెలంగాణలో నివసిస్తున్న కోస్తా, రాయలసీమ వారిని ఉద్దేశించి ఎలా మాట్లాడినా, అధికారం వచ్చాక ఆ ప్రాంతంవారి కాళ్లలో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తాన నడం ఆయన ప్రత్యేకత. సమైక్యవాదులుగా ఉన్నవారితో కూడా టీఆర్‌ఎస్‌కు ఓటు వేయించుకోగలిగారంటేనే ఆయన ఎంతటి విజయం సాధించారో అర్థం చేసుకోవచ్చు.
ఇరవై ఏళ్ల క్రితం కేసీఆర్ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు ఆయనకు కూర్చోవడానికి ప్రత్యేకమైన ఆఫీస్ కూడా ఉండేది కాదు. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి మాజీ స్పీకర్ జి. నారాయణరావు ఆధ్వ ర్యంలో నడిచే ఒక సంస్థ భవనంలో కూర్చునేవారు. ఆ తర్వాత రోజులలో హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంటిని పార్టీ కార్యాలయంగా తీసుకున్నారు. కానీ ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ఆ భవనం అక్రమ నిర్మాణమని తేల్చి కూల్చ డానికి సిద్ధం అయింది. దాంతో ఆయన బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఒక ఇంటిని ఆఫీస్‌గా మార్చుకున్నారు. తదుపరి వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వపరంగా స్థలం తీసుకుని తెలంగాణ భవన్‌ను నిర్మించుకున్నారు.
2009లో మొదటిసారి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించినప్పుడు టీఆర్‌ఎస్‌కు ఉన్నది ఇద్దరు ఎంపీలే. ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో సైతం పార్టీకి ఉన్నది పది మంది ఎమ్మెల్యేలే. అయినా ఆయన ఎలా తెలంగాణ సాధించగలిగారు? కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ వంటి పార్టీలనే కాకుండా, అతి ముఖ్యమైన తెలుగుదేశం పార్టీని కూడా ఆయన తన దారిలోకి తెచ్చుకోవడం ద్వారా ఈ విజయం సాధించారు. మొదటి నుంచీ సమైక్యవాద పార్టీగా ఉన్న టీడీపీ 2009 ఎన్నికల్లో గెలవడం కోసం టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంది. కేసీఆర్ విధించిన షరతు ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ ఓకే చేసి తీర్మానం చేసింది. అది ఆయన అతిపెద్ద సక్సెస్‌గా భావించవచ్చు.
నిరాహార దీక్షలు, భారీ సభలు, పాదయాత్రలు వంటి అనేక ఉద్యమ రూపాలను అనుసరిస్తున్నా తెలంగాణ వస్తుందో, రాదో అన్న అందోళన తెలంగాణ వాదులలో ఉండేది. కేసీఆర్ మాత్రం తెలంగాణ వస్తుందని ధీమాగా చెప్పగలిగేవారు. ముందుగా నాయకుడికే తను చేస్తున్నదానిపై నమ్మకం లేకపోతే, అనుసరించేవారికి విశ్వాసం ఎలా వస్తుందన్నది ఆయన థీరీ. తెలంగాణ వాదాన్ని ఆయనలా బలంగా మర్రి చెన్నారెడ్డితో సహా మరెవరూ తీసుకు వెళ్లలేకపోయారు. దానికి తోడు రాజకీయ పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి. దేశంలో గానీ, ఉమ్మడి ఏపీలో గానీ కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం, ఆయా రాష్ట్రాలలో బలమైన ప్రాంతీయ పార్టీలను కలుపుకొని అధికారం సాధించాలన్న లక్ష్యంతో 2004 ఎన్నికల ముందు కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ గులాం నబీ అజాద్ కాంగ్రెస్‌తో పొత్తుకు ఒప్పించారు.
2009లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఏర్పడటం, ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతినిపోవడం వంటి కారణాలవల్ల కనీసం తెలంగాణలో అయినా అధికారంలోకి రావాలన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని నమ్మేవారు అధికంగానే ఉంటారు. ఈ సంద ర్భంలో సోనియాగాంధీ పలు వ్యూహాత్మక తప్పిదాలు చేయడం కేసీఆర్ నెత్తిన పాలు పోసినట్లయింది. టీఆర్‌ఎస్‌ను విలీనం చేసు కోకుండా తెలంగాణ ఇవ్వడంతో కాంగ్రెస్ కోలుకోలేని విధంగా దెబ్బతింది. కాంగ్రెస్ తొలుత తెలంగాణను ప్రకటించి, ఏపీ నేతల ఒత్తిడి మేరకు నిలుపుదల చేయడం కేసీఆర్‌కు పెద్ద అస్త్రంగా మారింది. బీజేపీ ఎటూ ప్రత్యేక తెలంగాణకే కట్టుబడి ఉండటంతో ఇబ్బంది రాలేదు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ తెలంగాణ నేతలతో సైతం జై తెలంగాణ అనేలా చేయడంలో ఆయన కృతకృత్యులయ్యారు.
ఇలా సాధించిన తెలంగాణలో కేసీఆర్ వ్యూహాత్మకంగా రాజ కీయం నడిపి అధికారంలోకి రాగలిగారు. రెండోసారి ఆరు నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్లి మరోసారి గెలుపొందారు. ఇప్పుడు ప్రముఖ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిశోర్‌తో ఒప్పందం అయి, మూడోసారి విజయం సాధించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీపై దూకుడుగా విమర్శలు చేస్తూ, కాంగ్రెస్‌ను కూడా దెబ్బతీసే వ్యూహం అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పలు స్కీములు అమలు చేశారు. విద్యుత్ పరంగా ఎక్కడా పెద్ద సమస్య రాకుండా చేయడం ఆయన మొదటి సక్సెస్ అని చెప్పాలి. రైతు బంధు పేరుతో రైతులందరికీ ఎకరాకు ఐదు వేల చొప్పున పెట్టుబడి సాయం, లక్ష రూపాయల వరకు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి తదితర పథకాలను విజయవంతంగా అమలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు లక్ష కోట్ల వ్యయంతో నిర్మించి తన విజయంగా చూపించుకోగలిగారు.
కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేయకముందు కొంతకాలం చంద్ర బాబు క్యాబినెట్‌లో ఉండేవారు. 1999 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇది మొత్తం ఉమ్మడి ఏపీ చరిత్ర గతిని మార్చిందనడంలో సందేహం లేదు. అంతేగాక 2014లో గెలిచిన తర్వాత తన ప్రభుత్వాన్ని కూల్చడానికి చేసిన ప్రయత్నాలను కేసీఆర్ పసిగట్టి, చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వదలి వెళ్లేలా చేయగలిగారు. దాంతో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో నామమాత్రం చేయగలిగారు. టీఆర్‌ఎస్‌లో తనకు ఎదురు చెప్పేవారు ఎవరూ లేకుండా చేసుకోవడం, వివిధ పార్టీల పక్షాన ఎన్నికైన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకోవడం వంటి వ్యూహాల ద్వారా ఆయా పార్టీలను బలహీనపరిచారు. ఎ. నరేంద్ర వంటి కొద్ది మంది కేసీఆర్‌తో విభేదించి బయటకు వెళ్లినా బలమైన నేతలుగా ఎదగలేకపోయారు. 2004లో ఎన్నికైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో పది మంది పార్టీని వీడినప్పుడూ, 2009లో మహాకూటమి పరాజయం పాలైనప్పుడూ కొంత నిరాశకు గురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. ప్రజాస్వామ్యంలో రాజీనామాల అస్త్రాన్ని అత్యధిక సార్లు ప్రయో గించిన ఏకైక నేత కేసీఆర్.
అప్పులు అధికంగా చేశారనీ, కరెంటును అధిక రేట్లకు కొను గోలు చేయడం వల్ల వేల కోట్ల రూపాయలు బకాయిలు పడే పరిస్థితి ఏర్పడిందనీ, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు వంటి విమర్శలను టీఆర్‌ఎస్ ఎదుర్కొంటోంది. అయినా ఇవేవీ ఆ పార్టీని పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. కేసీఆర్ నాయకత్వ పటిమ, తన కుటుంబ సభ్యులు కూడా సమర్థులు కావడం వంటి కారణాలతో టీఆర్‌ఎస్‌ను ఎదురులేకుండా ఇన్నేళ్లుగా నడపగలుగుతున్నారు. పార్టీ భవిష్యత్తుకు కూడా ఢోకా లేకుండా ఆయన ఏర్పాటు చేసుకుంటు న్నారు. ఇది కేసీఆర్ విజయం. కాదు, ఘన విజయం!
వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
(నేడు టీఆర్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment