తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎజెండాను నిర్దిష్టంగానే రూపొందించుకుంటున్నప్పటికీ , దానిపై ఇంకా క్లారిటీకి వచ్చారా లేదా అన్న సందేహం కలుగుతుంది. గతంలో దేశంలో కాంగ్రెస్, బిజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. దానిపై ఆయన ఆయా రాష్ట్రాలలో పర్యటించి ముఖ్యమంత్రులను కలిసి వచ్చారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో జరిపిన చర్చలు అందరి దృష్టిని ఆకర్షించాయి. కాని బిజేపి మళ్లీ అదికారంలోకి రావడం, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడంతో ఆ ఆలోచన వెనుకబడిపోయింది.
పార్టీ అప్పట్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఫెడరల్ ప్రంట్ పై చర్చించారు.ఆ సమావేశంలో ఫెడరల్ ప్రంట్ పై ముందుకు వెళ్లాలని , దేశానికి కేసీఆర్ నాయకత్వం వహించాలని పలువురు వక్తలు సూచించారు. కాని ఈసారి ప్లీనరీలో ఆ ఫెడరల్ ఫ్రంట్ గురించి ప్రస్తావించకపోవడం గమనించదగిన అంశమే. దానికి బదులు ఆ ఫ్రంట్, ఈ ఫ్రంట్ కాదని, ప్రజలు గద్దె ఎక్కాలని ఆయన అన్నారు. దీని అర్దం ఏమిటో ఎవరూ చెప్పలేరు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నవారు అదికారంలోకి రావాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.
కాకపోతే వ్యూహాత్మకంగా ప్రజలను ఇన్వాల్వ్ చేస్తూ వారిని ఆకర్షించడానికి యత్నించారని అనుకోవచ్చు. బహుశా ఎన్నికల నిపుణుడు ప్రశాంత కిషోర్ తో జరిపిన చర్చల మేరకు ఆయన ప్రసంగం చేసి ఉండవచ్చు. కేసీఆర్ ప్రసంగంలో కాని, పార్టీ పరంగా చేసిన వివిధ తీర్మానాలలో కాని కేంద్రంపైన , బిజేపీపైన తీవ్ర విమర్శలు చేయడానికి ప్రాదాన్యం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీపై పెద్దగా విమర్శలు చేసినట్లు కనిపించలేదు. ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి రాష్ట్రాలు పన్ను తగ్గించాలని చేసిన ప్రకటన కేసీఆర్‌కు బాగా అసహనం కలిగించినట్లుగా ఉంది. దాంతో ఆయన ఆ అంశం ప్రస్తావించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేశం డెబ్బై ఐదేళ్లుగా సాధించిందేమిటి అన్న ప్రశ్నను ఆయన సంధిస్తూ, తాగు నీరు గ్రామాలకు ఇవ్వగలిగారా? కరెంటు సరఫరా చేయగలుగుతున్నారా? పేదరికం తగ్గించగలిగారా? చైనా, అమెరికా, సింగపూర్ వంటి దేశాలు ఎందుకు అభివృద్ది చెందుతున్నాయి? అదే ప్రకారం ఇండియా ఎందుకు ప్రగతి సాధించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో వీటన్నిటిని సాధిస్తే, దేశం మొత్తం ఎందుకు లక్ష్యం నెరవేర్చుకోలేకపోతోందని కేసీఆర్ అన్నారు. సుదీర్ఘంగా చేసిన ప్రసంగంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడంలో విఫలం అయిందని చెప్పడానికి పలు ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.
కాని దేశానికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఎజెండా ఇస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. పైగా మన దేశంలో ఒక రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి ఉన్న బౌతిక ,సామాజిక, ఆర్దిక పరిస్తితులు విభిన్నంగా ఉంటాయి. పైగా ఆయా రాష్ట్రాల మధ్య ఆయా అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంత దాకా ఎందుకు తన పొరుగున ఉన్న ఆంద్రప్రదేశ్ తో ఉన్న నదీ జలాల వివాదం, ఇతర అంశాలపైన ఒక అవగాహన రాలేదు. దేశానికి నాయకత్వం వహించదలిచన నేత ముందుగా ఇలాంటి అంశాలను పరిష్కరించుకోగలిగితే ఆయనకు గొప్పపేరు వస్తుంది. మరో ప్రధాన మార్పు ఏమిటంటే కేసీఆర్ నోట ప్రాంతీయ వాదం బదులు జాతీయవాదం ప్రముఖంగా రావడం ఆహ్వానించదగిన పరిణామం.
మొత్తం మీద చూస్తే ఈ ఉపన్యాసం అంతరార్ధం ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఫల్యాలను వివరించడం, మరో వైపు తెలంగాణ రాష్ట్రం అద్బుత ప్రగతి సాధించిందని ప్రజలకు తెలియచెప్పడం, దేశ రాజకీయాలలో తాను ఒక ప్రముఖ పాత్ర పోషించబోతున్నానని సంకేతం ఇవ్వడం వంటి లక్ష్యాలు ఉన్నట్లు కనిపిస్తాయి. టిఆర్ఎస్ శ్రేణులలో మళ్లీ విజయం మనదే అన్న విశ్వాసం మరింతగా పెంచడానికి కూడా ఈ ప్లీనరీలో ఆయన సహజంగానే వినియోగించుకున్నారు.
కేసీఆర్ కుమారుడు, పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ప్రసంగంలో భారతదేశానికి కేసీఆర్ వంటి నేత కావాలని స్పష్టంగా చెప్పడం ద్వారా ప్రధాని అభ్యర్దిగా ఆయనను పోకస్ చేసే యత్నం చేసినట్లు అర్దం అవుతుంది. బీజేపీది డబుల్ ఇంజన్ కాదని, బుల్ డోజర్ ప్రభుత్వమని, మనకు కావల్సింది గ్రోత్ ఇంజన్ అని ఆయన చెప్పారు. దేశానికి అభివృద్ది తెలంగాణ మోడల్ కావాలని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు.
అయితే కేసీఆర్ లక్ష్యం చేరుకోవడానికి చాలా శ్రమించవలసి ఉంటుంది. ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాలలో కేసీఆర్ బలమైన నేతగా గుర్తింపు పొందడం అంత తేలిక కాదు. అలాగే బీజేపీ, కాంగ్రెసేతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలన్నిటిని ఒక తాటిపైకి తీసుకు రావడం సాద్యం కాదు. ఉదాహరణకు తమిళనాడులో కాంగ్రెస్ , డి.ఎమ్.కె. లు ఒక కూటమిగా ఉన్నాయి. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ , నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలు ఒక కూటమిగా ఉన్నాయి. ఒడిషా, ఏపీలలో అదికారంలో ఉన్న బీజేడీ, వైసీపీలు కాంగ్రెస్ ,బిజెపిలకు దూరంగా ఉన్నాయి.
అదే సమయంలో వేరే కూటమిలో చేరడానికి ఎంతవరకు సిద్దంగా ఉంటాయన్నది ప్రశ్నార్దకమే. తెలంగాణలో టిఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీ పోటీగా ఉంటోంది. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరగడం ఈ రెండు పార్టీలకు ప్రత్యేకించి కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది.
కాకపోతే ఆయన పార్టీలో చేరకపోవడంతో ఈ పార్టీల నేతలు ఊపిరి పీల్చుకున్నారు. దేశంలో ప్రత్యామ్నాయ వేదిక రూపొందించాలంటే కాంగ్రెస్ ను కూడా కలుపుకుని వెళ్లక తప్పదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. బహుశా ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని కెసిఆర్ కాంగ్రెస్ పై పెద్దగా విమర్శలు చేసి ఉండకపోవచ్చు. లేదా కాంగ్రెస్ కు ప్రాదాన్యత ఇవ్వరాదని ఆయన భావించి ఉండవచ్చు. కాగా శాసనసభ్యుడు గాదరి కిషోర్ సూచించినట్లు భారతదేశ సమితి పార్టీని ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేస్తారా అన్నది సంశయమే. అయితే కేసీఆర్‌ను ప్రధాని అభ్యర్ధిగా పోకస్ చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో ఒక చర్చకు అవకాశం వస్తుంది.
ప్రధాని పదవికి కేసీఆర్ పోటీదారు అన్న భావన ఏర్పడితే తెలంగాణలో వచ్చే ఎన్నికలలో దాని ప్రభావం అధికంగా ఉండవచ్చు. తద్వారా శాసనసభ ఎన్నికలలో విజయం మరింత సులువు కావచ్చు. దేశం అంతా దళిత బందు స్కీమ్ ను అమలు చేయాలని పార్టీ ఒక తీర్మానం ఆమోదించింది.
ఇది ఎంత కష్టమైనదో అందరికి తెలుసు. అయినా కెసిఆర్ ఈ స్కీమును ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ స్కీమును రాజకీయ పార్టీలు ఏవీ పైకి వ్యతిరేకించకపోయినా, లోపల మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు అన్ని తీర్మానాలలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారు. భవిష్యత్తులో ఏమి చేస్తారన్నది వేరే విషయం కాని, మరోసారి తెలంగాణ రాజకీయాలు టిఆర్ఎస్ చుట్టూరా మాత్రమే పరిభ్రమించేలా కేసీఆర్ చేయగలిగారని చెప్పవచ్చు.
-వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment