‘లోక్‌సభ’కు సన్నద్ధం | Prepare To Lok Sabha Elections Telangana | Sakshi
Sakshi News home page

‘లోక్‌సభ’కు సన్నద్ధం

Published Mon, Feb 25 2019 8:57 AM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

Prepare To Lok Sabha Elections Telangana - Sakshi

హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశమైన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి (ఫైల్‌)

నిర్మల్‌: శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ లోక్‌సభ పోరుకు సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ పోరులో ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన సెంటిమెంట్‌తోనే ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలోనూ అందరికంటే ముందే టీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే శనివారం ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కలిసి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధాన ఎజెండా పార్లమెంట్‌ ఎన్నికలే కావడం గమనార్హం. సీఎం కేసీఆర్‌ ప్రతీ సమావేశం, సభలో తెలంగాణలో హైదరాబాద్‌ మినహా మిగిలిన 16స్థానాలను తామే గెలుస్తామని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా పార్లమెంట్‌ నియోజకవర్గాల సన్నాహాక సమావేశాలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మార్చి 8న ఆదిలాబాద్‌లో, 9న పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఈ సమావేశాల షెడ్యూల్‌ ఖరారైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలను మళ్లీ తామే కైవసం చేసుకుని పార్టీ అధినేతల మాట నిలుపాలన్న లక్ష్యంతో జిల్లా ప్రజాప్రతినిధులు ముందడుగు వేస్తున్నారు. అటు అధికార పార్టీ ఇప్పటి నుంచే లోక్‌సభ సమరానికి సన్నద్ధమవుతుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలో మాత్రం ఇంకా కదలిక కనిపించడం లేదు. అధికారులు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉండేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

రెండుస్థానాలు.. 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలు గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచినవే. ఉమ్మడి జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఆదిలాబాద్‌ పరిధిలో ఉండగా, తూర్పు ప్రాంతం పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. పశ్చిమ ప్రాంతంలోని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, ఆసిఫాబాద్, సిర్పూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి(ప్రస్తుతం జిల్లాకేంద్రం) కేంద్రంగా ఉన్న పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఇక ఈరెండు స్థానాలు ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రకారం ఆదిలాబాద్‌ ఎస్‌టీ, పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్‌ ఎంపీగా గోడెం నగేశ్‌ ఉండగా, పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌ శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

గెలిచి.. నిలబెట్టుకోవాలని.. 
ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానాలను మళ్లీ గెలిచి నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే శనివారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు, ఎంపీ సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేసేలా దిశానిర్దేశం చేయా లని నిర్ణయించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎంపీ సీట్లను గెలిపిస్తే ఢిల్లీస్థాయిలో తెలంగాణ అభివృద్ధి చక్రం తిప్పవచ్చన్న విషయాన్నీ వివరించాలని సూచించారు. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమష్టికృషితో అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ పరంగా అభ్యర్థుల ఖరారుపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఆదిలాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ నగేశ్‌ మళ్లీ పోటీలో ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక పెద్దపల్లి స్థానంపైనే పార్టీలో చర్చ కొనసాగుతోంది. ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ స్థానానికి మాజీ ఎంపీ వివేక్‌తో పాటు మరికొందరు పోటీ పడుతున్నట్లు సమాచారం

కేటీఆర్‌ టూర్‌ ఖరారు.. 
టీఆర్‌ఎస్‌ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహాక సమావేశాలు మార్చి 1 నుంచి 11 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొననున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 8న ఆదిలాబాద్‌లో, మరుసటి రోజు 9న పెద్దపల్లి జిల్లా రామగుండంలో సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు షురూ చేశారు.

స్తబ్ధుగానే ప్రతిపక్షాలు 
అధికార టీఆర్‌ఎస్‌లో ఇప్పటికే పార్లమెంట్‌ ఎన్నికల ప్రభావం కనిపిస్తుండగా ప్రతిపక్షాల్లో మాత్రం ఆ సందడి ఇంకా మొదలు కాలేదు. ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో ఓడినా పార్లమెంట్‌లో గెలువాలన్న తపనతో ఉంది. ఎలాగైనా అత్యధిక స్థానాలను గెలుచుకుని తమ అధినేత రా>హుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలని భావిస్తోంది. కానీ.. అలాంటి పార్టీ ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పనిని మొదలు పెట్టినట్లుగా కనిపించడం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్‌ హవా నడిచిన రోజుల్లో రెండు స్థానాలనూ గెలిచిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఒక్క ఆసిఫాబాద్‌ స్థానాన్ని గెలుచుకుని ఉమ్మడి జిల్లాలో పరువు నిలబెట్టుకుంది. ఇక లోక్‌సభ స్థానాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.

ఆదిలాబాద్‌ పరిధిలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పెద్దపల్లి పరిధిలో ప్రేంసాగర్‌రావు వర్గాలు పార్టీలో బలంగా ఉన్నాయి. ఈ రెండు వర్గాలతో సంబంధం లేకుండా పలువురు అధిష్ఠానంతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తూ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక మళ్లీ తమ నరేంద్రుడిని ప్రధాని చేస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో బోణి కొట్టలేకపోయింది. ఈసారీ విజయం అంత ఈజీ కాదన్న విషయం ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఎంపీ స్థానానికి పోటీ పడేస్థాయి గల నాయకుల కోసం పార్టీ అధినేతలు చూస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల్లోనూ కొందరు ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

అధికారులు సిద్ధం.. 
పార్టీలతోపాటుగా జిల్లాల అధికారులూ లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మం చిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాలో ఈవీఎంల ఫస్ట్‌ లెవల్‌ చెక్‌ పూర్తయ్యింది. త్వరలోనే రెండోసారి పరిశీలన ప్రారంభం కానుంది. మరోవైపు ఈనెల 22న ఓటర్ల తుది జాబితా వచ్చేసింది. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20,63,963 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 10,20,320 మంది పురుషులు, 10,43,552మంది మహిళలు, ఇతరులు 91 మంది ఓటర్లు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement