సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, ఒప్పందాలు కుదిరాకే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని.. కానీ ఏపీ మాత్రం ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్షంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టును విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారని.. కానీ తాగునీటి కోసమనే పేరిట ఈ ప్రాజెక్టు నుంచి రాయలసీమ, నెల్లూరుకు సాగునీరు తరలిస్తున్నారని విమర్శించారు. కృష్ణా నదిలో తెలంగాణ కంటే తక్కువ పరీవాహక ప్రాంతం ఉన్న ఏపీకి 512 టీఎంసీలు కేటాయించడం అన్యాయమన్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 300 మీటర్ల వెడల్పుతో కాల్వలు తవ్వుతోందని.. మొత్తం నదినే మళ్లించి, రిజర్వాయర్‌ను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో తెలంగాణకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని వాడుకునేందుకే జోగుళాంబ బ్యారేజీ, భీమా ఇరిగేషన్ కాల్వను ప్రతిపాదించామని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను కేంద్రం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసులు వేయరేం..
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. మరి ఏపీ అక్రమ ప్రాజెక్టుల మీద ఎందుకు కేసులు వేయడం లేదని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తయి కేసీఆర్‌కు మంచి పేరు వస్తే ఎలాగనే దురుద్దేశంతోనే కాంగ్రెస్, బీజేపీ స్పందించడం లేదని ఆరోపించారు. నదీ జలాలు, ఉద్యోగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలకు కాంగ్రెస్‌దే బాధ్యత అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment