సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్‌ఎంఈ) రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వాటిని మరింత ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత శరవేగంగా వృద్ధి చెందుతున్న ఎంఎస్‌ఎంఈ రంగం తక్కువ పెట్టుబడితో నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. ఇటు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు క్రమేపీ తగ్గుతున్న నేపథ్యంలో గ్రామీణ పారిశ్రామికీకరణకు ఎంఎస్‌ఎంఈ రంగం ఊతమిస్తోంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక సర్వే కూడా వెల్లడిస్తోంది. రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో 2015 జనవరి తర్వాత తమ కార్యకలాపాలు ప్రారంభించిన సూక్ష్మ, చిన్న, తరహా పరిశ్రమలు రూ.8,885 కోట్ల పెట్టుబడులతో ప్రారంభమై.. ఇప్పటివరకు అదనంగా 1.21 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
సూక్ష్మ పరిశ్రమలే ముందు..
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రంగం పురోగతిని విశ్లేషిస్తే.. జనవరి, 2015 నుంచి జూలై, 2019 మధ్య కాలంలో కొత్త యూనిట్ల ఏర్పాటులో సూక్ష్మ పరిశ్రమలు అగ్రస్థానంలో ఉన్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన పారిశ్రామిక యూనిట్లలో 56.62 శాతం యూనిట్లు ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందినవే కావడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక పెట్టుబడుల్లో సూక్ష్మ పరిశ్రమల వాటా 10.97 శాతం కాగా, ఉపాధి కల్పనలో 27.33 శాతంగా నమోదైంది.
రుణ వితరణకు ప్రాధాన్యత..
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని.. ఈ రంగానికి అవసరమైనంత మేర రుణ వితరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2019–20 వార్షిక రుణ ప్రణాళి కలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రూ.21,420 కోట్ల రుణ వితరణ చేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. ఇక పారిశ్రామిక సరుకుల ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ కీలక రాష్ట్రంగా ఎదుగుతోంది. 2017–18లో రాష్ట్రం నుంచి రూ.42,363 కోట్ల మేర సరుకుల రవాణా జరగ్గా, 2018–19 నాటికి ఇది రూ.50,510 కోట్లకు చేరుకుంది. అంతకుమందు ఏడాదితో పోలిస్తే సరుకుల ఎగుమతిలో ఏకంగా 19 శాతం వృద్ధిరేటు నమోదైంది. రాష్ట్రం నుంచి జరుగుతున్న సరుకుల ఎగుమతిలో ఆర్గానిక్ కెమికల్స్ వాటా 30 శాతం కాగా, ఫార్మాసూటికల్ ఉత్పత్తుల ఎగుమతి శాతం 29గా నమోదైంది.
2019–20 సూక్ష్మ, చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి రుణాలు..21,420కోట్లు
ఐదేళ్లలో కొత్తగా వచ్చిన సూక్ష్మ, చిన్న పరిశ్రమలు..6,438
ఈ రంగంలో మొత్తం పెట్టుబడులు..9,000 కోట్లు
ఈ ఐదేళ్లలో ఉపాధి పొందిన వారి సంఖ్య..1.21లక్షలు
ఐదేళ్లలో కొత్తగా వచ్చిన సూక్ష్మ, చిన్న పరిశ్రమలు..50,000 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment