ఉద్యమంతో మొదలై... ఉజ్వలమై.. | about telangana formation day details in telugu | Sakshi
Sakshi News home page

ఉద్యమంతో మొదలై... ఉజ్వలమై..

Published Sat, Jun 3 2023 3:20 AM | Last Updated on Sat, Jun 3 2023 3:24 AM

about telangana formation day details in telugu - Sakshi

త్వరలో పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ 
అర్హులైన పేదలకు ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించాం. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను ఇండ్ల నిర్మాణాల కోసం కేటాయిస్తాం. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కేసీఆర్

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యమ ప్రస్థానంతో మొదలై.. ఉజ్వల ప్రగతి వైపు తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని.. తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగిడుతున్న రాష్ట్రం దేశానికే మార్గదర్శిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. దేశంలోనే తక్కువ వయసున్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధి పరుగులో ముందు వరుసలో నిలబడిందని.. తొమ్మిదేళ్లలోనే ప్రతి రంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయేలా ఫలితాలను సాధించి, పదో సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఒక మైలురాయి అని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటిచెబుదామని పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు వెనుకబడిన తరగతులు, ఇతర వర్గాలకు కొత్త పథకాలను ప్రకటించారు. కార్యక్రమంలో కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 
 
‘‘రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ తొలి ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రిగా నేను వాగ్దానం చేశాను. తెలంగాణను దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చాను. ఆ ఉక్కు సంకల్పాన్ని ఏమాత్రం చెదరనివ్వలేదు. తొమ్మిదేళ్లలో అనేక రంగాల్లో దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ తొమ్మిదేళ్లలో కరోనా మహమ్మారి వల్ల దాదాపు మూడేళ్ల కాలం వృధాగా పోయింది. మిగతా ఆరేళ్లలోనే వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించింది. దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్‌ అనే మాట మారుమోగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా మన్ననలు అందుకుంటోంది. అనేక సవాళ్లు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. ఇప్పుడు పరుగులు తీస్తోందంటే అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, ప్రజల సహకారమే కారణం. 
 
బీసీల్లోని కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం
రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తిదారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తాం. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాలకు ఈ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా గొల్ల, కురుమలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టాం. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. ప్రస్తుతం రెండో విడతలో రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభిస్తాం. 


 
ఈ నెల 24 నుంచి పోడు పట్టాలు 
రాష్ట్రంలో పోడు సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీల చిరకాల ఆకాంక్షను ప్రభుత్వం తీరుస్తోంది. ఈ నెల జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. అటవీ భూములపై ఆధారపడిన 15 లక్షల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కలి్పంచనున్నాం. అదేవిధంగా వారికి రైతుబంధు పథకాన్ని కూడా వర్తింపజేస్తాం. 
 
అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ 
పేదల ప్రతి సమస్యనూ సూక్ష్మంగా అర్థం చేసుకొని పరిష్కరించే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గర్భిణులలో రక్తహీనత సమస్యను నివారించడం, గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదగడం కోసం ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పోషకాహారాన్ని న్యూట్రిషన్‌ కిట్ల ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటికే ఈ పథకాన్ని 9 జిల్లాల్లో ప్రారంభించగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే మిగతా 24 జిల్లాల్లోనూ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీని ప్రారంభిస్తాం. 
 
ఉద్యమంలా దళితబంధు
దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో ‘దళితబంధు’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు నూరు శాతం గ్రాంట్‌గా అందిస్తోంది. దళితులు తమకు నచి్చన ఉపాధిని ఎంచుకొని ఆత్మగౌరవంతో జీవించడానికి అండదండగా నిలుస్తోంది. దళితబంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు 50వేల మంది లబి్ధదారులకు రూ.5వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించాం. రెండో విడతలో భాగంగా 1.30లక్షల మందికి దళిత బంధు అందించనున్నాం. 
 
రైతు బంధువులకు రూ.65 వేల కోట్ల సాయం 
రాష్ట్రంలో రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు పది విడతల్లో 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు అందించాం. భూరికార్డుల డిజిటలైజేషన్‌తో రైతుల భూముల వివరాలపై వచి్చన స్పష్టత ఆధారంగా.. నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయగలుగుతున్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతులకు ఇంత భారీగా పెట్టుబడి సాయం అందించలేదు. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే.. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశపెట్టాం. రైతు మరణించిన పది రోజుల్లోపే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నాం. 
 
నూతన సచివాలయం.. భారీ అంబేడ్కర్‌ విగ్రహం
హైదరాబాద్‌ నడిబొడ్డున వెలసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయ సౌధం రాష్ట్ర ప్రతిష్టకు ఉజ్వల సంకేతంగా నిలిచింది. గతంలో ముఖ్యమంత్రి కూర్చునే చాంబర్‌కు వెళ్లేదారి ఒక చీకటి గుహలోకి ప్రవేశించినట్టుగా ఉండేది. ఉద్యోగులు ఆఫీసు టేబుళ్ల మీదనే భోజనం చేయాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి ఇక్కట్లేవీ లేకుండా అధునాతన హంగులతో, అన్ని శాఖల కార్యాలయాలను అనుసంధానిస్తూ, వాస్తు నిర్మాణ కౌశలం ఉట్టిపడేలా కొత్త సచివాలయ సౌధాన్ని నిర్మించుకున్నాం. 

బాబాసాహెబ్‌ ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో సచివాలయానికి ఆయన పేరు పెట్టుకోవడంతోపాటు.. సచివాలయం సమీపంలోనే 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. సచివాలయానికి మరోవైపు అమరవీరుల స్మారకం నిర్మించుకున్నాం. ఒకవైపు భారీ అంబేడ్కర్‌ విగ్రహం, దానికి ఎదురుగా హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుని విగ్రహం, నభూతో న భవిష్యతి అన్నరీతిన నిర్మించిన సచివాలయ సౌధం, అమరవీరులను ప్రతిరోజూ స్మరణకు తెచ్చే అమరజ్యోతి.. ఇవన్నీ మనకు నిత్యం కర్తవ్య బోధ చేస్తుంటాయి. సచివాలయం ఎదురుగా ఉన్న విశాలస్థలంలో తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుకోబోతున్నాం. 
 
నిరంతర ప్రక్రియగా పేదలకు గృహ నిర్మాణం
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాం. పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇచ్చే పథకం మరెక్కడా లేదు. కొల్లూరులో 124 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల సముదాయం ఓ టౌన్‌íÙప్‌ను తలపించేలా ఉంది. అక్కడ 117 బ్లాకుల్లో 15,660 ప్లాట్లు నిర్మించాం. ఇదో ఉదాహరణ మాత్రమే. పేదలకు గృహ నిర్మాణం అనేది ఓ నిరంతర ప్రక్రియ. దీనిని కొనసాగిస్తునే ఉంటాం. 
 
సురక్షిత జలాల మిషన్‌ భగీరథ
మిషన్‌ భగీరథ ద్వారా నూటికి నూరు శాతం ఇళ్లకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుంటే.. ప్రజలను ఓట్లు అడగబోనని రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాను. ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ మూడోస్థానంలో ఉంది. తెలంగాణ ప్రారంభించిన మిషన్‌ భగీరథను అనుకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘హర్‌ ఘర్‌ జల్‌ యోజన’ పేరిట పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 
 
విద్యుత్‌ విజయం
తెలంగాణ ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుకాగా.. ఇప్పుడు 18,453 మెగావాట్లకు పెంచుకున్నాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు సోలార్‌ పవర్‌ ఉత్పత్తి 74 మెగావాట్లే ఉండగా.. ఇప్పుడు 5,741 మెగావాట్లకు పెంచగలిగాం. సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించింది. సంస్థలో అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. 
 
సాగునీటి రంగంలో స్వర్ణయుగం
సమైక్య రాష్ట్రంలో మూలనపడ్డ కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, దేవాదుల, తదితర పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేయడంతో 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. వలసల జిల్లా ఉమ్మడి పాలమూరు ఈరోజు పంట కాలువలతో పచ్చని చేలతో కళకళలాడుతోంది. వలస వెళ్లిన జనం సొంతూర్లకు తిరిగి వచి్చ.. పొలాలు సాగు చేసుకుంటున్నారు. అద్భుతమైన ఈ మార్పుకు అద్దంపడుతూ ‘‘వలసలతో వలవల విలపించు కరువు జిల్లా, పెండింగ్‌ ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేసి, చెరువులన్ని నింపి, పన్నీటి జలకమాడి, పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది..’’ అని నేనే స్వయంగా పాట రాశాను. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80శాతానికిపైగా పూర్తయింది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయి. 

తెలంగాణ ఆధ్యాత్మిక వైభవం 
తెలంగాణ ఆధ్యాత్మిక వైభవ ప్రతీక అయిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతమని యావన్మందీ కొనియాడుతున్నారు. అలాగే కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేశాం. ఇటీవల నేను స్వయంగా ఆ ఆలయానికి వెళ్లి పరిశీలించి, దేశంలో కెల్లా ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంగా దీన్ని తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇదే తరహాలో వేములవాడ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల చొప్పున కేటాయించాం. పనులు పురోగతిలో ఉన్నాయి. భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయం సైతం ఇదేవిధంగా వైభవంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మన రాష్ట్రంలో కాకతీయుల కళావైభవానికి ప్రతీకగా నిలచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు వెనుక ప్రభుత్వం చేసిన కృషి ఎంతో ఉంది. 

రైతుబంధుకు రూ. 65 వేల కోట్ల సాయం
రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు పది విడతల్లో 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు అందించాం. భూరికార్డుల డిజిటలైజేషన్‌తో రైతుల భూముల వివరాలపై స్పష్టత ఆధారంగా.. నగదును రైతుల ఖాతాల్లో జమ చేయగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా రైతులకు ఇంత భారీగా పెట్టుబడి సాయం అందట్లేదు. ఒకవేళ రైతు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశపెట్టాం. రైతు మరణించిన 10 రోజుల్లోపే రూ. 5 లక్షల పరిహారం అందిస్తున్నాం.

బీసీల్లోని కులవృత్తిదారులకు రూ. లక్ష సాయం 
రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తిదారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తాం. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాలకు ఈ పథకంతో ఎంతో లబ్ధి చేకూరుతుంది. గొల్ల, కురుమలకు భారీగా గొర్రెల పంపిణీని చేపట్టాం. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. ప్రస్తుతం రెండో విడతలో రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీని దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభిస్తాం.

ఉద్యమంలా దళితబంధు 
దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో ‘దళితబంధు’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు నూరు శాతం గ్రాంట్‌గా అందిస్తోంది. దళితులు తమకు నచి్చన ఉపాధిని ఎంచుకొని ఆత్మగౌరవంతో జీవించడానికి అండదండగా నిలుస్తోంది. దళితబంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు 50వేల మంది లబి్ధదారులకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.17,700 కో ట్లు కేటాయించాం. రెండో విడతలో భాగంగా 1.30 లక్షల మందికి దళితబంధు అందించనున్నాం.  
 
కాశీ, శబరిమలలో వసతిగృహాలు
సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని సందర్శించాలని కోరుకుంటారు. తెలంగాణ నుంచి కాశీకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం 60 వేల చదరపు అడుగుల్లో అక్కడ ఓ వసతి గృహం నిర్మించబోతున్నాం. అదేవిధంగా శబరిమలకు వెళ్లే తెలంగాణ భక్తుల కోసం అక్కడ వసతి గృహం నిర్మిస్తున్నాం. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధ వనాన్ని అద్భుతంగా నిర్మించింది..’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. చివరిగా ‘ధర్మస్య విజయోస్తు.. అధర్మస్య నాశోస్తు.. ప్రాణిషు సద్భావనాస్తు.. విశ్వస్య కల్యాణమస్తు..’ అని శ్లోకంతో ప్రసంగం ముగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement