సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ రాష్ట్ర సాధన అసాధ్యమన్నారు. కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్‌ఎస్ ఖతమైంది అంటూ కొందరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మేము మళ్లీ అధికారంలోకి వస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు.
కాగా, తెలంగాణభవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు. మనకు మనమే కాదు, ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. కొన్ని క్షణాల గొప్పగా ఉంటాయి, కొన్ని క్షణాలు బాధగా ఉంటాయి. ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేలా ఉంది. అన్ని పదవుల్లో నేను అనేక రోజులు చేశాను.
1969 ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మంచైనా చెడైనా మీతోనే ఉంటాము అని పనిచేసింది టీఎన్జీవో సంఘం. మన భాష మాట్లాడుతుంటే నవ్వుతారో ఏమో అనుకునే స్థాయి ఉండేది ఆనాడు. వలసలు పోతుంటే కనీసం ఆపలేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు. స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అయితేనే చేస్తా అని ఉద్యమంలోకి వచ్చాను. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది. జయశంకర్ వంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.
మళ్ళీ ఉద్యమం నేను మొదలు పెట్టాను. చావనైనా చావాలి లేదంటే చంపాలి అని నేను ముందున్నాను. పాతాళంలో ఉన్న తెలంగాణపైకి తీసుకొచ్చాం. పాటతో మొత్తం తెలంగాణ చరిత్ర తెలిసేది. చరణంలోనే మొత్తం తెలువాలే. అందుకే తెలంగాణ పాటతో పుట్టింది. 25ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది. బీఆర్ఎస్ ఖతం అయితది అంటున్నాడు. ఖతం అయితదా?. మళ్ళీ నేను బస్సెక్కితే చూసారు కదా నా వెంట వచ్చారు మొత్తం. వందకు వంద శాతం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మొన్న నాదగ్గరికి ఒకరు వచ్చి చెప్పాడు ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌కు 105 స్థానాలు వస్తాయని చెప్పారు.
రైతు బంధు అనేది ఊరికనే ఇవ్వలేదు. స్థిరీకరణ కోసం ఇచ్చాం. చేప పిల్లలు, గొర్రెలు ఇస్తుంటే కూడా అవమానించారు. ఎన్ని చేసినా కొంత విష గాలి వస్తుంది. ఆ గాలికి జనం కొంత అటు వైపు మొగ్గు చూపారు. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పని చేయాలి. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పనులు, వెర్రిమొర్రి వేషాలు అన్ని కనిపిస్తున్నాయి. కరెంట్ విషయంలో ప్రభుత్వం తీరు బాధాకరం. కరెంట్ లేక జనం చనిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఎక్కువ రోజులు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం స్టెప్ డౌన్ అవుతుంది. గత పదేళల్లో రైతులకు విత్తనాలను సక్రమంగా ఇచ్చాం. మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చి లైన్లో నిల్చోవాలన్సిన పరిస్థితి వచ్చింది.
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానం గెలిచాం. వరంగల్‌లో హీరో రాకేష్ రెడ్డి కూడా గెలుస్తున్నాడు. పార్లమెంట్‌లో ఎన్నైనా రావొచ్చు. ఎక్కువ సీట్లు వస్తే పొంగి పోయేది లేదు. తక్కువ వస్తే కుంగి పోయేది లేదు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పార్టీ ప్లీనరీ సమావేశం చేసుకోలేదు. పార్టీ వార్షికోత్సవాన్ని రెండు రోజులపాటు ఘనంగా అద్భుతంగా చేసుకుందాం’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment