27 లక్షల మహిళా పారిశ్రామికవేత్తలకు లబ్ధి | Enhanced credit guarantee coverage to profit 2. 7 million women-led MSMEs | Sakshi
Sakshi News home page

27 లక్షల మహిళా పారిశ్రామికవేత్తలకు లబ్ధి

Published Wed, Sep 18 2024 6:18 AM | Last Updated on Wed, Sep 18 2024 8:29 AM

Enhanced credit guarantee coverage to profit 2. 7 million women-led MSMEs

సీజీటీఎంఎస్‌ఈ పథకంతో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు ప్రయోజనం 

కేంద్ర మంత్రి జితన్‌రామ్‌ మాంఝీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సీజీటీఎంఎస్‌ఈ పథకం కింద మహిళల ఆధ్వర్యంలోని సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు 90 శాతం వరకు మెరుగైన రుణ హామీ కవరేజీ లభిస్తుందని కేంద్ర మంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ తెలిపారు. 27 లక్షల మహిళల ఎంఎస్‌ఎంఈలకు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు) దీని కింద ప్రయోజనం దక్కుతుందన్నారు. 

మహిళా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి హామీలేని రుణ సాయాన్ని పొందే దిశగా ఇది కీలక నిర్ణయం అవుతుందన్నారు. క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ ట్రస్ట్‌ ఫర్‌ మైక్రో, స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (సీజీటీఎంఎస్‌ఈ) బోర్డ్‌ ఆమోదానికి ముందు మహిళల ఆధ్వర్యంలోని సంస్థలకు 85 శాతం వరకే రుణ హామీ రక్షణ ఉండేది. దీన్ని 90 శాతానికి పెంచడం వల్ల మరింత మందికి ప్రయోజనం దక్కుతుందని మంత్రి మాంఝీ పేర్కొన్నారు.

 నరేంద్ర మోదీ సర్కారు 100 రోజుల పాలనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. 5.07 కోట్ల ఎంఎస్‌ఎంఈలు సంఘటిత వ్యవస్థలోకి చేరాయని, 21 కోట్ల ఉద్యోగాలు ఏర్పడినట్టు వివరించారు.

 ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద గడిచిన 100 రోజుల్లో 26,426 సూక్ష్మ సంస్థలు ఏర్పాటయ్యాయని, వాటికి రూ.3,148 కోట్ల రుణాలు మంజూరైనట్టు మంత్రి వెల్లడించారు. వీటి రూపంలో 2.11 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం పెరుగుతుందన్నారు.  

14 టెక్నాలజీ కేంద్రాలు 
రూ.2,800 కోట్లతో, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా 14 టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ తెలిపారు. నాగ్‌పూర్, పుణె, బొకారోలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘‘వీటిని ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పుతాం. స్థానిక ఎంఎస్‌ఎంఈలు వీటి ద్వారా తయారీలో అత్యాధునిక సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార సలహా సేవలు పొందొచ్చు. టెక్నాలజీ లభ్యతతో లక్ష ఎంఎస్‌ఎంఈలు ప్రయోజనం పొందుతాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో 3 లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తాం’’అని మంత్రి వివరించారు. పీఎం విశ్వకర్మ పథకం మొదలై ఏడాది అయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఈ నెల 20న ఓ మెగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement