micro small medium enterprises
-
27 లక్షల మహిళా పారిశ్రామికవేత్తలకు లబ్ధి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సీజీటీఎంఎస్ఈ పథకం కింద మహిళల ఆధ్వర్యంలోని సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు 90 శాతం వరకు మెరుగైన రుణ హామీ కవరేజీ లభిస్తుందని కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ తెలిపారు. 27 లక్షల మహిళల ఎంఎస్ఎంఈలకు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు) దీని కింద ప్రయోజనం దక్కుతుందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి హామీలేని రుణ సాయాన్ని పొందే దిశగా ఇది కీలక నిర్ణయం అవుతుందన్నారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) బోర్డ్ ఆమోదానికి ముందు మహిళల ఆధ్వర్యంలోని సంస్థలకు 85 శాతం వరకే రుణ హామీ రక్షణ ఉండేది. దీన్ని 90 శాతానికి పెంచడం వల్ల మరింత మందికి ప్రయోజనం దక్కుతుందని మంత్రి మాంఝీ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ సర్కారు 100 రోజుల పాలనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. 5.07 కోట్ల ఎంఎస్ఎంఈలు సంఘటిత వ్యవస్థలోకి చేరాయని, 21 కోట్ల ఉద్యోగాలు ఏర్పడినట్టు వివరించారు. ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద గడిచిన 100 రోజుల్లో 26,426 సూక్ష్మ సంస్థలు ఏర్పాటయ్యాయని, వాటికి రూ.3,148 కోట్ల రుణాలు మంజూరైనట్టు మంత్రి వెల్లడించారు. వీటి రూపంలో 2.11 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం పెరుగుతుందన్నారు. 14 టెక్నాలజీ కేంద్రాలు రూ.2,800 కోట్లతో, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా 14 టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి జితన్ రామ్ మాంఝీ తెలిపారు. నాగ్‌పూర్, పుణె, బొకారోలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘‘వీటిని ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పుతాం. స్థానిక ఎంఎస్ఎంఈలు వీటి ద్వారా తయారీలో అత్యాధునిక సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార సలహా సేవలు పొందొచ్చు. టెక్నాలజీ లభ్యతతో లక్ష ఎంఎస్ఎంఈలు ప్రయోజనం పొందుతాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో 3 లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తాం’’అని మంత్రి వివరించారు. పీఎం విశ్వకర్మ పథకం మొదలై ఏడాది అయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఈ నెల 20న ఓ మెగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. -
ఎంఎస్ఎంఈల్లో ఆశాభావం
ముంబై: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎంఎస్ఎంఈ) ఈ ఏడాది పట్ల ఎంతో సానుకూలత కనిపిస్తోంది. లాభాలు పెరుగుతాయని 96 శాతం అభిప్రాయపడుతున్నాయి. ఎంఎస్ఎంఈలకు సంబంధించి నియో గ్రోత్ అనే సంస్థ వ్యాపార విశ్వాస అధ్యయనాన్ని నిర్వహించింది. దీనికి సంబంధించి వివరాలు విడుదల చేసింది. ఎంఎస్ఎంఈలకు నియోగ్రోత్ రుణాలు అందిస్తుంటుంది. దేశవ్యాప్తంగా 3,000 ఎంఎస్ఎంఈల యజమానుల నుంచి ఈ సర్వేలో భాగంగా అభిప్రాయాలను తెలుసుకుంది. 25 పట్టణాల పరిధిలో, 70కు పైగా వ్యాపార విభాగాల్లో ఈ సంస్థలు పనిచేస్తున్నాయి. తమ వృద్ధి పట్ల, లాభదాయకత పట్ల ఎంఎస్ఎంఈల్లో వ్యాపార విశ్వాసం వ్యక్తం కావడం సానుకూలమని నియోగ్రోత్ సీఈవో, ఎండీ అరుణ్ నయ్యర్ పేర్కొన్నారు. బలమైన డిజిటల్ ఎకోసిస్టమ్ ఉండడం ఈ ఏడాది ఎంఎస్ఎంఈ రుణ పంపిణీకి మంచి ప్రేరణగా పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు రుణ సాయంతో తమ వ్యాపారాలను విస్తరింకోవడానికి సుముఖంగా ఉన్నాయని చెప్పారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి చేరువ అవుతున్న క్రమంలో 2023 సంవత్సరం ఎంఎస్ఎంఈలకు ఎంతో కీలకమని, ఇవి ముఖ్య పాత్ర పోషించగలవని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఎంఎస్ఎంఈ రంగం ఆశాభావంతో ఉండడం ప్రోత్సాహకర సంకేతంగా నియోగ్రోత్ పేర్కొంది. వృద్ధిపై ఆశావహం సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురు ఎంఎస్ఎంఈ ప్రతినిధుల్లో ముగ్గురు (75 శాతం) దేశ ఆర్థిక వృద్ధి పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. 20 శాతం మంది తటస్థ అభిప్రాయంతో ఉంటే, 5 శాతం మంది మాత్రమే ప్రతికూల అంచనాలతో ఉన్నారు. తయారీ, సేవల రంగాల్లో పనిచేస్తున్న 80 శాతం మహిళా ఎంస్ఎంఈలు (మహిళల ఆధ్వర్యంలో నడిచేవి) దేశ ఆర్థిక వృద్ధి పట్ల సానుకూలంగా ఉన్నాయి. వినియోగ డిమాండ్ 75 శాతం ఎంఎస్ఎంఈలు వినియోగ డిమాండ్ ఈ ఏడాది పెరుగుతుందన్న అంచనాతో ఉన్నాయి. 21 శాతం ఎంఎస్ఎంఈ ప్రతినిధులు ప్రస్తుతం మాదిరే డిమాండ్ కొనసాగుతుందని భావిస్తుంటే, డిమాండ్ తగ్గుతుందన్న అభిప్రాయం 4 శాతం ఎంఎస్ఎంఈ ప్రతినిధుల నుంచి వ్యక్తమైంది. అత్యధికంగా చెన్నైకు చెందిన 86 శాతం ఎంఎస్ఎంఈలు, హైదరాబాద్‌కు చెందిన 83 శాతం, ముంబై నుంచి 81 శాతం ఎంఎస్ఎంఈలు వినియోగంపై ఆశాభావంతో ఉన్నాయి. రిటైల్ వాణిజ్యంలోని ఎంఎస్ఎంఈలు ఈ ఏడాది బలమైన డిమాండ్ పట్ల సానుకూలంగా ఉన్నాయి. అలాగే, మహిళల ఆధ్వర్యంలో టోకు వాణిజ్యంలో పనిచేసే ఎంఎస్ఎంఈల్లోనూ ఇదే మాదిరి అభిప్రాయం వ్యక్తమైంది. వ్యాపార లాభదాయకత 96 శాతం ఎంఎస్ఎంఈలు ఈ ఏడాది తమ వ్యాపా ర లాభాలు వృద్ధి చెందుతాయని భావిస్తున్నాయి. ఇలా భావించే వాటిల్లో 66 శాతం తమ లాభాలు 30 శాతం మేర పెరుగుతాయని అంచనాతో ఉన్నా యి. 30 శాతం ఎంఎస్ఎంఈలు తమ లాభాల్లో వృద్ధి 30 శాతం లోపు ఉండొచ్చని, 4 శాతం ఎంఎస్ఎంఈలు లాభాలు తగ్గుతాయని భావిస్తున్నాయి. చెన్నై నుంచి అత్యధికంగా 80 శాతం ఎంఎస్ఎంఈలు లాభాలు 30 శాతానికి పైనే పెరుగుతాయనే అంచనాను వ్యక్తం చేశాయి. ముంబై, పుణె నగరాల్లో పనిచేసే ఎంఎస్ఎంఈలు కొంత రక్షణాత్మక అంచనాతో ఉన్నాయి. రుణ డిమాండ్ మెట్రోయేతర పట్టణాల్లోని 84 శాతం ఎంఎస్ఎంఈలు వ్యాపార రుణాలను తీసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాయి. ఎంఎస్ఎంఈల వ్యాపారం కోలుకుంటుండడంతో, మూలధన అవసరాలు, వృద్ధి, విస్తరణకు రుణాలు అవసరం పడనున్నాయి. తయారీ, సేవల రంగాల్లోని 80 శాతం మహిళా ఎంఎస్ఎంఈలు వ్యాపార రుణాలను తీసుకోవచ్చని చె ప్పాయి. 60 శాతం ఎంఎస్ఎంఈలు డిజిటల్ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టనున్నట్టు, డిజిటల్ టెక్నా లజీని అందిపుచ్చుకునేందుకు సముఖంగా ఉన్నట్టు చెప్పాయి. 61 శాతం ఎంఎస్ఎంఈ అధినేతలు త మ సిబ్బంది సంఖ్యను పెంచుకోనున్నట్టు తెలిపారు. -
నిధుల సమీకరణకు ‘ద్వంద్వ లిస్టింగ్’ మార్గం
ముంబై: చిన్న వ్యాపార సంస్థలు (ఎస్ఎంఈలు) తమ మూలధన సమీకరణ పక్రియను విస్తృతం చేయడానికి ‘‘ద్వంద్వ లిస్టింగ్’’ను పరిగణనలోకి తీసుకోవాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. బొంబాయి స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ) ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌తోపాటు గాంధీనగర్ గిఫ్ట్సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో లిస్ట్ అయ్యే అవకాశాలు, ప్రయోజనాలను పరిశీలించాలని కోరారు. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై 400 కంపెనీల లిస్టింగ్ అయిన సందర్భాన్ని పురష్కరించుకుని జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ సూచన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► నిధుల సమీకరణకు సంబంధించి లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో కొన్ని గిఫ్ట్ సిటీ ప్లాట్‌ఫామ్ లేదా ముంబై బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ లేదా రెండింటిలో ద్వంద్వ లిస్టింగ్ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ దిశలో మార్గాలను అన్వేషించడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఇవ్వడానికి తగిన చర్యలపై కసరత్తు జరుగుతోంది. ఉంటుందన్నది పరిశీలించాలి. ► ద్వంద్వ లిస్టింగ్ దేశీయ మూలధన సమీకరణకు దోహదపడుతుంది. అదే విధంగా గిఫ్ట్ సిటీలో పెట్టుబడుల యోచనలో ఉన్న అంతర్జాతీయ సంస్థల నిధులను పొందడంలోనూ ఇది సహాయపడుతుందని భావిస్తున్నాం. ► అంతర్జాతీయ ఫండ్లు కూడా ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలుసుకునేలా తగిన చర్యలు అవసరం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, సావరిన్ వెల్త్ ఫండ్లు ఈ ఎక్సే్ఛంజ్‌ల్లో పెట్టుబడులు పెట్టేలా బీఎస్ఈ ప్రయత్నాలు జరపాలి. ► ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం దానిని మరింత విస్తృతం చేయాలి. మరింత మంది దేశీయ పెట్టుబడిదారులను పొందాలి. అలాగే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వీటిపై అవగాహన కల్పించాలి. ► ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో మొదట లిస్టయిన 150 చిన్న కంపెనీలు ఇప్పుడు ప్రధాన ప్లాట్‌ఫామ్‌లపై వ్యాపారం చేయడానికి అన్ని అర్హతలూ పొందాయి. ► మహమ్మారి సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న చిన్న మధ్య తరహా పరిశ్రలను పునరుద్ధరించడానికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంది. ఈ దిశలో ఈసీఎల్‌జీసీ, టీఆర్‌ఈడీఎస్‌సహా పలు పథకాలను, చర్యలను అమలు చేసింది. ► మనం మహమ్మారిని అధిగమించగలిగాము. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధ పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం. ఈ భౌగోళిక ఉద్రిక్తతలు మన పరిశ్రమ విశ్వాసం, స్ఫూర్తిని నిరోధించలేదు. ► స్టార్టప్‌ల విషయంలో దేశం పురోగమిస్తోంది. భారత్ 100 కంటే ఎక్కువ యునికార్న్‌లకు (బిలియన్ డాలర్లపైన విలువగలిగిన సంస్థలు), 70–80 ‘సూనికార్న్‌లకు‘ (యూనికార్న్‌లుగా మారడానికి దగ్గరిగా ఉన్న సంస్థలు) నిలయంగా ఉంది. స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానానికి బీఎస్ఈ ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. స్టార్టప్స్‌లోకి భారీ దేశీయ పెట్టుబడులు వెళ్లడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నాం. దేశీయ ఇన్వెస్టర్లు యూనికార్న్స్‌లో పెట్టుబడులకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ధోరణి మారాలి. బీఎస్ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) ప్లాట్‌పామ్‌పై 400 కంపెనీలు లిస్టయిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై ఎక్సే్చంజీ బిల్డింగ్‌లో బుల్ వద్ద కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. కార్యక్రమంలో బీఎస్ఈ చైర్మన్ ఎస్ఎస్ ముంద్రా, బీజేపీ ఎంపీ రామ్ చరణ్ బోహ్రా తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఈ ఎంఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 60,000 కోట్లు దాటింది. -
రూ.123 కోట్లతో 13 ఎంఎస్ఈ క్లస్టర్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: ఏపీలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఎంఎస్ఈ క్లస్టర్ల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజైస్ క్లస్టర్ డెవలప్మెంట్ పోగ్రాం (ఎంఎస్ఈ–సీడీపీ) కింద కొత్తగా 13 క్లస్టర్లతతో పాటు ఏడు ఫ్యాక్టరీ షెడ్లు నిర్మించనుంది. సుమారు రూ.123.07 కోట్లతో 13 ఎంఎస్ఈ క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి సంబంధించిన ప్రాజెక్టు నివేదికలను తయారుచేసి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. 2,111.59 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఈ క్లస్టర్లకు సంబంధించిన ప్రతిపాదనలను న్యూఢిల్లీలోని ఎంఎస్ఎంఈ డీసీ కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.33.66 కోట్లు సమకూర్చనుండగా, కేంద్రం గ్రాంట్ రూపంలో రూ.89.41 కోట్లు కేటాయిస్తుంది. హిందూపురం గ్రోత్ సెంటర్, గుంటూరు ఆటోనగర్, మచిలీపట్నం జ్యూవెలరీ పార్కు, కర్నూలు పారిశ్రామిక పార్కు, కడప, నడికుడి పారిశ్రామికపార్కులు, కానూరు, ఒంగోలు ఆటోనగర్లు, నెల్లిమర్ల, తణుకు, గాజులమండ్యం,రాయచోటి, తిరుపతి పారిశ్రామికపార్కుల్లో ఈ ఎంఎస్ఈ–సీడీపీ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ పథకం కింద రూ.11 కోట్లతో కానూరు, ఆమదాలవలస ప్రాజెక్టులను పూర్తిచేయగా, రూ.74.72 కోట్లతో మరో 6 ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు. యూనిట్లు తక్షణం ఉత్పత్తిని ప్రారంభించుకునే విధంగా 29.14 ఎకరాల విస్తీర్ణంలో రూ.88.62 కోట్లతో ఏడుచోట్ల ఫ్లాటెడ్ ప్యాక్టరీ షెడ్లను నిర్మించనున్నారు. ఆత్మకూరు, మల్లవల్లి, పలమనేరు పారిశ్రామికపార్కులతో పాటు తిరుపతి–1, తిరుపతి–2, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లతో పాటు అచ్యుతాపురం నాన్‌సెజ్ ఏరియాలో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రూ.17.97 కోట్లు ప్రభుత్వం సమకూర్చనుండగా మిగిలినది కేంద్రం గ్రాంట్ రూపంలో ఇస్తుంది. వీటి డీపీఆర్‌లను కేంద్రానికి పంపామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించనున్నారు. -
చిన్న పరిశ్రమే పెద్దన్న..!
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ) రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వాటిని మరింత ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత శరవేగంగా వృద్ధి చెందుతున్న ఎంఎస్ఎంఈ రంగం తక్కువ పెట్టుబడితో నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. ఇటు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు క్రమేపీ తగ్గుతున్న నేపథ్యంలో గ్రామీణ పారిశ్రామికీకరణకు ఎంఎస్ఎంఈ రంగం ఊతమిస్తోంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక సర్వే కూడా వెల్లడిస్తోంది. రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో 2015 జనవరి తర్వాత తమ కార్యకలాపాలు ప్రారంభించిన సూక్ష్మ, చిన్న, తరహా పరిశ్రమలు రూ.8,885 కోట్ల పెట్టుబడులతో ప్రారంభమై.. ఇప్పటివరకు అదనంగా 1.21 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సూక్ష్మ పరిశ్రమలే ముందు.. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగం పురోగతిని విశ్లేషిస్తే.. జనవరి, 2015 నుంచి జూలై, 2019 మధ్య కాలంలో కొత్త యూనిట్ల ఏర్పాటులో సూక్ష్మ పరిశ్రమలు అగ్రస్థానంలో ఉన్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన పారిశ్రామిక యూనిట్లలో 56.62 శాతం యూనిట్లు ఎంఎస్ఎంఈ రంగానికి చెందినవే కావడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక పెట్టుబడుల్లో సూక్ష్మ పరిశ్రమల వాటా 10.97 శాతం కాగా, ఉపాధి కల్పనలో 27.33 శాతంగా నమోదైంది. రుణ వితరణకు ప్రాధాన్యత.. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని.. ఈ రంగానికి అవసరమైనంత మేర రుణ వితరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2019–20 వార్షిక రుణ ప్రణాళి కలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రూ.21,420 కోట్ల రుణ వితరణ చేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. ఇక పారిశ్రామిక సరుకుల ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ కీలక రాష్ట్రంగా ఎదుగుతోంది. 2017–18లో రాష్ట్రం నుంచి రూ.42,363 కోట్ల మేర సరుకుల రవాణా జరగ్గా, 2018–19 నాటికి ఇది రూ.50,510 కోట్లకు చేరుకుంది. అంతకుమందు ఏడాదితో పోలిస్తే సరుకుల ఎగుమతిలో ఏకంగా 19 శాతం వృద్ధిరేటు నమోదైంది. రాష్ట్రం నుంచి జరుగుతున్న సరుకుల ఎగుమతిలో ఆర్గానిక్ కెమికల్స్ వాటా 30 శాతం కాగా, ఫార్మాసూటికల్ ఉత్పత్తుల ఎగుమతి శాతం 29గా నమోదైంది. 2019–20 సూక్ష్మ, చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి రుణాలు..21,420కోట్లు ఐదేళ్లలో కొత్తగా వచ్చిన సూక్ష్మ, చిన్న పరిశ్రమలు..6,438 ఈ రంగంలో మొత్తం పెట్టుబడులు..9,000 కోట్లు ఈ ఐదేళ్లలో ఉపాధి పొందిన వారి సంఖ్య..1.21లక్షలు ఐదేళ్లలో కొత్తగా వచ్చిన సూక్ష్మ, చిన్న పరిశ్రమలు..50,000 కోట్లు -
ఈ ఏడాది ఎంఎస్ఎంఈ కింద 9వేల కోట్ల రుణాలు
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రెజైస్ (ఎంఎస్ఎంఈ) యూనిట్ల కింద ఉన్న లబ్ధిదారులకు ఈ ఏడాది 9వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆ బ్యాంక్ రాష్ట్ర నెట్వర్క్ జనరల్ మేనేజర్ కెఎస్ జావంద అన్నారు. శుక్రవారం స్థానిక విఘ్నేశ్వర ఎస్టేట్‌లో జరిగిన రైస్‌మిల్లర్స్, గ్రానైట్ పరిశ్రమల బ్యాంకు ఖాతాదారుల జిల్లాస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాదిలో బ్యాంకు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్ల వారికి రుణాలు ఇచ్చే విషయంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గతంలో రెగ్యులర్ లిమిట్స్లను రెండేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేశారని, ప్రస్తుతం ఒక సంవత్సరానికి రెన్యూవల్ చేస్తున్నారని పలువురు ఖాతాదారులు జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. రెన్యూవల్ విషయంలో పాత పద్ధతినే కొనసాగించాలని, వడ్డీ విషయంలో కూడా చర్చించాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో హైదరాబాద్ జోనల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ టీటీ తారకం, నల్లగొండ, సూర్యాపేట రీజియన్ ఏజీఎంలు హరి కృష్ణనంద, ఎస్.వెంకటరమణ, బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ లీడర్ నర్సింహమూర్తి, మిర్యాలగూడ చీఫ్ మేనేజర్ కెవీఎస్ఆర్ మూర్తి, ఎస్బీఐ జనరల్ మేనేజర్ ఇన్సూరెన్స్ ప్రసాద్, సీఏ సత్యనారాయణ, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గార్లపాటి ధనమల్లయ్య, మిల్లర్లు పాల్గొన్నారు.