ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఆహ్వానించదగ్గది. ఇప్పటికే ఈ విషయంలో చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటిదాకా విద్యావ్యవస్థ ధనికులను మరింత ధనవంతులుగా మారిస్తే... పేదలను మరింత దరిద్రంలోకి నెట్టేసింది. పేద, ధనిక తారతమ్యాన్ని తగ్గించడం విద్య వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలిప్పుడు గట్టిగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు తోడైతే అవి ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడగలవు. విద్యాసంబంధిత అంశాల్లో పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకూ అధ్యాపకులందరినీ వృత్తిపరమైన క్రమశిక్షణను అనుసరించేట్టు చేయడం తప్పనిసరి.
ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న తెలంగాణ మంత్రివర్గ నిర్ణయం భారతీయ జనతా పార్టీ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి వేసిన మాస్టర్ స్ట్రోక్! ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్ మీడియం విద్య, అమ్మ ఒడి వంటి పథకాలు జనసామాన్యంలో ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అటు పట్ట ణాలు, నగరాల్లో మాత్రమే కాదు... పల్లెపట్టుల్లోనూ వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యానికి మంచి ఆదరణ కనిపిస్తోంది. దీంతో తెలంగాణ ప్రజల్లోనూ అలాంటి పథకాలు తమకూ అందుబాటులోకి వస్తే బాగుంటుందన్న కాంక్ష బలపడటం అసహజమేమీ కాదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కల్వ కుంట్ల చంద్రశేఖరరావుకు ఈ రెండు పథకాలు కలిసివస్తాయనడం లోనూ ఎలాంటి సందేహం లేదు; 2018 ఎన్నికల్లో రైతు బంధు మాదిరిగా!
జాతీయ పార్టీల తీరు
అటు బీజేపీ గానీ, ఇటు కాంగ్రెస్ గానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను అంగీకరించలేవు. ఎందుకంటే ప్రాంతీయ భాషల సెంటిమెంటుతోనే ఈ పార్టీలు 70 ఏళ్లుగా తమను తాము బలపరుచుకుంటున్నాయి మరి! కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యతో ఈ అంశంపై ఒకసారి చర్చ జరిగింది. అయితే రాష్ట్రంలో ఉండే మేధావి వర్గం ఇంగ్లిష్ మీడియం బోధనపై సమస్యలు సృష్టిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కేరళ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) నేత పినరయి విజయన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని నాతో వ్యక్తం చేశారు. అయితే... ఈ మేధా వులు, చదువుకున్న వారందరూ కూడా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలోనే చదివిస్తున్నారన్న సంగతి మరచిపోకూడదు.
భారతీయ జనతా పార్టీని తీసుకుంటే... రాష్ట్ర, జాతీయ స్థాయిలు రెండింటిలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనపై ఆలోచన చేయడం లేదు. కానీ.. ధనికుల పిల్లలు చదువుకునేందుకు ప్రైవేట్ స్కూళ్లు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే నడిపేందుకు మాత్రం ఓకే చేస్తుంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాఠ శాలల, విశ్వవిద్యాలయ స్థాయిలో విద్య పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ అవుతున్న విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ప్రాంతీయ భాషల్లోనే విద్యాబోధన జరగాలని అంటోంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్య చాలా అధ్వాన్న స్థితిలో ఉంది. ఆ పార్టీకి ఆర్థికంగా మద్దతిచ్చే పారిశ్రామిక వేత్తలు, భూస్వామ్య పోకడలున్న వారు సులువుగా డబ్బు సంపా దించేందుకు దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియం విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర విభాగాలేవీ కూడా ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాము ఇంగ్లిష్ బోధన అందిస్తామని చెప్పలేక పోతు న్నాయి. మతం, కమ్యూనలిజంల చుట్టే ఆ పార్టీ అజెండా ఉంటుం దన్నది వేరే సంగతి. కానీ వీటివల్ల ప్రయోజనం లేదని ఇప్పుడు గ్రామీణ ప్రజలు సైతం అర్థం చేసుకున్నారు. పేద, ధనిక తార తమ్యాన్ని తగ్గించడం విద్య వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలి ప్పుడు గట్టిగా విశ్వసిస్తున్నారు.
మౌలిక సదుపాయాలు తోడైతేనే...
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు మౌలిక సదు పాయాలూ తోడైతే అవి ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడగలిగే పరిస్థితి వస్తుంది. మౌలిక సదుపాయాలంటే ఎయిర్ కండీషన్ ఉన్న తరగతి గదులు కావాలని కాదు. ఈ దేశానికి అలాంటివి అస్సలు అవసరం లేదు. కావాల్సిందల్లా ప్రాథమిక అవసరాలను తీర్చగలిగేవి మాత్రమే. మంచి తరగతి గదులు, కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం వంటివన్నమాట. వీటన్నింటికీ మించి నిబద్ధతతో పాఠాలు బోధించే మంచి ఉపాధ్యాయుల అవసరమూ ఎంతో ఉంది. పాఠ్యపుస్తకాల్లోనివి వల్లెవేసే వారు కాకుండా... పరిస రాలను అర్థం చేసుకుని కనీస జ్ఞానంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జా తీయ అంశాలను పిల్లలకు పరిచయం చేయగలిగిన వారు కావాలి. పాఠ్యపుస్తకాలు ఇతర టీచింగ్ మెటీరియల్ సరఫరా కూడా కీలకమే.
73 ఏళ్లుగా ద్వంద్వ విధానాలు...
దేశంలో విద్యకు సంబంధించి గత 73 ఏళ్లుగా ద్వంద్వ విధానాలే అమల్లో ఉన్నాయి. ధనికులకు ఇంగ్లిష్‌లో, పేదలకు ప్రాంతీయ భాషల్లో బోధన సాగుతూ వచ్చింది. ఇరు వర్గాల మధ్య సౌకర్యాల అంతరమూ చాలా ఎక్కువే. ఫలితంగా పేదవారు, గ్రామీణ విద్యా ర్థులు జీవితంలో అన్ని దశల్లోనూ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఈ విద్యావ్యవస్థ ధనికులను మరింత ధనవం తులుగా మారిస్తే... పేదలను మరింత దరిద్రంలోకి నెట్టేసింది.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం పాఠశాల విద్యలో సమూల మార్పులకు ధైర్యంగా నిర్ణయించడంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అప్పటివరకూ దేశంలోని ఏ ముఖ్యమంత్రీ ఇంతటి వినూత్నమైన, విప్లవాత్మకమైన మార్పుకు యోచన కూడా చేయలేదు. 2014లో తెలంగాణ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని ప్రకటించినా ఏడేళ్లపాటు కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన గురించి ఆలోచన కూడా చేయలేకపోయారు. ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థలను బలపరిచే చర్యలు చేపట్టినా... గ్రామీణ స్థాయిలో పాఠశాల విద్యా బోధన నాణ్యత పెంచడం పెద్దగా జరగలేదనే చెప్పాలి. ఒక దశలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంతో బలహీనమైంది కూడా. పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉద్యోగాలకు పోటీ పడే పరిస్థితి కూడా లేకపోయింది. ఇంటర్మీడియెట్ స్థాయిలో బోధన సక్రమంగా లేకపోవడంతో కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపింది. పాఠశాల స్థాయి ఉపా ధ్యాయులు మాత్రమే కాదు.. విశ్వవిద్యాలయ స్థాయి అధ్యాపకుల ఇంగ్లిష్ ప్రావీణ్యత అధ్వాన్న స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యావ్యవస్థలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఏర్పడింది.
ఆహ్వానించదగ్గ పరిణామం
ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ తగిన మౌలిక సదుపాయాలతో ఇంగ్లిష్ మీడియం వైపు మళ్లించడం ఈ మార్పుల దిశగా వేసే తొలి అడుగు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రయత్నం మొదలు పెట్టడం ఎంతైనా ఆహ్వానించదగ్గది. అయితే ఇది ఇక్కడితో ఆగి పోరాదు. పాఠశాల ఉపాధ్యాయులకు భాషతోపాటు కంటెంట్‌కు సంబంధించి తగిన శిక్షణ ఇవ్వడం ఒక పార్శ్వమైతే... టీచింగ్ వ్యవ స్థకు కొంత క్రమశిక్షణ నేర్పటం ఇంకోటి. ఉపాధ్యాయులు, అధ్యాప కుల ప్రజాస్వామ్య హక్కులకు గౌరవమిస్తూనే... విద్యాసంబంధిత అంశాల్లో పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకూ అందరినీ వృత్తి పరమైన క్రమశిక్షణ అనుసరించేట్టు చేయడం తప్పనిసరి.
చైనీయుల మాదిరిగా విద్య నాణ్యత పెంచాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి అంతగా ఉన్నట్లు లేదు. జాతీయ విద్యా విధానం ఒక్కటే వ్యవస్థలో అన్ని మార్పులూ తీసుకురాదు. బీజేపీ మతతత్వ వాదం మైనార్టీలను ఆ పార్టీకి దూరం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా గతంలో విద్యావ్యవస్థనేమీ అంతర్జాతీయ స్థాయికి చేర్చలేదు. లేదా గ్రామీణ విద్యావ్యవస్థను చైనా మాదిరిగా మెరుగు పరచలేదు. అందుకే ప్రాంతీయ పార్టీలు ఈ దిశగా వేస్తున్న అడుగు లకు అందరూ తమవంతు మద్దతివ్వాల్సి ఉంది.
వ్యాసకర్త: ప్రొ కంచ ఐలయ్య షెపర్డ్
ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment