రైతుల పిల్లలకు ఇంగ్లిష్‌ విద్యే ఆక్సిజన్‌ | Kancha Ilaiah Article On English Medium Education | Sakshi
Sakshi News home page

రైతుల పిల్లలకు ఇంగ్లిష్‌ విద్యే ఆక్సిజన్‌

Published Sun, Oct 4 2020 12:51 AM | Last Updated on Sun, Oct 4 2020 12:51 AM

Kancha Ilaiah Article On English Medium Education - Sakshi

దేశంలో సమాన మాధ్యమ విద్యా ప్రేమికులు ప్రతి ఏటా అక్టోబర్‌ 5ని భారతీయ ఇంగ్లిష్‌ దినోత్సవంగా జరుపుకుంటారు. దేశంలో ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్య ఆవిర్భవించి నేటికి 203వ సంవత్సరం. ఒక చర్మకార వృత్తి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన బ్రిటిష్‌ మిషనరీ విలియం క్యారీ కలకత్తాలో మొట్టమొదటి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలను ప్రారంభించాడు. ఈయన 1793లో భారత్‌ వచ్చి సుప్రసిద్ధ సెరాంపూర్‌లో స్థిరపడి, తన విద్యాపరమైన ఎజెండాను మొదలెట్టారు. 1817లో రాజారామమోహన్‌ రాయ్‌తో కలిసి అక్టోబర్‌ 5న మొట్టమొదటి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలను ప్రారంభించారు. అక్టోబర్‌ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం కూడా.

దేశంలో ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్య కొనసాగిన ఈ 203 సంవత్సరాల్లో ఇంగ్లిష్‌ని ఎవరు నేర్చుకున్నారు? ఇంగ్లిష్‌ విద్యకు దూరమై నష్టపోయిందెవరు? ఈ పాఠశాల విద్య చరిత్రను నిశి తంగా పరీక్షించాల్సి ఉంది. అన్ని పాఠశాలల్లో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోనే,  ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రాంతీయ భాషల్లోనే బోధన కొనసాగించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వ నూతన విద్యా విధానం చెబుతున్న నేపథ్యంలో దీనికి ఎంతో ప్రాధాన్యముంది. కానీ, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమే కొనసాగుతోంది. అలాగే చిన్న, మధ్యస్థాయి, బడా విద్యా వ్యాపార సంస్థలు నడుపుతున్న అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్‌ మీడియమే ఉంటుంది.

ఇకపోతే గుత్తపారిశ్రామిక సంస్థలు నిర్వహిస్తున్న కొన్ని స్కూల్స్‌ అయితే బ్రిటిష్, అమెరికన్‌ స్కూల్‌ విద్యా నమూనా ప్రకారం నడుస్తున్నాయి. 12వ తరగతి వరకు ఈ విద్యా సంస్థల బోధనా క్రమం మొత్తంలో ఒక్క ప్రాంతీయ భాషకూ చోటు లేదన్నది గమనార్హం. చారిత్రకంగా చూస్తే దేశంలో మెజారిటీ ప్రజలు శూద్రులే. దేశ జనాభాలో వీరు 56 శాతంగా ఉన్నారు. వీరిలో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, యాదవులు, రెడ్లు, కమ్మ, కాపు, వెలమ, నాయికర్లు, నాయర్లు, మరాఠాలు, లింగాయతులు, వొక్కలింగ తదితరులంతా సాధారణ విభాగంలోనే పోటీపడుతుంటారు.

ఈ కులాలతోపాటు రిజర్వేషన్‌ కేటగిరీలో ఉన్న ఓబీసీలందరూ శూద్రులలో భాగమే. వీరితర్వాత దేశజనాభాలో దళితులు 18 శాతం, ఆదివాసీలు 7.5 శాతంగా ఉన్నారు.  ఏ రంగంలోనైనా సరే ఇంగ్లిష్‌ రచయితలను చూస్తే వీరిలో శూద్రులు కనిపించరని అర్థమవుతుంది. సైద్ధాంతిక రచనలు (రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక), ఫిక్షన్, కవిత్వం, జర్నలిస్టిక్, కళావిమర్శ వంటి మరెన్నో రచనలను ఇంగ్లిష్‌లో రాస్తున్నవారు ద్విజులకు చెందినవారు మాత్రమే. ద్విజులు అంటే బ్రాహ్మణులు, బనియాలు, క్షత్రియులు, కాయస్థులు, ఖాత్రిలు అని అందరికీ తెలుసు.

జనాభాలో అతిపెద్ద భాగమై ఉన్న శూద్రులకు కాకుండా ఈ ద్విజులకు మాత్రమే ఇంగ్లిషులో ఇంత పట్టు ఎలా వచ్చింది? ఈ శూద్రులలో కూడా అందరూ నిరుపేదలు కారు. భారతదేశంలో భాషా, విద్యా చరిత్రే దీనికి కారణం. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం అంటే దేశంలోకి సంస్కృతం ఇంకా అడుగు పెట్టడానికి ముందు ప్రజలు పాళి, ఇతర ప్రాంతీయ గిరిజన భాషలను మాట్లాడేవారు. వీరే హరప్పా, మొహంజొదారో, ఢోలవీరా వంటి నగరాలతోపాటు హరప్పా నాగరికతను నిర్మించారు. వీరందరికీ తమతమ సొంత భాషలున్నాయి. అధునాతన భాష లేకుండా పట్టణ నాగరికతను నిర్మించడం అసాధ్యం అనేది తెలిసిందే.

భారతదేశంలో మొట్టమొదటి లిఖిత సంస్కృత పాఠం రుగ్వేదం. వేదకాలంలో శూద్రులను నాలుగోవర్ణంగా ప్రకటిం చారు. అంటే వీరు బానిసలతో సమానం. వీరికి సంస్కృత భాషను నిషేధించారు. వీరిలో ఎవరైనా సంస్కృతం నేర్చుకున్నా, చదివినా, రాసినా తీవ్ర శిక్షలు విధించేవారు. తర్వాత 13వ శతాబ్దంలో టర్కులు, అప్గాన్‌ పాలకులు వచ్చారు. పర్షియన్‌ భాష మెల్లగా పాలక భాషగా, పాఠ్యభాషగా ఉనికిలోకి వచ్చింది. ఈ భాషను వ్యతిరేకించడానికి బదులుగా ద్విజ కులాలు ఆ భాషను నేర్చుకుని ముస్లిం పాలకులకు పాలనాధికారులుగా, దుబాసీలుగా మారిపోయారు. మొఘల్‌ పాలనలోనే పర్షియన్‌ భాష భారతదేశ వ్యాప్తంగా విస్తరించింది.

చాలావరకు ముస్లింలతోపాటు బ్రాహ్మణులు, కాయస్థులలో చాలామంది ఆ భాషను నేర్చుకుని ప్రభుత్వంలో కొలువులు సాధించడానికి దేశమంతా వలసపోయారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి, ముంబై ప్రాదేశిక ప్రాంతానికి బ్రాహ్మణులు, కాయస్థులు వలసపోవడం దీనికి రుజువు. బాల్‌ థాకరే కుటుంబం కూడా కాయస్థులకు చెందినవారే. ముస్లిం పాలకులు కూడా రైతులకు, హస్తకళా నిపుణులకు విద్య నేర్పి పర్షియన్‌ భాషలో వ్యవసాయ కులాల నైపుణ్యాలను మెరుగుపర్చాలని భావించలేకపోయారు. శూద్రుల నిరక్షరాస్యత కూడా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి క్షీణతకు కారణమైంది.

క్రమంగా పర్షియన్‌ భాష నుంచి హిందీ, ఉర్దూ భాషలు ఆవిర్భవించాయి. ఇవి కూడా హిందుస్తానీ భాషలుగా చెలామణి అయ్యాయి. సంస్కృత అక్షరాలను  హిందీ స్వీకరించగా, అరబిక్, పర్షియన్‌ అక్షరాలను ఉర్దూ స్వీకరించింది. అయితే ఈ రెండు భాషల మధ్య భావ ప్రసరణ నేటికీ వ్యవస్థీకృతంగానే ఉంటోంది. బెంగాలీ, మరాఠీ, గుజరాతీ వంటి సంస్కృత లిపిని ఉపయోగిస్తున్న ఉత్తరాది భాషల మధ్య పరస్పర అవగాహన ఉంది. హిందీకీ ఈ భాషలకు మధ్య పరస్పర అవగాహన, మార్పిడి కూడా ఉంటోంది. ఈ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సులభంగా హిందీని అర్థం చేసుకుని మాట్లాడుతుండటానికి ఇదే కారణం.  పర్షియన్‌ సంస్కృతిలో కూడా ముస్లిం పాలనాధికారులు శూద్రులను శారీరక శ్రమలకే పరిమితం చేశారు తప్పితే బౌద్ధిక కృషిలో భాగం చేయలేదు.

1839లో పర్షియన్‌ భాషను ఈస్టిండియా కంపెనీ రద్దు చేసి ఇంగ్లిష్‌ను పాలనా భాషగా చేశారు. 1817 నుంచి ఇంగ్లిష్‌ను నేర్చుకోవడం ప్రారంభించిన ద్విజులు ప్రధానంగా బ్రాహ్మణులు నేరుగా ఇంగ్లిష్‌ పాలనాయంత్రాంగంలో ప్రవేశించారు. అయితే ఇంగ్లిష్‌ను బోధనా, పాలనా భాషగా చేసిన తర్వాత కూడా శూద్రకులాలకు చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలను పొందలేకపోయారు.అయితే బ్రిటిష్‌ అధికారులతో వ్యక్తిగత స్నేహం ప్రాతిపదికన ఇంగ్లిష్‌ను నేర్చుకున్న మొట్టమొదటి వ్యక్తి రాజారామమోహన్‌ రాయ్‌. ఈయన ఓ బ్రాహ్మణ జాగీర్దారు. పోతే 1841లో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో చేరిన మొట్టమొదటి శూద్రుడు మహాత్మా పూలే. పార్శీ అయిన దాదాబాయి నౌరోజి కూడా ఇంగ్లిష్‌లో చదువుకుని వ్యాపారం కోసం ఇంగ్లండ్‌ వెళ్లి రాజకీయనేతగా మారారు.

ఇకపోతే స్వదేశంలోనూ, ఇంగ్లండ్‌లోనూ ఇంగ్లిష్‌ చదువుకున్న మొట్టమొదటి బనియా (వర్తకులు) గాంధీజీ కావచ్చు. ఆ తర్వాత భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి ఇంగ్లండ్‌లో చదివిన ఏకైక శూద్రుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మాత్రమే. అయితే పటేల్‌ ఇంగ్లిష్‌లో పెద్దగా రాయలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శూద్రకులాల్లోని భూస్వాములు తమ పిల్లలకు ఇంగ్లిష్‌ నేర్పడానికి ఇంగ్లండ్‌కు పంపడం పెద్దగా జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లో కట్టమంచి రామలింగారెడ్డి భారతదేశంలో చక్కగా ఇంగ్లిష్‌ చదువుకున్న శూద్రుడిగా కనిపిస్తాడు. అయితే శూద్ర భూస్వాములు కట్టమంచి వారసత్వాన్ని కొనసాగించలేదు. గ్రామాల్లో భూస్వామ్య అధికారం చలాయించడంతోనే వారు సంతృప్తి చెందారు.

ఇప్పుడు వీరు ఇంగ్లిష్‌ మీడియంలో విద్య ప్రాధాన్యతను గుర్తిస్తున్నారు. దళితులు, ఆదివాసులతోపాటు శూద్రులు కూడా వెనకబడిపోవడానికి కారణం భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో అనుసంధానం కలిగించే జాతీయ భాషను వారు నేర్చుకోలేకపోవడమే. ఇప్పుడు శూద్రులు, దళితులు, ఆదివాసులు తమ ఉత్పత్తి అవసరాలకోసం ప్రాంతీయ భాషతోపాటు ఇంగ్లిష్‌ను కూడా  నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వీరికి ఇంగ్లిష్‌ ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ భాషగా మారింది. ఇక ప్రాంతీయ భాష వారి ఉత్పాదక, వ్యవహార భాషగా కొనసాగుతుంది. ఇంగ్లిష్‌ తెలుసుకుని వ్యవసాయ ఉత్పత్తిలో పాలుపంచుకునేవారు ఉంటే భారతీయ వ్యవసాయ నాణ్యత మౌలికంగానే మారిపోతుంది.

ఒక జాతిగా భారతదేశం ఇంగ్లిష్‌ను జాతీయ భాషగా గుర్తిస్తూ అక్టోబర్‌ 5ను భారతీయ ఇంగ్లిష్‌ దినోత్సవంగా పాటిస్తుండటం ప్రాధాన్యత కలిగిన అంశం. ఇంగ్లిష్‌ 1817లో స్కూల్‌ విద్యా భాషగా మనదేశంలో పుట్టింది ఇది కేవలం ద్విజుల భాషగానే ఉనికిలో ఉంటూ వచ్చింది. ఈ పరిస్థితి మారాల్సి ఉంది. ఇంగ్లిష్‌ కూడా ఇప్పుడు మన భాషే కాబట్టి ప్రతి ఆహార ఉత్పత్తిదారు ఇంగ్లిష్‌ మన భాష కాదని అలోచించకుండా దాన్ని నేర్చుకోవలసి ఉంది. విశ్వీకరణ చెందిన ప్రపంచంలో ప్రతి రైతూ అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్‌లో పట్టు సంపాదించాలి. పేదలకు, భారతీయ గ్రామాల్లోని ఆహార ఉత్పత్తిదారులకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యను అడ్డుకోవడంలో అంతర్జాతీయ కుట్ర లేకుండా జాగ్రత్తపడదాం. 
(రేపు భారతీయ ఇంగ్లిష్‌ దినోత్సవం)

ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌
వ్యాసకర్త ఇంగ్లిష్‌ తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement