విద్యలో సమానత్వమే అసలైన విప్లవం | Kancha Ilaiah Article On Equality In Education | Sakshi
Sakshi News home page

విద్యలో సమానత్వమే అసలైన విప్లవం

Published Wed, Jun 10 2020 1:06 AM | Last Updated on Wed, Jun 10 2020 1:07 AM

Kancha Ilaiah Article On Equality In Education - Sakshi

భారతదేశంలో సమానత్వం అతి ప్రధాన సమస్య. చారిత్రకంగా చూస్తే అన్ని దేశాల్లోనూ ఆస్తిపై యాజమాన్యమే మానవుల్లో అసమానతలను సృష్టించింది. విద్యలో కులపరమైన అంతరాలు సైతం మనదేశంలో పూడ్చలేని అసమానత్వాన్ని సృష్టించాయి. కులవ్యవస్థ ద్వారా, విద్య ద్వారా ఈ అసమానత్వం మన దేశంలో విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది. ఆధునిక కాలంలోనూ.. పౌరసమాజంలో ఉంటూ సమానత్వం కోసం పోరాడటం కంటే  ప్రభుత్వంలో ఉంటూ సమానత్వం కోసం పోరాటం చాలా కష్టమైనది. తాను స్వయంగా అధికారంలో ఉంటూ ఆఫ్రికన్‌ అమెరికన్లకు బానిసత్వం నుంచి స్వేచ్ఛ కల్పించాలనుకున్న అబ్రహాం లింకన్‌ దానికోసం తన ప్రాణాల్నే బలిపెట్టాల్సి వచ్చింది. కానీ, అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉంటూ లింకన్‌ హత్యకు గురవడం అమెరికన్‌ జీవితాన్ని ప్రత్యేకించి నల్లజాతి ప్రజల జీవితాలనే మార్చివేసింది. ఇంగ్లిష్‌ విద్య లేకుండా ఈరోజు నల్లజాతి ప్రజల పరిస్థితిని కాస్త ఊహించుకోండి. వారు పాఠశాలల్లో ఇంగ్లిష్‌ చదువుకోకుంటే ప్రపంచం వారి వాణిని అసలు విని ఉండేది కాదు.

సమాజంలోని అత్యంత నిరుపేద వర్గాలకు పాఠశాల విద్యలో బోధనా మాధ్యమంలో సమానత్వం కోసం అధికారంలో ఉంటూనే ఒక సంవత్సర కాలంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటం భారతీయ ప్రజాస్వామ్యంపై గణనీయమైన ప్రభావం కలిగించబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యను ఆయన ప్రతిపాదించిన వెంటనే ప్రతిపక్షం నుంచి వ్యతిరేకత మొదలైంది. ఇంగ్లిష్‌ మీడియంపై ఆయన చేసిన ప్రతిపాదన సీబీఎస్‌ఈ అని పిలుస్తున్న సెకండరీ స్కూల్‌ విద్యా మండలి నెలకొల్పిన సిలబస్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సైనిక స్కూళ్లలో చెబుతున్న ఇంగ్లిష్‌ మీడియంలో బోధనను సరిగ్గా పోలి ఉంది. ఇలాంటి విద్యావ్యవస్థ 1947 నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ కొనసాగుతూనే ఉంది. అయితే సమాజంలోని అన్ని రంగాల్లో ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో చదువుతున్న విద్యావంతులే ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాతృభాషకు ప్రాధాన్యం, స్థానిక భాషలో విద్యను పిల్లలే ఎంపిక చేసుకోవడం, ఇంగ్లిష్‌ మీడియంకు తగిన సన్నాహకాలు లేవనడం, మన సంస్కృతి, నాగరికతలకే ఇంగ్లిష్‌ విద్య గొడ్డలిపెట్టు అని పెడబొబ్బలు పెట్టడం వంటి వ్యతిరేకతలన్నీ ట్యాంకుకు చిల్లు పడినప్పుడు ధారగా కారే నీటి చందాన పెల్లుబుకుతూ వస్తున్నాయి.

శ్రామిక వర్గాలు ఒకసారి ఇంగ్లిష్‌ నేర్చుకుని సమాజంలో మంచి స్థానంలోకి ఎగబాకితే తమ ఇళ్లలో కారుచౌకగా పనులు చేసిపెట్టేవారు ఇక దొరకరనే స్వార్థంతోనే పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం అందుబాటులోకి రాకుండా అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. తమ శ్రమశక్తిని కారుచౌకగా అమ్ముకుంటున్న నిరక్షరాస్యులైన వలస కార్మికులు కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌లో తమ వాణిని కూడా వినిపించలేక ఎంతగా ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుసు. అన్ని రాష్ట్రాల్లోనూ వీరు 12వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం విద్యను పొంది ఉంటే, వారిపై ఇలాంటి దారుణమైన దోపిడీ జరిగి ఉండేది కాదు. గతంలోనూ భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ రాజ్యమేలిన కాలంలో సమాన విద్యావకాశాలు లేకనే దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు చెందిన పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వర్గాలకు చెందినవారే ఇప్పుడు కూడా పట్టణ పెట్టుబడిదారీ కేంద్రాల్లో గూడు, కనీస గౌరవం లేకుండా దెబ్బతినిపోయారు. దేశంలోని 20 కోట్లమంది నిరక్షరాస్య శక్తులకు తమదైన వాణిని వ్యక్తీకరించలేని మహా విషాదాన్ని లాక్‌డౌన్‌ ప్రపంచానికి చాటి చెప్పింది. అమ్మఒడి పథకంతోపాటు మంచి సౌకర్యాలను కల్పిస్తూ  ప్రభుత్వ పాఠశాలల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తలపెట్టిన ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్య ఏపీలోని శ్రామికుల జీవితాన్ని శాశ్వతంగా మార్చివేయనుంది. అలా జరుగుతుందనే, ఏపీలోని ఇంగ్లిష్‌ విద్యాధిక శక్తులు భీతిల్లిపోతున్నారు.

మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా మాధ్యమం గురించి ఇవాళ ప్రతి ఇంటిలోనూ తీవ్రమైన చర్చ, వాదనలు జరుగుతున్నాయి. సంపన్న ఇంగ్లిష్‌ విద్యాధిక శక్తుల అసలు ఉద్దేశాలను పీడనకు గురవుతున్న ప్రజారాశులు తెలుసుకోలేకపోవచ్చు. నిజానికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే ఇంగ్లిష్‌ విద్యతో నైపుణ్యం పొందిన జనాభాతో భారతదేశం ఒక ప్రపంచ శక్తిగా భవిష్యత్తులో ఎదిగే క్రమాన్నే మన కులీన విద్యావంతులు వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా 130 కోట్లమంది నిపుణ కార్మికశక్తి ఇంగ్లిష్‌ విద్యను పొందినరోజు ప్రపంచ మార్కెట్లను వీరు ముంచెత్తవచ్చు. ఎందుకంటే ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం, నిపుణ కార్మికుల దన్నుతో భారత్‌ భవిష్యత్తులో అమెరికా, చైనాలను కూడా సులభంగా సవాలు చేయవచ్చు.

కానీ ప్రతీఘాతక శక్తులు తాము పొందుతున్న సౌకర్యాలు చెక్కుచెదరకుండా ఉండాలని కోరుకుంటున్నాయి. గొంతులేని కౌరుచౌక కార్మికులు తమ చెప్పుచేతల్లోనే ఉంటూ అందుబాటులో ఉండాలని వీరు కోరుకుంటున్నారు. తమ రాష్ట్రం వెలుపల తగిన వ్యక్తీకరణ సామర్థ్యం లేని అవిద్యావంతులు, లేక ప్రాంతీయ భాషలో చదువుకున్న కార్మికులు ఇప్పటి వలస కార్మికుల్లాగే కారుచౌక శ్రమశక్తికి ఒక రిజర్వ్‌ పూల్‌లాగా ఉండిపోతారు. ఇలాంటి వ్యవస్థే ఎప్పటికీ కొనసాగుతుండాలని కులీన విద్యావంతులు కోరుకుంటున్నారు. చివరకు ఇంగ్లిష్‌ వ్యతిరేకత, వర్గ బానిసత్వ వ్యతిరేకత కలిగి ఉండే కమ్యూనిస్టు నేతలు సైతం బోధనా మాధ్యమం విషయంలో దోపిడీదారుల వాదననే బలపరుస్తూ వస్తుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. వ్యవసాయ ఉత్పత్తి సంబంధిత పనులకు వెలుపల ఉంటున్న దోపిడీ వర్గ, కుల శక్తులు తాజా పరిణామంతో మరింత కలవరపడుతున్నారు. ఎందుకంటే కార్మికులు సైతం ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సాధించిన తర్వాత వారు ఇక ఎన్నటికీ బానిసలుగా పడి ఉండరన్నదే దోపిడీ శక్తుల కలవరానికి కారణం. అమెరికాలో నల్లజాతీయులు తమ ఇంగ్లిష్‌ విద్య ద్వారానే తమ బలాన్ని ప్రదర్శించగలుగుతున్నారు.

దేశంలోని ఒక రాష్ట్రంలో ఇంతటి విప్లవాత్మక చర్యకు నాందిపలికితే, అది అన్ని రాష్ట్రాలకు ఒక నమూనాగా మిగులుతుంది. సమానవిద్య అనే ఆయుధంతో బానిస–యజమాని సంబంధాల వ్యవస్థను మార్చివేయాలనే తలంపుతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంటున్నందుకు దోపిడీ శక్తులు ఆందోళన చెందుతున్నాయి. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి తీసుకున్న అసాధారణ నిర్ణయం ఇది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ శక్తులే భాష సమస్యలో మనోభావాలను రెచ్చగొట్టడంలో విజయం సాధించారు. ఇలాంటి శక్తుల మధ్యనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి గతంలోనే ప్రారంభ చర్యను చేపట్టి ఉన్నారు. ఈ శక్తుల ప్రాబల్యం కారణంగానే తన హయాంలో ఆయన కేవలం 6,400 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లిష్‌ మీడియాన్ని పాక్షికంగా ప్రవేశపెట్టగలిగారు. ఆయన హయాంలోనూ, బోధనతో కాకుండా పైరవీలు చేసుకుంటూ బతికేసిన ఉపాధ్యాయ సంస్థలను ముందుకు నెట్టిన విప్లవకర శక్తులుగా డప్పు వాయించుకునే ఇంగ్లిష్‌ వ్యతిరేక వామపక్ష శక్తులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా సమానత్వ వ్యతిరేక శక్తులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను వ్యతిరేకిస్తూన్నప్పటికీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏమాత్రం వెనుకకు తగ్గలేదు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం విద్య ప్రారంభమైనప్పుడు, నిజంగానే ఏపీలో విద్యావిప్లవం ప్రారంభమవుతుంది. ఏడాదికేడాదిగా ఈ విప్లవం ముందుకెళుతుంది. పట్టణాలు, నగరాల బాట పట్టకుండానే గ్రామీణ పిల్లలు 12వ తరగతి వరకు చదువు పూర్తి చేసుకోగలరు. ఇది మొత్తం గ్రామీణ వ్యవస్థనే మార్చేస్తుంది.

అయితే మితవాద, వామపక్ష, ఉదారవాద ప్రజాస్వామిక శక్తులనే తేడా లేకుండా ఇంగ్లిష్‌ మీడియం వ్యతిరేక శక్తులు తమ ఏజెంట్లను కూడా గ్రామాల్లోకి చొప్పిస్తారన్న విషయాన్ని గ్రామాల్లోని పేదపిల్లల తల్లిదండ్రులు మర్చిపోరాదు. ఇంగ్లిష్‌ మీడియం మీకు సరిపడదని ఈ ఏజెంట్లు పేద తల్లిదండ్రులకు నచ్చచెప్పడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇంగ్లిష్‌ విద్యతో గ్రామీణ సంస్కృతి కూడా మారిపోతుంది. తాగివచ్చి భార్యను చితకబాదే సంస్కృతి కూడా మారిపోతుంది. అవును ఇంగ్లిష్‌ విద్య శ్రామిక ప్రజారాశుల బానిస మనస్తత్వాన్ని మార్చివేస్తుంది. అందుకే గ్రామాల్లోని తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ వ్యతిరేక శక్తులను ఏమాత్రం లెక్కపెట్టకుండా తమ పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియమే కావాలని డిమాండ్‌ చేస్తూ, దరఖాస్తు పత్రాల్లో సంతకాలు చేయాలి.

కొందరు ఓబీసీ, దళిత, ఆదివాసీ నాయకులు కూడా ఇంగ్లిష్‌ వ్యతిరేక యజమానుల తరపున ఏజెంట్లుగా వచ్చి ఇంగ్లిష్‌ విద్య సరైంది కాదని వాదించవచ్చు. వీరిని అసలు నమ్మకండి. ఇప్పటికే ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ చదువుతున్న తమ పిల్లలకు గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలు పోటీ రాకూడదని ఈ దళారీ నేతలు కోరుకుంటున్నారని మర్చిపోవద్దు. ఒక్కమాటలో చెప్పాలంటే మన గ్రామీణ జీవితంలోని అన్ని రంగాల్లోనూ విద్యలో సమానత్వం అనేది అనేక మార్పులను తీసుకురానుంది. 

ఇంగ్లిష్‌ విద్య ప్రాముఖ్యత గురించి తెలిసిన ఏపీలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన యువత గ్రామాలకు వెళ్లి పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలోనే చేర్పించే విషయంలో తల్లులకు సహాయం చేయాలి. ఈ అవకాశం ఇప్పుడు కోల్పోతే, మరికొన్ని శతాబ్దాల పాటు శ్రామికవర్గాల్లో బానిసత్వం ఇప్పటిలాగే కొనసాగుతుంది. ఒకసారి మన పాఠశాలల్లో ఈ సరికొత్త విప్లవం మొదలయ్యాక, అధికారంలో ఉంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న పోరాటం భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది.


ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌

వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement