సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చరిత్రలో తొలిసారి రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సోమవారం రాత్రి నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతోందన్నారు. దశాబ్దాల పాటు కరెంటు కష్టాలు అనుభవించిన రైతులకు ఇది తీపి కబురన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఐదారు రోజులు అధ్యయనం చేసి, వచ్చే రబీ నుంచి శాశ్వత ప్రాతిపదికన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ తుది ఏర్పాట్లు చేస్తోందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై బుధవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు.
‘‘రాష్ట్రంలో 25 శాతం విద్యుత్ వ్యవసాయ పంపుసెట్ల ద్వారానే వినియోగమవుతోంది. రాష్ట్రం ఏర్పడిన కొద్దిరోజుల నుంచే అన్ని పంపుసెట్లకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోంది. గత జూలై నుంచి పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. వచ్చే రబీ నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అందుకు కావాల్సిన విద్యుత్ కూడా సమకూర్చుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో 9,500 ఎంవీ గరిష్ట డిమాండ్ ఏర్పడినా ఎక్క డా రెప్పపాటు కోత విధించకుండా 198 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాం. వచ్చే రబీ సీజన్‌లో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల ఏర్పడే 11,000 మెగావాట్ల డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు సన్నద్ధంగా ఉన్నాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నా’’అని పేర్కొన్నా రు. ఆటో స్టార్టర్లను తొలగించి విద్యుత్ ఆదాకు సహకరించాలని రైతులకు పిలుపునిచ్చారు.
నాడు చిమ్మచీకట్లు
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో.. భూగర్భ జలాలున్నా కరెంటు లేక చేతి కొచ్చిన పంట కళ్లెదుట ఎండిపోయే పరిస్థితి ఉండేదని కేసీఆర్ గుర్తుచేశారు. అప్పట్లో 2,700 మెగావాట్ల విద్యుత్‌లోటును రాష్ట్రం ఎదుర్కొందని, గత పాలకుల నిర్లక్ష్య వైఖరి, ప్రణాళికా లోపంతో అనేక రంగాల్లో చిమ్మచీకట్లు అలముకున్నాయన్నారు. అలాంటి పరిస్థితి నుంచి బయటపడి నేడు రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. చిమ్మచీకట్ల నుంచి వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరించడానికి ఎంతో కృషి చేశామన్నారు. దాదాపు రూ.94 వేల కోట్ల వ్యయంతో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. నత్తనడకన నడుస్తున్న విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పరుగులు పెట్టించిందని, కొత్త ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని వివరించారు.
రాష్ట్రం ఏర్పడే నాటికి 6,574 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంటే.. గడిచిన మూడున్నరేళ్లలో మరో 7,981 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చుకోగలిగామని చెప్పారు. సింగరేణి పవర్‌ప్లాంట్‌తో 1200ఎంవీ, కేటీపీపీతో 600 ఎంవీ, జూరాలతో 240 మెగావాట్లు, పులిచింతలతో 90 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్‌తో వెయ్యి మెగావాట్లు, సీజీఎస్ తదితర మార్గాల ద్వారా మరో 2 వేల మెగావాట్లు అదనంగా సమకూర్చుకున్నట్లు తెలిపారు. రాష్ట్రం 2,792 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. నేడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14,555 మెగావాట్లు కాగా.. మరో 13,752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. విద్యు త్ స్థాపిత సామర్థ్యాన్ని 28 వేల మెగావాట్లకు పెంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నా రు. రూ.12,136 కోట్లతో పంపిణీ, సరఫరా వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకున్నామన్నారు.
కొత్తగా 574 సబ్‌స్టేషన్లు
రాష్ట్రం ఏర్పడే నాటికి అన్ని రకాల సబ్‌స్టేషన్లు కలిపి 2,414 ఉండగా.. 574 సబ్ స్టేషన్లను కొత్తగా నిర్మించి, మొత్తం 2,988 సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తెచ్చామని సీఎం చెప్పారు. రాబోయే మూడు నాలుగేళ్లలో పంపిణీ, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు రూ.42 వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా 400 కేవీ సబ్ స్టేషన్లు 18, 220 కేవీ సబ్ స్టేషన్లు 34, 132 కేవీ సబ్ స్టేషన్లు 90, 33/11 కేవీ సబ్ స్టేషన్లు 937 నిర్మించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 16,378 కిలోమీటర్ల హైటెన్షన్ లైన్లు ఉండగా ఇప్పుడు 19,916 కిలోమీటర్లకు పెంచామన్నారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లను 4,32,968 కిలోమీటర్ల నుంచి 4,84,001 కిలోమీటర్లకు పెంచామన్నారు.
హైటెన్షన్ సరఫరా సామర్థ్యాన్ని 12,653 మెగావాట్ల నుంచి 20,660 మెగావాట్లకు పెంచామన్నారు. వార్ధా–మహేశ్వరం 765 కేవీ డబుల్ సర్క్యూట్ విద్యుత్ లైన్ నుంచి రాష్ట్రానికి 2 వేల మెగావాట్ల కారిడార్ కోసం పీజీసీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం జీహెచ్‌ఎంసీ చుట్టూ 142 కిలోమీటర్ల మేర 400 కేవీ రింగ్‌సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం ఏడాదికి 1,200 యూనిట్లుగా ఉంటే.. ఇప్పుడు 1,505 యూనిట్లకు పెరిగిందన్నారు. 2016–17లో జాతీయ సగటు 1,122 యూనిట్లయితే, తెలంగాణ సగటు అంతకన్నా 383 యూనిట్లు అదనంగా నమోదైందన్నారు. మూడున్నరేళ్లలో తెలంగాణలో విద్యుత్ వినియోగం 26 శాతం పెరిగిందని తెలిపారు.
కొత్తగా 13,357 ఉద్యోగాలు
విద్యుత్ సంస్థలను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి 22,550 మంది విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు వ్యవస్థ నుంచి తప్పించి నేరుగా జీతాలు చెల్లిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల్లో కొత్తగా 13,357 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment