assebly sessions
-
పద్మారావు గౌడ్, రసమయి మధ్య వాగ్వాదం.. షాక్‌లో టీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, అధికార పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో రసమయి ప్రశ్నలు అడుగుతుండగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు.. మైక్ కట్ చేసి ఎమ్మెల్యే గొంగడి సునీతకు మైక్ ఇచ్చారు. ఇంతలో దీనిపై రసమయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సభలో మాట్లాడదాం అంటే మాట్లాడే అవకాశాలు రావు.. కనీసం ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వకుంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలే అడగవద్దు అన్నప్పుడు తమకు ప్రశ్నలు ఎందుకు ఇవ్వడం అంటూ అసంతృప్తి వ్యక్తపరిచారు. తాను ప్రశ్నలే అడుగుతున్నానని వాదించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆయన వ్యాఖ్యలపై పద్మారావు స్పందిస్తూ.. తొందరగా ప్రశ్నలే అడగండి.. ప్రసంగాలు వద్దూ అంటూ వ్యాఖ్యలు చేశారు. గంటన్నరలో 10 ప్రశ్నలు పూర్తి చేసుకోవాలని చెప్పారు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ రసమయి తన కుర్చీలో సైలెంట్‌గా కూర్చుండిపోయారు. -
మొక్కల కన్నా ముస్లింలు హీనమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హరితహారం కోసం ఖర్చు చేస్తున్నన్ని నిధులు కూడా మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శిం చారు. ‘ఏడేళ్లలో మైనార్టీల సంక్షేమంపై ప్రభుత్వం రూ.6.199 కోట్లు ఖర్చు చేసింది. అదే హరితహారంపై ఇంతవరకు రూ.6,555 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఒక్క ఏడాదే రూ.548 కోట్లు వ్యయం చేశారు. మొక్కలు, చెట్లకన్నా మైనార్టీలు హీనమై పోయారా? ముస్లింలకు హరితహారం కన్నా తక్కువ నిధులు ఖర్చు చేస్తారా..?’ అని నిల దీశారు. సోమవారం శాసనసభలో మైనారిటీ సంక్షే మం, పాతబస్తీ అభివృద్ధిపై చర్చను అక్బరుద్దీన్ ప్రారంభించారు. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులకు సంబంధించి ఒక్కోసారి ఒక్కోరకమైన లెక్కలు ఇవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తప్పుడు లెక్కల మాదిరే మైనార్టీల ప్రగతి కూడా ఉందన్నారు. కొనసాగుతున్న వివక్ష రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో వివక్ష కొనసాగుతోందని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అం దుతున్న ఫలాలు మైనారిటీలకు దక్కడం లేదంటూ గణాంకాలతో సహా వివరించారు. మైనారిటీ పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్ షిప్పులు అందజేసే విషయంలో కూడా ప్రభుత్వ యంత్రాంగం చిన్నచూపు చూస్తోంద న్నారు. 2019 ఎన్నికల తర్వాత మైనార్టీల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని చెప్పారు. 2014–15 నుంచి ఇంతవరకు మసీదుల అభివృధ్ధికి, దర్గాల పనులు, ఖబరిస్థాన్ల కోసం మొత్తంగా రూ.210 కోట్లతో 800ల జీవోలు విడుదల చేసినా ఒక్క రూపాయిని కూడా ప్రభు త్వం ఇంతవరకు విడుదల చేయలేదని విమర్శిం చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 56,653 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల గుర్తింపు విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కుటుంబ వార్షికాదాయ పరిమితి రూ. 8 లక్షలు ఉంటే, మైనారిటీలకు రూ.2 లక్షలకే పరిమితం చేశారని, దీనిని మార్చాలని అక్బరుద్దీన్ కోరారు. పాతబస్తీపై నిర్లక్ష్యం హైదరాబాద్ పాత నగరాన్ని అభివృద్ధి చేయడంలో వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం కలుగు తోందని అక్బరుద్దీన్ చెప్పారు. ఫ్లై ఓవర్ల నిర్మాణం, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ), కుతుబ్షాహి టూంబ్స్ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, మెట్రో రైలు నిర్మాణం, మోనోట్రైన్ తీసుకురావడం వంటి అంశాల్లో పాతబస్తీని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. మెట్రో మూసీ దాటలేదని చెప్పారు. నాలాల నిర్మాణం, దర్గాలు, పహాడీల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని అధునాతనంగా నిర్మించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని అక్బరుద్దీన్ కొనియాడారు. హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధికి వైఎస్సార్ ఆనాడే రూ.2 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని తెలిపారు. 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: భట్టి విక్రమార్క మైనారిటీ ముస్లింలకు రాష్ట్రంలో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ (వైఎస్) ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఈ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని చెప్పిన టీఆర్ఎస్ అందుకు కట్టుబడి ఉండాలని కోరారు. రాజకీయ కారణాలతోనే పాతబస్తీని అభివృద్ధి చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కబ్జాలకు ఓల్డ్‌సిటీ అడ్డాగా మారిందని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. -
నేను బ్రతికున్నంత వరకు జగనే సీఎం: రాపాక
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు చర్చలో భాగంగా గురువారం ప్రభుత్వ పథకాలపై ప్రసంగించిన రాపాక.. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోని ప్రజా సంక్షేమ నిర్ణయాలను చిన్న వయసులోనే అమలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్మరణీమైన స్థానం దక్కించుకున్నారని పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రజల శ్రేయస్సు గురించి ఇంతగా పరితపించే సీఎంను తానెప్పుడూ చూడలేదని, తాను బ్రతికున్నంత వరకు వైఎస్ జగనే ముఖ్యమంత్రి అన్నారు. సీఎం జగన్ లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారని పేర్కొన్నారు. సచివాలయం ద్వారా ప్రతి గ్రామంలోనూ 30 నుంచి 40 మంది వాలంటీర్లను నియమించడం ప్రశంసనీయమని కొనియాడారు. (టీడీపీ ఎమ్మెల్యేపై సీఎం జగన్ ఆగ్రహం) ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక హామీలను అమలు చేస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఆయన నాయకుడిగా ఉన్న అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణ యుగంలా ఉండేదని, వైఎస్ జగన్ అదే దారిలో నడుస్తున్నారని వర్ణించారు. ఇలాంటి నాయకుడు పదికాలాల పాటు సీఎంగా ఉండాలని రాపాక ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారని ప్రశంసించారు. దేశమే ఆశ్చర్యపోయే విధంగా ప్రతినెలా పెన్షన్ ఇస్తున్నారని అన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, 14 ఏళ్లపాటు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు ఏనాడు ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని విమర్శించారు. కాగా రాపాక ప్రసాద్ ప్రసంగానికి అధికార పక్షం సభ్యులు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ సైతం చిరునవ్వులు చిందించారు. (పోలవరం నేనే పూర్తి చేస్తా) -
‘ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు’
సాక్షి, అమరావతి: రాజకీయమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం తగదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ.. సోమశిల-మర్రిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టును చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదన్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో 5 వేల క్యూసెక్కుల నీటిని తరలించే ప్రాజెక్టు అని పేర్కొన్నారు. భూసేకరణ సమస్యను కూడా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 90 వేల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. పంపింగ్ పనుల్లో నాసిరకమైన పనులు కొన్ని ఉన్నాయన్నారు. భూసేకరణ పూర్తి చేసి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. అసంపూర్తిగానే మిగిలిపోయాయి.. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు అసంపూర్తిగానే మిగిలిపోయాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టులను పూర్తిచేయాలని కోరారు. ఉపాధి నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలి... గత టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్లలో నాణ్యత లేదని ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం నిధులను తెలుగు తమ్ముళ్లకు పెంచిపెట్టారని మండిపడ్డారు. గతంలో టీడీపీ నుంచి పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ ఉన్నారని తెలిపారు. ఉపాధి నిధులను దుర్వినియోగంపై విచారణ జరిపించాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో భారీ అవినీతి జరిగింది.. టీడీపీ సభ్యుల రగడతో ప్రశ్నోత్తరాలు సరిగ్గా జరగడం లేదని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. గత ఐదేళ్లలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. రాజోలు నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందన్నారు. రాజోలులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. రాజోలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. -
‘అదంతా డ్రామా’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనను ఓ డ్రామాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ చేత సీఎం కేసీఆర్ నాటకం ఆడిస్తున్నారని ఆరోపించారు. చైర్మన్‌కు దెబ్బతగలడం నిజమైతే ఆ వీడియోను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. చైర్మన్ ఒకవైపు కూర్చుంటే మరో వైపు ఉన్న కంటికి ఎలా దెబ్బ తగిలిందని నిలదీశారు. నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని, తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. అప్పుడు హరీష్ చేయలేదా? గతంలో గవర్నర్ ప్రసంగ సమయంలో హరీశ్‌రావు బెంచీల మీద దూకుతూ వెల్‌లోకి దూసుకెళ్లలేదా అని గుర్తు చేశారు. ఆయన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై స్పందించని స్పీకర్ మమల్ని సస్పెండ్ చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. స్పీకర్ విధుల నిర్వహణలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. పార్లమెంట్లో కేసీఆర్ కూతురు స్పీకర్ ముఖం మీద ప్లకార్డులు ప్రదర్శిస్తోందని, ఇక్కడ మేం మాత్రం నిరసన చేపట్టొద్దా.. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్లో రైతులు, గిరిజనుల గురించి ప్రస్తావన లేదని, ప్రధాన అంశాలు లేవని మేము చెప్పడానికి వెళితే మాపై 50 మంది పోలీసులతో దాడి చేయించారన్నారు. చివరి బడ్జెట్ సమావేశంలో.. సమాధానాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో మాపై సస్పెన్షన్ వేటు వేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ లాంటి నియంతలు అధికారంలోకి రావద్దంటూ ఈ సందర్భంగా ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ అనే నినాదాన్ని ఇచ్చారు. -
దేశ చరిత్రలోనే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చరిత్రలో తొలిసారి రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సోమవారం రాత్రి నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతోందన్నారు. దశాబ్దాల పాటు కరెంటు కష్టాలు అనుభవించిన రైతులకు ఇది తీపి కబురన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఐదారు రోజులు అధ్యయనం చేసి, వచ్చే రబీ నుంచి శాశ్వత ప్రాతిపదికన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ తుది ఏర్పాట్లు చేస్తోందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై బుధవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ‘‘రాష్ట్రంలో 25 శాతం విద్యుత్ వ్యవసాయ పంపుసెట్ల ద్వారానే వినియోగమవుతోంది. రాష్ట్రం ఏర్పడిన కొద్దిరోజుల నుంచే అన్ని పంపుసెట్లకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోంది. గత జూలై నుంచి పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. వచ్చే రబీ నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అందుకు కావాల్సిన విద్యుత్ కూడా సమకూర్చుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో 9,500 ఎంవీ గరిష్ట డిమాండ్ ఏర్పడినా ఎక్క డా రెప్పపాటు కోత విధించకుండా 198 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాం. వచ్చే రబీ సీజన్లో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల ఏర్పడే 11,000 మెగావాట్ల డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు సన్నద్ధంగా ఉన్నాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నా’’అని పేర్కొన్నా రు. ఆటో స్టార్టర్లను తొలగించి విద్యుత్ ఆదాకు సహకరించాలని రైతులకు పిలుపునిచ్చారు. నాడు చిమ్మచీకట్లు రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో.. భూగర్భ జలాలున్నా కరెంటు లేక చేతి కొచ్చిన పంట కళ్లెదుట ఎండిపోయే పరిస్థితి ఉండేదని కేసీఆర్ గుర్తుచేశారు. అప్పట్లో 2,700 మెగావాట్ల విద్యుత్‌లోటును రాష్ట్రం ఎదుర్కొందని, గత పాలకుల నిర్లక్ష్య వైఖరి, ప్రణాళికా లోపంతో అనేక రంగాల్లో చిమ్మచీకట్లు అలముకున్నాయన్నారు. అలాంటి పరిస్థితి నుంచి బయటపడి నేడు రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. చిమ్మచీకట్ల నుంచి వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరించడానికి ఎంతో కృషి చేశామన్నారు. దాదాపు రూ.94 వేల కోట్ల వ్యయంతో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. నత్తనడకన నడుస్తున్న విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పరుగులు పెట్టించిందని, కొత్త ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 6,574 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంటే.. గడిచిన మూడున్నరేళ్లలో మరో 7,981 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చుకోగలిగామని చెప్పారు. సింగరేణి పవర్‌ప్లాంట్‌తో 1200ఎంవీ, కేటీపీపీతో 600 ఎంవీ, జూరాలతో 240 మెగావాట్లు, పులిచింతలతో 90 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్‌తో వెయ్యి మెగావాట్లు, సీజీఎస్ తదితర మార్గాల ద్వారా మరో 2 వేల మెగావాట్లు అదనంగా సమకూర్చుకున్నట్లు తెలిపారు. రాష్ట్రం 2,792 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. నేడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14,555 మెగావాట్లు కాగా.. మరో 13,752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. విద్యు త్ స్థాపిత సామర్థ్యాన్ని 28 వేల మెగావాట్లకు పెంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నా రు. రూ.12,136 కోట్లతో పంపిణీ, సరఫరా వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకున్నామన్నారు. కొత్తగా 574 సబ్స్టేషన్లు రాష్ట్రం ఏర్పడే నాటికి అన్ని రకాల సబ్స్టేషన్లు కలిపి 2,414 ఉండగా.. 574 సబ్ స్టేషన్లను కొత్తగా నిర్మించి, మొత్తం 2,988 సబ్స్టేషన్లను అందుబాటులోకి తెచ్చామని సీఎం చెప్పారు. రాబోయే మూడు నాలుగేళ్లలో పంపిణీ, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు రూ.42 వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా 400 కేవీ సబ్ స్టేషన్లు 18, 220 కేవీ సబ్ స్టేషన్లు 34, 132 కేవీ సబ్ స్టేషన్లు 90, 33/11 కేవీ సబ్ స్టేషన్లు 937 నిర్మించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 16,378 కిలోమీటర్ల హైటెన్షన్ లైన్లు ఉండగా ఇప్పుడు 19,916 కిలోమీటర్లకు పెంచామన్నారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లను 4,32,968 కిలోమీటర్ల నుంచి 4,84,001 కిలోమీటర్లకు పెంచామన్నారు. హైటెన్షన్ సరఫరా సామర్థ్యాన్ని 12,653 మెగావాట్ల నుంచి 20,660 మెగావాట్లకు పెంచామన్నారు. వార్ధా–మహేశ్వరం 765 కేవీ డబుల్ సర్క్యూట్ విద్యుత్ లైన్ నుంచి రాష్ట్రానికి 2 వేల మెగావాట్ల కారిడార్ కోసం పీజీసీఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం జీహెచ్ఎంసీ చుట్టూ 142 కిలోమీటర్ల మేర 400 కేవీ రింగ్సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం ఏడాదికి 1,200 యూనిట్లుగా ఉంటే.. ఇప్పుడు 1,505 యూనిట్లకు పెరిగిందన్నారు. 2016–17లో జాతీయ సగటు 1,122 యూనిట్లయితే, తెలంగాణ సగటు అంతకన్నా 383 యూనిట్లు అదనంగా నమోదైందన్నారు. మూడున్నరేళ్లలో తెలంగాణలో విద్యుత్ వినియోగం 26 శాతం పెరిగిందని తెలిపారు. కొత్తగా 13,357 ఉద్యోగాలు విద్యుత్ సంస్థలను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి 22,550 మంది విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు వ్యవస్థ నుంచి తప్పించి నేరుగా జీతాలు చెల్లిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల్లో కొత్తగా 13,357 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. -
సొంత ఎమ్మెల్యేలనే కొంటున్న బాబు
* ‘దేశం’లో బ్లాక్‌మెయిలింగ్ ఎమ్మెల్యేలు * ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా * మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇంతకంటే దుస్థితి ఏముంటుంది? తమను టీఆర్ఎస్ పిలుస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్మెయిల్ చేస్తోంటే వారికి కోట్లకు కోట్ల రూపాయలు ఇచ్చే దుస్థితికి చేరారు..’ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావే శాల సందర్భంగా శనివారం ఆయన లాబీల్లో మీడియాతో ‘చిట్‌చాట్’ చేశారు. టీడీపీ శాసన సభ్యత్వానికి తాను రాజీనామా చేశాకే మంత్రి మండలిలో చేరానని, రాజీనామా లేఖ స్పీకర్ వద్ద పెండింగులో ఉందన్నారు. తాను మండలికి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, కానీ తాను సనత్‌నగర్ నుంచే పోటీ చేస్తానని కుండబద్ధలు కొట్టారు. దమ్ముంటే చంద్రబాబు కూడా తనపై పోటీ చేయొచ్చని, అయితే ఎవరు ఓడిపోతే వారు రాజకీయాలకు దూరంగా ఉండాలని సవాలు విసిరారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తనకు మంత్రి పదవి ఇస్తే టీఆర్ఎస్లో చేరతానని సీఎంను కలిశారన్నా రు. చంద్రబాబు గతంలో కేసీఆర్‌పై మోత్కుపల్లితో మాట్లాడించి బకరా చేశారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డితో మాట్లాడించి బకరా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ సక్సెస్ ప్రతిపక్ష నేతగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవహరించినట్లే.. జగన్ కూడా చేస్తున్నారని కితాబు ఇచ్చారు. రాజశేఖరరెడ్డి ఎన్నడూ మైక్ అడగలేదని, స్పీకర్ తనకు మైక్ ఇచ్చే విధంగా కనుసైగతో తన వాళ్లతో పనిచేయించే వారని, అదే తరహాలో జగన్ ప్రతిపక్ష నేతగా రాణిస్తున్నారని కొనియాడారు.