సొంత ఎమ్మెల్యేలనే కొంటున్న బాబు
* ‘దేశం’లో బ్లాక్‌మెయిలింగ్ ఎమ్మెల్యేలు
* ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా
* మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇంతకంటే దుస్థితి ఏముంటుంది? తమను టీఆర్‌ఎస్ పిలుస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్‌మెయిల్ చేస్తోంటే వారికి కోట్లకు కోట్ల రూపాయలు ఇచ్చే దుస్థితికి చేరారు..’ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావే శాల సందర్భంగా శనివారం ఆయన లాబీల్లో మీడియాతో ‘చిట్‌చాట్’ చేశారు.
టీడీపీ శాసన సభ్యత్వానికి తాను రాజీనామా చేశాకే మంత్రి మండలిలో చేరానని, రాజీనామా లేఖ స్పీకర్ వద్ద పెండింగులో ఉందన్నారు. తాను మండలికి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, కానీ తాను సనత్‌నగర్ నుంచే పోటీ చేస్తానని కుండబద్ధలు కొట్టారు. దమ్ముంటే చంద్రబాబు కూడా తనపై పోటీ చేయొచ్చని, అయితే ఎవరు ఓడిపోతే వారు రాజకీయాలకు దూరంగా ఉండాలని సవాలు విసిరారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తనకు మంత్రి పదవి ఇస్తే టీఆర్‌ఎస్‌లో చేరతానని సీఎంను కలిశారన్నా రు. చంద్రబాబు గతంలో కేసీఆర్‌పై మోత్కుపల్లితో మాట్లాడించి బకరా చేశారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డితో మాట్లాడించి బకరా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేతగా జగన్ సక్సెస్
ప్రతిపక్ష నేతగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవహరించినట్లే.. జగన్ కూడా చేస్తున్నారని కితాబు ఇచ్చారు. రాజశేఖరరెడ్డి ఎన్నడూ మైక్ అడగలేదని, స్పీకర్ తనకు మైక్ ఇచ్చే విధంగా కనుసైగతో తన వాళ్లతో పనిచేయించే వారని, అదే తరహాలో జగన్ ప్రతిపక్ష నేతగా రాణిస్తున్నారని కొనియాడారు.