చంద్రబాబు నాయుడు
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగి కారు(టిఆర్ఎస్ పార్టీ గుర్తు) ఎక్కకుండా అపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వారికి అనేక ఆశలు చూపుతున్నారు. టీడీపీలో ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో భారీ కాంట్రాక్టులు, నామినేటేడ్ పదవులు కట్టబెడతామని ఆశ చూపిస్తున్నారు. ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పార్టీని వీడితే తెలంగాణలో పార్టీ మనుగడకే ప్రమాదమని ఆ పార్టీ గ్రహించింది. దాంతో చంద్రబాబు కోటరి నష్ట నివారణ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
తెలంగాణ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో సగం మంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళతారనే వార్తలు చంద్రబాబుకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే పలు మార్లు ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపి, పార్టీని వీడొద్దని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్లీనరి సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతారని వార్తలు వస్తున్న నేపధ్యంలో తెలంగాణలో పార్టీకి ఉన్న 15 మంది ఎమ్మెల్యేలను కాపాడుకొనే ప్రయత్నాలను చంద్రబాబు ముమ్మరం చేశారు. ఈ బాధ్యతను తన కోటరిలోని ముఖ్య నాయకులు ముగ్గురికి అప్పగించారు. దీంతో ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహానరావు రంగంలోకి దిగారు. తెలంగాణ నేతలు పార్టీ వీడకుండా అపే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇస్తామంటూ ఎమ్మెల్యేలకు ఆశచూపుతున్నారు. అంతేకాకుండా కీలకమైన నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ రాయబేరాలు నడుపుతున్నారు. టీడీపీలో ఉంటే మంచి భవిష్యత్ ఉంటుందని నచ్చచెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైతే కేంద్రంలో తమకు అనుకూల బీజేపీ ప్రభుత్వం ఉందని ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినా ఎటు వంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు. ఒక వేళ వెళ్లినా కేసీఆర్ అందరికీ పదవులు ఇవ్వలేరని చెబుతున్నారు. కోటరి నేతల సంప్రదింపలు ఫలిస్తాయా? చంద్రబాబు నాయుడు చూపే ఆశలకు ఎమ్మెల్యేలు ఆగుతారా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
**