నేను బ్రతికున్నంత వరకు జగనే సీఎం: రాపాక | Janasena MLA Rapaka varaprasad Praises CM YS Jagan | Sakshi
Sakshi News home page

నేను బ్రతికున్నంత వరకు జగనే సీఎం: రాపాక

Published Thu, Dec 3 2020 1:41 PM | Last Updated on Mon, Sep 20 2021 11:48 AM

Janasena MLA Rapaka varaprasad Praises CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌‌రెడ్డిపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు చర్చలో భాగంగా గురువారం ప్రభుత్వ పథకాలపై ప్రసంగించిన రాపాక.. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోని ప్రజా సంక్షేమ నిర్ణయాలను చిన్న వయసులోనే అమలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్మరణీమైన స్థానం దక్కించుకున్నారని పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రజల శ్రేయస్సు గురించి ఇంతగా పరితపించే సీఎంను తానెప్పుడూ చూడలేదని, తాను బ్రతికున్నంత వరకు వైఎస్‌ జగనే ముఖ్యమంత్రి అన్నారు. సీఎం జగన్‌ లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారని పేర్కొన్నారు. సచివాలయం ద్వారా ప్రతి గ్రామంలోనూ 30 నుంచి 40 మంది వాలంటీర్లను నియమించడం ప్రశంసనీయమని కొనియాడారు. (టీడీపీ ఎమ్మెల్యేపై సీఎం జగన్‌ ఆగ్రహం)

ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక హామీలను అమలు చేస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఆయన నాయకుడిగా ఉన్న అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. దివంగత నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణ యుగంలా ఉండేదని, వైఎస్‌ జగన్‌ అదే దారిలో నడుస్తున్నారని వర్ణించారు. ఇలాంటి నాయకుడు పదికాలాల పాటు సీఎంగా ఉండాలని రాపాక ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారని ప్రశంసించారు. దేశమే ఆశ్చర్యపోయే విధంగా ప్రతినెలా పెన్షన్‌ ఇస్తున్నారని అన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, 14 ఏళ్లపాటు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు ఏనాడు ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని విమర్శించారు. కాగా రాపాక ప్రసాద్‌ ప్రసంగానికి అధికార పక్షం సభ్యులు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ సైతం చిరునవ్వులు చిందించారు. (పోలవరం నేనే పూర్తి చేస్తా)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement