
సాక్షి, అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకుల్లో కీలకమైన వ్యాపార సంస్కరణల అమల్లో రాష్ట్రం ముందంజలో నిలిచింది. 2019 ఈవోడీబీ ర్యాంకులకు సంబంధించి వ్యాపార సంస్క రణల కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్–బీఆర్‌ఏపీ)లోని మొత్తం 187 సంస్కరణల అమలు తీరును ఆధారంగా రాష్ట్రాల ర్యాంకులను నిర్ణయిస్తారు. రాష్ట్రాల్లో ఆయా సంస్కరణల అమలు తీరును కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని ‘డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్’ విభాగం పరిశీలించి వాటికి ఆమోదం తెలుపుతుంది. ఆ మేరకు ఏపీకి సంబంధించి శుక్రవారం నాటికి 186 సంస్కరణలకు ఆమోదం లభించింది. మరో సంస్కరణకు అదనపు సమాచారం అడిగారని, దీనికి కూడా 15 రోజుల్లో సమాధానం ఇవ్వనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
వ్యాపార సంస్కరణలు ఆమోదం పొందడంలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఇంకా 56 సంస్కరణలకు, కర్ణాటకలో 34 సంస్కరణలకు ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది. గతేడాది ఈవోడీబీ ర్యాంకుల్లో ఆంధ్రా, తెలంగాణ తర్వాత మూడో స్థానంలో నిలిచిన హర్యానా సంస్కరణల ఆమోదంలో మన రాష్ట్రంతో గట్టిగా పోటీపడుతోంది. హర్యానాకు సంబంధించి ఇప్పటికే 183 సంస్కరణలకు ఆమోదం లభించగా, నాలుగు సంస్కరణలకే ఆమోదం లభించాల్సి ఉంది. మొత్తంగా ఈ 187 సంస్కరణలను ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత కమిటీ ఆమోదం తెలుపుతుంది. వీటి ఆధారంగా ఈవోడీబీ ర్యాంకులు నిర్ణయమవుతాయి. సులభతర వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రాన్ని ఈ ర్యాంకులు సూచిస్తాయి. ఈ ర్యాంకుల ఆధారంగానే ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నదానిపై పారిశ్రామికవేత్తలు నిర్ణయం తీసుకుంటారు.
ఫీడ్‌బ్యాకే కీలకం...
ఈసారి ఈవోడీబీ ర్యాంకుల్లో పారిశ్రామిక ప్రతినిధుల నుంచి తీసుకునే ఫీడ్‌బ్యాక్ కీలక పాత్ర పోషించనుంది. మొత్తం 187 సంస్కరణలకుగాను 80 సంస్కరణల అమలు తీరుకు సంబంధించి నేరుగా వ్యాపారవేత్తల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఒక్కో రంగం నుంచి కనీసం 20 మందిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి అభిప్రాయాలు సేకరిస్తారు. ఇందులో కనీసం 14 మంది సంస్కరణల అమలుపై అనుకూలంగా చెపితేనే పాయింటు వస్తుంది. గతేడాది రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోపాటు పరిశ్రమల ప్రతినిధుల ఫీడ్ బ్యాక్‌ను తీసుకున్నారు. ఈసారి పూర్తిగా పరిశ్రమల ప్రతినిధుల నుంచే తీసుకోనున్నారు. అలాగే ఈ సర్వే ఎప్పుడు, ఎలా చేస్తారో అన్నది బయటకు తెలియదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పరిశ్రమల శాఖ ‘ఔట్ రీచ్’ పేరిట అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తూ స్థానిక పారిశ్రామికవేత్తల సందేహాలు, సమస్యలను పరిష్కరిస్తోంది. ఈ సదస్సులకు మంచి స్పందన వస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సదస్సులు నిర్వహించామని, మిగిలిన జిల్లాల్లోనూ ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్టు చెప్పారు.