ఒక్క రూపాయి ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనక్కి
చంద్రబాబు బృందం దావోస్ పర్యటన దారుణంగా విఫలం
రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల విముఖత
‘ఎంఓయూ’లకు ఏ ఒక్కరూ ముందుకు రాని వైనం
ప్రసంగాలు, ప్రెస్‌మీట్‌లు, స్వీయ గొప్పలకే బాబు పరిమితం
మహారాష్ట్రకు రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల వరద
2022లో దావోస్‌లో రూ.1.26 లక్షల కోట్లతో వైఎస్ జగన్ పెట్టుబడుల ఒప్పందాలు
సాక్షి, అమరావతి: దాదాపు ఆరు నెలల ముందే దావోస్ పర్యటనపై హడావుడి.. విమానం దిగకముందే జాతీయ మీడియాలో పబ్లిసిటీ.. వరుస భేటీలు..
తన పుట్టిన రోజును కూడా పట్టించుకోకుండా ఎముకలు కొరికే చలిలో ‘చినబాబు పాదయాత్ర’! అప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ.. బిల్‌గేట్స్‌తో బాబు ఫొటోలంటూ ప్రచారం.. !!
ఇవన్నీ చూస్తే సీఎం చంద్రబాబు బృందం విదేశాల నుంచి రూ.లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించిందనుకుంటారు! కనీసం కీలక ఒప్పందాలైనా కుదిరాయనుకుంటారు!! కానీ దావోస్ పర్యటనకు రూ.80 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించిన సీఎం చంద్రబాబు ఒక్క రూపాయి ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనుదిరిగారు. పారిశ్రామికవేత్తలను మెప్పించలేక తెల్లమొహం వేశారు! కూటమి సర్కారు పాలనలో ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని గమనించిన పారిశ్రామికవేత్తలు ఏ ఒక్కరూ ఎంవోయూలకు ముందుకు రాలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొహం చాటేశారు. సమావేశాలకు వారం ముందే జాతీయ మీడియాలో ప్రచారం, ఇంటర్వ్యూల కోసం రూ.కోట్లలో చెల్లించిన ప్రభుత్వ పెద్దలు తీరా అక్కడకు వెళ్లాక పెట్టుబడులు ఆకర్షించటాన్ని పక్కనపెట్టేసి స్వీయ ప్రచారంలో మునిగిపోయారు. ఐటీకి ఆద్యుడిని తానేనని, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారంటే తన ఘనతేనని చెప్పుకుని సీఎం చంద్రబాబు మురిసిపోయారు. దీంతో సింగడు అద్దంకి పోనూ పోయాడు.. రానూ వచ్చాడు.. అన్నట్లుగా ఆయన పర్యటన ముగిసింది.
‘ఇంత కష్టపడినందుకు బిల్‌గేట్స్‌తో ఫోటో మిగిలింది.. సంతోషం’ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. మనదేశం నుంచి అక్కడకు వెళ్లిన చిన్నాచితకా వ్యాపారులు బిల్స్‌గేట్, ఇతర ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో ఫోటోలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకున్నారు. కాకపోతే వారు సోషల్ మీడియాలో సొంత వాల్స్ మీద పోస్ట్ చేసుకుంటే.. సీఎం చంద్రబాబు ఫోటోలను ఐ అండ్ పీఆర్ అధికారులు అందరికీ పంపించి ప్రచారం చేయించారు.
ఇతర రాష్ట్రాలకు లక్షల కోట్లు.. ఏపీకి శూన్యం..
దావోస్ పర్యటనకు ఈసారి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా ఎటువంటి పెట్టుబడుల ఒప్పందాలు లేకుండా ఏపీ బృందం రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. రిలయన్స్, ఎల్ అండ్ టీ, అమెజాన్, వర్థన్ లిథియం, జేఎస్‌డబ్ల్యూ, టాటా తదితర దిగ్గజ సంస్థలు మహారాష్ట్రలో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని, నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానని, 1995 నుంచి దావోస్‌కు వెళుతున్నానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు మాత్రం ఒక్క పెట్టుబడిని కూడా ఆకర్షించలేకపోయారు. మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిగి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిల్‌గేట్స్‌తో సమావేశమై ఆ ఫోటోను ఎల్లో మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అసలు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు, బిల్‌గేట్స్‌కు ఇప్పుడు సంబంధం లేదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ పత్రికలు బాకాలూదాయి.
రాష్ట్రం గురించి చెప్పకుండా రాజకీయ ప్రసంగాలు..
దావోస్ మ్యాన్‌గా తనకు తాను కీర్తించుకునే సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమయ్యారు. రెడీ.. యాక్షన్.. కెమెరా అంటూ ఫోటోలు, వీడియోలతో ప్రచారం చేయడమే గానీ కనీసం కోటి రూపాయల పెట్టుబడిని తీసుకురాలేకపోయారు. తన తనయుడు, మంత్రి నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడం కోసం సీఎన్‌బీసీ, టీవీ 18, ఎన్డీటీవీ, బిజినెస్ టుడే లాంటి జాతీయ చానళ్లకు రూ.కోట్ల కొద్ది ప్రజాధనాన్ని వెచ్చించి ప్రచారం చేయించారు. అయితే లోకేష్ రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించడానికి బదులు రాజకీయ ప్రసంగాలు చేయడంతో పారిశ్రామికవేత్తలు విస్తుపోయారు.
రాష్ట్రం వెనుకబడిపోయిందని, విద్యారంగం సర్వ నాశనం అయిందని, పునర్నిర్మాణ పనిలో ఉన్నామంటూ రాజకీయ దురుద్దేశాలతో ఏపీ పరువును అంతర్జాతీయ వేదికలపై దిగజార్చారు. దీన్ని గమనించిన పారిశ్రామికవేత్తలు ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. ఇక పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తాను వచ్చిన పని మర్చిపోయి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని ఒకసారి.. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకపోతే మరో ఎలన్ మస్క్ అయ్యేవారని చాట్ జీపీటీ చెప్పిందంటూ వ్యాఖ్యలు చేయడంతో పారిశ్రామికవేత్తలు ముక్కున వేళ్లేసుకున్నారు.
రూ.80 కోట్లకుపైగా ఖర్చు..
తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2022లో దావోస్ పర్యటనకు వెళ్లి రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పిస్తే సీఎం చంద్రబాబు మాత్రం ఒక్క పెట్టుబడిని కూడా తీసుకురాలేకపోయారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశాల కోసం పెవిలియన్, ప్రచార ఖర్చుల దగ్గర నుంచి ప్రయాణం, వసతి వరకు సుమారు రూ.80 కోట్లకుపైన వ్యయం చేస్తే దారి ఖర్చులు కూడా రాలేదని మరో అధికారి వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలకు రూ.లక్షల కోట్ల పెట్టుబడులు దక్కితే మనకు మాత్రం ఫోటోలు – వీడియోలే మిగిలాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment