ఐటీ, ఆటోమొబైల్‌లో పుష్కల అవకాశాలు
మలేసియా మంత్రికి వివరించిన కేటీఆర్
- పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు
- రాష్ట్రంలో మలేసియా కంపెనీల పార్కుకు ప్రతిపాదన
- పెట్టుబడులపై ఆసక్తి చూపిన అక్కడి కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో తెలంగాణ రాష్ట్రంతో కలిసి మలేసియా పనిచేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. మలేసియా పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఆ దేశ మౌలిక వసతుల శాఖ మంత్రి డాటోసెరి సామీతో సమావేశమయ్యారు. మలేషియన్ కంపెనీలతో ప్రత్యేకంగా తెలంగాణలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయనకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు మలేసియా ప్రభుత్వం ఆసక్తిగా ఉందని డాటోసెరి సామీ కేటీఆర్‌కు తెలిపారు.
ఉమ్మడి భాగస్వామ్యాలు అవసరం...
ఆ తర్వాత మంత్రి కేటీఆర్ మలేసియా ఇండియా బిజినెస్ కౌన్సిల్‌తో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను 20కి పైగా కంపెనీల ప్రతినిధులకు వివరించారు. పరిశ్రమలకు అనుమతుల జారీలో అనుసరిస్తున్న నూతన పారిశ్రామిక విధానం ఉపయోగాలను తెలిపారు. స్వీయ ధ్రువీకరణతో పరిశ్రమల స్థాపనకు అనుమతి తదితర అంశాలను వారి ముందుంచారు. సమర్థవంత, సుస్థిర నాయకత్వంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ భారత్‌లో పెట్టుబడులకు అత్యంత అనువైందన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉమ్మడి భాగస్వామ్యాలు అవసరమని, వీటితో వ్యాపారావకాశాలు విశ్వవ్యాప్తం అవుతాయన్నారు.
కంపెనీల ప్రతినిధుల సూచనల మేరకు వ్యాపార, వాణిజ్య అవకాశాల సమాచారాన్ని పరస్పరం పంచుకోడానికి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఇన్‌ఫర్మేషన్ రిపాసిటరీ సెల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొం దించి రాష్ట్రంలోని చిన్న, మధ్యతర పరిశ్రమల సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. అదే విధంగా ఎల్‌ఈడీ తయారీ మార్గదర్శకాలను సరళీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమావేశంలో పాల్గొన్న ఎల్‌ఈడీ ఉత్పత్తిదారులకి మంత్రి చెప్పారు. ‘తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్’తో కలిసి పనిచేసేందుకు ‘కౌలాలంపూర్ రీజినల్ సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్’ ఆసక్తి చూపింది. మలేసియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ విందులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి 70 మంది సీఈఓలు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు, పాలసీలను తెలుసుకుని అభినందించారు.
ఇంటర్‌సిటీ బస్ టెర్మినల్ నిర్మించండి
మలేసియన్ రీసోర్స్ కార్పొరేషన్ బెర్హాడ్(ఎంసీఆర్‌బీ) చెర్మైన్ అజ్లాన్ జైనోల్, ఎండీ మహమ్మద్ సలీం ఫతే బిన్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. కౌలాలంపూర్‌లోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థను కేటీఆర్ హైదరాబాద్‌లో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ నిర్మించేందుకు ఆహ్వానించారు. అదే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఓ కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.