malaysia tour
-
ఈసారి 6 లక్షల టూరిస్టులు టార్గెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దాదాపు 5–6 లక్షల మంది భారతీయ పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించవచ్చని మలేషియా అంచనా వేస్తోంది. గత ఏడాది ఈ సంఖ్య సుమారు 3 లక్షలుగా నమోదైంది. శుక్రవారమిక్కడ నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న సందర్భంగా టూరిజం మలేషియా సీనియర్ డిప్యుటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రమోషన్ (ఆసియా, ఆఫ్రికా) మొహమ్మద్ అమీరుల్ రిజాల్ అబ్దుల్ రహీం ఈ విషయాలు తెలిపారు. కరోనాకు పూర్వం 2019లో భారత్ నుంచి 7.35 లక్షల పైచిలుకు టూరిస్టులు వచ్చారని, పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వచ్చే ఏడాది తిరిగి ఆ స్థాయికి ఇది చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. భారత్ నుంచి వచ్చే టూరిస్టుల్లో అత్యధిక శాతం మంది దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. గతేడాది 70 లక్షల మంది పైగా విదేశీ టూరిస్టులు మలేషియాను సందర్శించగా ఈ ఏడాది ఇది 1.50 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. జనవరి 30న ప్రారంభమైన టూరిజం మలేషియా రోడ్‌షోలు వివిధ నగరాల్లో ఫిబ్రవరి 7 వరకు కొనసాగనున్నాయి. -
నేడు విదేశాలకు మోదీ
న్యూఢిల్లీ: ఆసియా దేశాలైన ఇండోనేసియా, సింగపూర్, మలేసియాలతో భారత్‌కు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ మూడు దేశాల్లో తన పర్యటనతో ప్రస్తుతమున్న సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్నారు. మే 29 నుంచి జూన్ 2వరకూ మోదీ ఇండోనేసియా, సింగపూర్, మలేసియాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తన పర్యటన వివరాలను ప్రధాని ఫేస్బుక్లో పంచుకున్నారు. ఇండోనేసియా రాజధాని జకార్తాకు మే 29న చేరుకోనున్నట్లు మోదీ తెలిపారు. మరుసటిరోజు ఆ దేశ ప్రధాని జోకో విడోడోతో భేటీ అవుతానన్నారు. ఆతర్వాత ఇండియా–ఇండోనేసియా సీఈవో ఫోరమ్‌తో, ఇక్కడి భారత సంతతి ప్రజలతో సమావేశమవుతానని వెల్లడించారు. అనంతరం మే 31న సింగపూర్‌కు వెళ్తానన్నారు. ఈ పర్యటనలో టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, పట్టణ ప్రణాళిక, కృత్రిమ మేథ రంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు పెంపొందించడంపై దృష్టి సారిస్తామన్నారు. జూన్ 1న సింగపూర్ ప్రధాని లీతో సమావేశమవుతానని మోదీ తెలిపారు. సింగపూర్‌కు వెళ్లేముందు మలేసియాలో ఆగి ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మహతీర్ మొహమ్మద్‌కు శుభాకాంక్షలు తెలపనున్నట్లు మోదీ చెప్పారు. సింగపూర్‌లో 28 ఆసియా–పసిఫిక్ దేశాల రక్షణమంత్రులు, ఆర్మీచీఫ్‌లు హాజరయ్యే షాంగ్రీలా సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. -
ఆయనవి ఆరోపణలు మాత్రమే: విశాల్
సాక్షి, చెన్నై: నటుడు ఎస్వీ. శేఖర్ ఆరోపణలు ఆమోదయోగ్యంగా లేవని నడిగర్ సంఘం కార్యదర్శి, నటుడు విశాల్ పేర్కొన్నారు. ఎస్వీ.శేఖర్ మలేషియాలో సీనియర్ కళాకారులకు గౌరవం లభించలేదని, నిర్వాహకులు అవకతవకలకు పాల్పడ్డారని పలు ఆరోపణలు చేస్తూ సంఘం ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మలేషియా నుంచి వచ్చిన విశాల్ మీడియాతో మాట్లాడారు. మలేషియాలో స్టార్స్ క్రికెట్, తదితర కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయన్నారు. కార్యక్రమానికి చేకూరిన నిధుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఎస్వీ. శేఖర్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఆరోపణలు ఆమోదయోగ్యంగా లేవన్నారు. మలేషియాలో సీనియర్ కళాకారులందరికీ గౌరవం లభించిందని స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం రవాణా కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని విశాల్ విజ్ఞప్తి చేశారు. సమ్మె కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది సాధారణ ప్రజలేనన్నారు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి స్పందించాల్సిందిగా అడిగిన ప్రశ్నకు... రజనీకాంత్ రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారని, తన మద్దతు ఎవరికన్నది ఎన్నికల సమయంలో ప్రకటిస్తానని విశాల్ తెలిపారు. -
మారిన పేరు
సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమాన సంఘం పేరు మారింది. ఇక, రజని మక్కల్ మండ్రంగా అభిమాన సేన ముందుకు సాగనున్నారు. కథానాయకుడు గత ఏడాది చివరి రోజున రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. తమ నాయకుడికి మద్దతుగా అభిమాన లోకం ఉరకలు వేస్తున్నది. ఓ వైపు అభిమానుల్ని ఏకం చేస్తూ, మరోవైపు రాజకీయ పార్టీ ఏర్పాటు మీద తలైవా దృష్టి కేంద్రీకరించారు. ఇందుకు తగ్గ ప్రత్యేక బృందం రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. అదే సమయంలో ప్రస్తుతం మలేషియా పర్యటనలో ఉన్న రజనీకాంత్ సంక్రాంతి పర్వదినం వేళ పార్టీ విషయంగా కొత్త కబురు అందించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అభిమాన లోకం ఇక, రజనీ మక్కల్ మండ్రంగా ప్రజాసేవకు అంకితం అయ్యేందుకు నిర్ణయించడం గమనార్హం. మక్కల్ మండ్రం: కథానాయకుడికి అభిమాన లోకం దేశ విదేశాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆదిశగా 22 వేల సంఘాల ఆయనకు రిజిస్టర్ అయి ఉన్నాయి. అలాగే, మరో ముఫ్పై వేల వరకు సంఘాలు రిజిస్టర్ కాకుండానే, తమ సేవల్ని అందిస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ ఒకే వేదిక మీదకు తెస్తూ కొత్త సంవత్సరం తొలి రోజున రజనీ ఓ నిర్ణయం తీసుకున్నారు. అఖిల భారత రజనీ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరిట వెబ్‌సైట్‌ను రూపకల్పన చేశారు. ఇందులో తనకు మద్దతుగా నిలబడే వారు, తమిళనాట మార్పును ఆశిస్తున్న వారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని రజనీ పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు స్పందన ఆశాజనకంగానే ఉన్నది. ప్రస్తుతానికి యాభైలక్షల మంది వరకు తమ పేర్లను అందులో నమోదు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సంఘాన్ని ఇక, మక్కల్ మండ్రంగా మార్చేసి, ప్రజాసేవలో విస్తృతంగా దూసుకెళ్లేందుకు అభిమాన సంఘాలు నిర్ణయించాయి. ఇందుకు రజనీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రజని మండ్రం పేరును శనివారం మార్చేశారు. రజనీ మక్కల్‌మండ్రం (రజనీ ప్రజా సంఘం)గా ఇక, సేవల్ని అభిమాన లోకం విస్తృతం చేయనుంది. ఇన్నాళ్లు సినిమా రిలీజ్ సమయాల్లో హంగామా సృష్టించిన అభిమాన సంఘాలు, ఇక, రజనీ మక్కల్ మండ్రం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు అడుగులు వేశాయి. ప్రజాహిత కార్యక్రమాలు వేగవంతం చేయనున్నామని, ప్రజల్లో తమ నాయకుడికి మద్దతు హోరెత్తడం లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు ఆ మండ్రం వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఐటీ, ఆటోమొబైల్‌లో పుష్కల అవకాశాలు
మలేసియా మంత్రికి వివరించిన కేటీఆర్ - పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు - రాష్ట్రంలో మలేసియా కంపెనీల పార్కుకు ప్రతిపాదన - పెట్టుబడులపై ఆసక్తి చూపిన అక్కడి కంపెనీలు సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో తెలంగాణ రాష్ట్రంతో కలిసి మలేసియా పనిచేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. మలేసియా పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఆ దేశ మౌలిక వసతుల శాఖ మంత్రి డాటోసెరి సామీతో సమావేశమయ్యారు. మలేషియన్ కంపెనీలతో ప్రత్యేకంగా తెలంగాణలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయనకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు మలేసియా ప్రభుత్వం ఆసక్తిగా ఉందని డాటోసెరి సామీ కేటీఆర్‌కు తెలిపారు. ఉమ్మడి భాగస్వామ్యాలు అవసరం... ఆ తర్వాత మంత్రి కేటీఆర్ మలేసియా ఇండియా బిజినెస్ కౌన్సిల్‌తో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను 20కి పైగా కంపెనీల ప్రతినిధులకు వివరించారు. పరిశ్రమలకు అనుమతుల జారీలో అనుసరిస్తున్న నూతన పారిశ్రామిక విధానం ఉపయోగాలను తెలిపారు. స్వీయ ధ్రువీకరణతో పరిశ్రమల స్థాపనకు అనుమతి తదితర అంశాలను వారి ముందుంచారు. సమర్థవంత, సుస్థిర నాయకత్వంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ భారత్‌లో పెట్టుబడులకు అత్యంత అనువైందన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉమ్మడి భాగస్వామ్యాలు అవసరమని, వీటితో వ్యాపారావకాశాలు విశ్వవ్యాప్తం అవుతాయన్నారు. కంపెనీల ప్రతినిధుల సూచనల మేరకు వ్యాపార, వాణిజ్య అవకాశాల సమాచారాన్ని పరస్పరం పంచుకోడానికి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఇన్ఫర్మేషన్ రిపాసిటరీ సెల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొం దించి రాష్ట్రంలోని చిన్న, మధ్యతర పరిశ్రమల సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. అదే విధంగా ఎల్ఈడీ తయారీ మార్గదర్శకాలను సరళీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమావేశంలో పాల్గొన్న ఎల్ఈడీ ఉత్పత్తిదారులకి మంత్రి చెప్పారు. ‘తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్’తో కలిసి పనిచేసేందుకు ‘కౌలాలంపూర్ రీజినల్ సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్’ ఆసక్తి చూపింది. మలేసియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ విందులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి 70 మంది సీఈఓలు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు, పాలసీలను తెలుసుకుని అభినందించారు. ఇంటర్సిటీ బస్ టెర్మినల్ నిర్మించండి మలేసియన్ రీసోర్స్ కార్పొరేషన్ బెర్హాడ్(ఎంసీఆర్బీ) చెర్మైన్ అజ్లాన్ జైనోల్, ఎండీ మహమ్మద్ సలీం ఫతే బిన్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. కౌలాలంపూర్‌లోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థను కేటీఆర్ హైదరాబాద్‌లో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ నిర్మించేందుకు ఆహ్వానించారు. అదే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఓ కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. -
భారత మహిళలకు నాలుగో విజయం
మలేసియాతో హాకీ టోర్నీ కౌలాలంపూర్: మలేసియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టును వరుసగా నాలుగోసారి ఓడించింది. శనివారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0తో నెగ్గింది. 38వ నిమిషంలో అనుప బార్లా ఫీల్డ్ గోల్‌తో జట్టు ఖాతా తెరిచింది. ఇక్కడి నుంచి పూర్తి ఆధిక్యం ప్రదర్శించిన భారత్.. రితూష ఆర్య (45వ ని.), నమిత టొప్పో (65వ ని.) గోల్స్‌తో తిరుగులేని విజయాన్ని అందుకుంది.