మానవాళికిది జీవన్మరణ సమస్య. మానవ నాగరికతకు అస్తిత్వ సమస్య. పారిస్‌లో నేడు ప్రారంభం కానున్న వాతావరణ మార్పుల సదస్సు, పరిష్కారాన్ని చూపాల్సిన అంతర్జాతీయ వేదిక. దాదాపు ప్రపంచ దేశాలన్నీ హాజరవుతున్న ఆ సదస్సు అలాంటి భరోసాను ఇవ్వాలని ప్రపంచ ప్రజల ఆకాంక్ష. రెండు దశాబ్దాలుగా వాతావరణ మార్పులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతున్నా, శాస్త్ర వేత్తలంతా కోరుతున్నట్టు ఈ శతాబ్ది చివరికి భూమి సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల పారిశ్రామికీకరణ పూర్వ దశ కంటే 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు మించి పెరగదనే హామీ ఎండమావిగానే ఉంటోంది. ఆ పరిమితిని దాటితే తిరిగి మరల్చరాని విపత్కర వాతావరణ మార్పులు తప్పవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2015 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించే ఒప్పందాన్ని సాధించాలని ఐక్య రాజ్య సమితి వాతావరణ మార్పుల వేదిక (యూఎన్‌ఎఫ్‌సీసీ), తన 2011 దర్బన్ వార్షిక సమావేశంలో (కాప్-17) లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి పారిస్‌లో జరుగుతున్న 21వ వార్షిక సదస్సు(కాప్-21)లోనైనా ప్రపంచదేశాలన్నీ చట్టపరంగా కట్టుబడి ఉండాల్సిన ఉద్గారాల కోతలకు, భూతాపం పెరుగుదల వల్ల కలుగుతున్న వాతావరణ మార్పుల దుష్ర్పభావాలను ఉపశమింపజేసే చర్యలకు అంగీకరిస్తాయని అంతా ఆశిస్తున్నారు. అయితే రెండు దశాబ్దాలుగా వాదోపవాదాలే తప్ప కర్బన ఉద్గారాల విడుదల, అందుకు ప్రధాన కారణమైన బొగ్గు, చమురు, సహజ వాయువుల వంటి కర్బన ఇంధనాల వాడకం పెరుగుతూనే ఉన్నాయి. ప్రత్యామ్నాయ, శాశ్వత ఇంధన వనరుల అభివృద్ధి, ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి లేదు. పర్యవసానంగా భూతాపం పెరుగుతూనే ఉంది. ప్రపంచం అనూహ్యమైన వాతావరణ మార్పులను చవిచూడాల్సి వస్తోంది.
పారిస్ సదస్సుకు హెచ్చరికలాగా ఐరాస వాతావరణ సంస్థ, 2015 అత్యంత అధిక ఉష్ణోగ్రతను నమోదు చేసిన సంవత్సరం కావచ్చనే చేదు వార్తను వినిపిం చింది. ఈ వేసవిలో కనీవినీ ఎరుగని విధంగా 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండలను మన దేశం భరించాల్సివచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాది వేసవితో పోలిస్తే ఈ వేసవిలో రెట్టింపుకు పైగా ఎండలకు చనిపోయారు. వచ్చే ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని భావిస్తున్నారు. గత రెండేళ్లుగా దుర్భిక్షం, అకాల, అధిక వర్షాలతో తల్లడిల్లుతున్న దేశ ప్రజలు, ప్రత్యేకించి తెలుగు రైతాంగం వాతావరణ మార్పుల దుష్ర్పభావాలకు ప్రత్యక్ష సాక్షులు. ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న 350 కోట్ల పేదలే వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా నష్ట పోతున్నవారు. అంటే భారత్ వంటి వర్ధమాన దేశాలే ప్రధానంగా వాతావరణ మార్పుల పర్యవసానాలను మోయాల్సివస్తోంది. చేయని తప్పుకు శిక్షను అనుభ వించాల్సి వస్తోంది. 150 ఏళ్లుగా విచ్చలవిడిగా చౌకగా లభించే కర్బన ఇంధనాలను వాడి భూతాపం పెరుగుదలకు కారణమైనవి అభివృద్ధిచెందిన దేశాలే.
అవే నేడు సమాన బాధ్యతా సూత్రాన్ని వల్లెవేస్తూ, తమ చారిత్రక బాధ్యతను దాటవేయాలని చూడటం విచిత్రం. 1992 ఐరాస ధరిత్రీ సదస్సు 'వాతావరణపరమైన క్షీణతకు వివిధ దేశాలు భిన్న స్థాయిల్లో కారణమైన రీత్యా వాటికి ఉమ్మడి లక్ష్యాలు, వేరు వేరు స్థాయిల బాధ్యతలు ఉంటాయి'అని సూత్రీకరించింది. ఆ చారిత్రక బాధ్యత నుంచి తప్పించుకోడానికే అమెరికా 1997 క్యోటో వాతావరణ మార్పుల ఒప్పం దానికి దూరంగా ఉంది. నేటికీ అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలది అదే వైఖరి.
పారిస్ సదస్సుకు 'భారత్ ఒక సవాలు కానుంది' అంటూ అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పది రోజుల క్రితం చేసిన వ్యాఖ్య దాని కొనసాగింపే. చైనా, భారత్, బ్రెజిల్, దక్షిణాఫిక్రా, దక్షిణ కొరియా తదితర దేశాలను వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా వర్గీకరించారు. అవి కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పాటూ ఉద్గారాల కోతలకు, ఉపశమన చర్యల వ్యయాలను భరించడానికి అంగీకరించాలని అమెరికా చాలా కాలంగా వాదిస్తోంది.
భారత్ వంటి వర్ధమాన దేశాలు కొత్తగా పారిశ్రామికీకరణను ప్రారంభించిన దేశాలు. చౌకగా లభించే కర్బన ఇంధనాలపై ఆధారపడటం వాటికి తప్పనిసరి. లేదా అవి ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారడానికి అయ్యే వ్యయాన్ని అభివృద్ధి చెందిన దేశాలే భరించాలి. ప్రధాని నరేంద్ర మోదీ 2022 నాటికి భారత శాశ్వత ఇంధన ఆధారిత విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 175 జిగా వాట్లకు పెంచుతామన్నారు. ఈ భారీ లక్ష్యం సాధ్యా సాధ్యాలపై ఉన్న విమర్శల సంగతి పక్కనపెడితే, అందుకు తగిన ఆర్థిక, సాంకేతిక వనరులను సమకూర్చుకోవడం ఎలా? అనే సమస్యకు మోదీ ప్రభుత్వం సమా దానం పారిస్ సదస్సుకు సంబంధించి కీలకమైనది. 'పాశ్చాత్య దేశాలు ప్రపం చానికి, భూమికి కలుగజేసిన నష్టానికి మూల్యాన్ని చెల్లించాల్సిందే' అని విద్యుత్, శాశ్వత ఇంధన వనరుల సహాయ మంత్రి పియూష్ గోయల్ ఈ ఏడాది మేలో లండన్‌లో వాతావరణ మార్పుల సమావేశంలో స్పష్టం చేశారు.
తలసరి ఇంధనం లేదా విద్యుత్తు వినియోగం దృష్ట్యా చూసినా, తలసరి కర్బన ఉద్గారాల విడుదల దృష్ట్యా చూసినా అభివృద్ధిచెందిన దేశాలతో పోలిస్తే భారత్ వంటి దేశాలపైన వాతావరణ మార్పుల విషయంలో ఆంక్షలు, భారం మోపలేమనే వాస్తవాన్ని సంపన్న దేశాలు గుర్తించనంతవరకు వాతావరణ మార్పుల సమస్యకు పరిష్కారం దొరకదు. వర్ధమాన దేశాలలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభి వృద్ధికి ఆర్థిక, సాంకేతిక సహాయం చేయడంతోపాటూ అవి స్వయంగా కర్బన ఇంధనాల నుంచి హరిత ఇంధనాలకు మరలాల్సి ఉంటుంది. అప్పుడే వెనుకబడిన దేశాల అభివృద్ధికి వీలుగా మరింత కార్బన్ స్పేస్ వాటికి అందుబాటులోకి వస్తుంది.
వర్ధమాన దేశాల న్యాయమైన ఈ డిమాండ్లేవీ సంపన్న దేశాలకు సమంజ సంగా కనబడటం లేదు. ఈ నేపథ్యంలో పారిస్ సదస్సులో భారత్ కీలక పాత్రధారి కానుంది. అమెరికాసహా సంపన్న దేశాలు తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తూ, వాతావరణాన్ని శుభ్రం చేసే భారాన్ని ఎక్కువగా మోసేలా ఒప్పించడానికి భారత్, వర్ధమానదేశాల జీ-77తోనూ, చైనాతోనూ కలిసి కృషి చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అభివృద్ధిచెందిన దేశాలు తమ సంకుచిత, స్వార్థపూరిత వైఖరిని విడనా డందే వాతావరణ మార్పుల విపత్తుకు సమర్థవంతమైన సమాధానం దొరకదు. సంపన్న దేశాలలో అలాంటి మార్పునకు పారిస్ నాంది కాగలదని ఆశిద్దాం.