COP21
-
‘పారిస్’ భరోసాను ఇచ్చేనా?
వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్న దుష్పలితాలపైనా, ప్రత్యే కించి ఆహారభద్రతకు ముంచు కొస్తున్న ముప్పుపైనా ప్రపంచం దృష్టి సారించింది. వాతావరణ మార్పులపై గత ఏడాది పారిస్‌లో నవంబర్-డిసెంబర్ మాసాలలో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు ‘కాప్-21’ ‘వాతావరణ విధానపత్రాన్ని’ రూపొందించింది. అయితే సంపన్న దేశాలు, వాటి హామీలను నిలబెట్టు కోగలవా? సందేహమే. ఆర్థికాభివృద్ధి పేరుతో కాలుష్యాన్ని వెదజల్లుతున్న అమెరికా లాంటి సంపన్న దేశాలు... అభివృద్ధి చెందుతున్న దేశాలను దోషులుగా చూపుతున్నాయి. ఈనేపథ్యంలో భారతదేశం తాను ఎదుర్కొంటున్న వాతావరణ సమస్యలను, ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను సొంతంగా పరిష్కరించుకోడానికి పూనుకోవాలి. పెరిగిపోతున్న భూతాపం, వ్యవసాయ రంగానికి ప్రధాన శత్రువు. ప్రత్యక్షంగా అవి రైతులపైనే తీవ్ర ప్రభావం చూపుతాయి. నైసర్గికంగా మన దేశానికి ఉత్తరాదిన హిమాలయ మంచు పర్వత శ్రేణులు, దక్షిణా దిన మూడు వైపులా మహా సముద్రాలు, ఆగ్నేయ ప్రాంతంలో విశా లమైన థార్ ఎడారి, మధ్య ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి. దీంతో అసాధారణ వాతావరణ వైవిధ్యం నెలకొని ఉంది. పైగా భౌగోళికంగా కర్కాటక, మకర రేఖల మధ్య ఉన్న అనేక వర్ధమాన వ్యవసాయక దేశాలలో మన దేశం ఒకటి. ఈ కారణంగానే దేశాన్ని 7 వాతావరణ జోన్లుగా వర్గీకరించారు. ఆయా జోన్లలో రుతుపవనాల గమనం ఆధారంగా వ్యవసాయం అనాదిగా సాగుతోంది. గత కొన్నేళ్లుగా దేశ వ్యవసాయ రంగానికి ఊహించని ఉత్పాతాలు ఎదురయ్యాయి. ఇవి వాతావరణంలో తరచూ చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల సంభవించుతున్నవే! ప్రధానంగా పెట్రోల్, డీజిల్, నత్రజని ఎరువులు తదితర కర్బన, రసాయనాల వినియోగం వల్ల భూవాతావరణం లోని ‘గ్రీన్హౌస్’ వాయువులు పెరిగిపోతున్నాయి. వాటిని నియంత్రించకుండా, ప్రస్తుత స్థాయిలోనే పెరగనిస్తే రాబోయే 100 ఏళ్లలో భూమి ఉష్ణోగ్రత ప్రస్తుత 1.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 4.5 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుందని అంచనా. ఇది జీవరాశి ఉనికికే ముప్పు. 2015 జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా భూ, సముద్ర ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో అధికంగా నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దేశాల్లో మన దేశం 5వ స్థానానికి చేరింది. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు వ్యవసాయ ఉత్పత్తుల్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఒక డిగ్రీ సెల్సియస్ మేర భూతాపం పెరిగితే, ఆ ప్రాంతంలో ధాన్యం ఉత్పత్తి 20% పడిపోతుంది. వరి వెన్ను పుష్పించే సమయంలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటితే అది పనికి రాకుండా పోతుంది. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉన్న మనదేశంలో వాతావరణ మార్పుల వల్ల రాబోయే దశాబ్ద కాలంలో వ్యవసాయ దిగుబడులు రమారమి 30% క్షీణిస్తాయి. వాతావరణ మార్పుల వల్ల అనేక రాష్ట్రాల్లో వరి, గోధుమ దిగుబడులు గణనీయంగా తగ్గాయని, దేశ ఆహార భద్రతపై కూడా అవి తీవ్ర ప్రభావం చూపగలవని కేంద్ర వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. పర్యావరణ మార్పుల కారణంగానే 2016లో ప్రపంచంలో అదనంగా కోటి మంది పేదలు ఆకలి, దుర్భిక్షాల బారిన పడబోతున్నారని అంచనా. కాలుష్యాన్ని నిరోధించడం, తగ్గించడం, వడబోయడం, పునరుత్పాదక ఇంధనాలను వాడటం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతామని అన్ని దేశాలూ హామీలు ఇచ్చాయి. రాబోయే 15 ఏళ్లలో కర్బన ఉద్గారాలను 30% నుంచి 35% మేరకు తగ్గించుకుంటామని ప్రకటించాయి. ప్రధాని మోదీ సౌరశక్తిని భారీగా వినియోగంలోకి తేవడం కోసం అంతర్జాతీయ సౌరశక్తి కూటమి ఏర్పాటుకు అంకు రార్పణ చేశారు. డీజిల్ పంపుసెట్లకు బదులుగా సౌరశక్తితో నడిచే పంపు సెట్లను సమకూర్చే ప్రక్రియను ప్రారంభించారు. అయితే, దేశీయ వ్యవసాయరంగానికి తక్షణమే ముంచుకొస్తున్న పెను ప్రమాదాల నివారణకు అవి ఏ మేరకు పరిష్కారం చూపుతాయన్నదే ప్రధాన సమస్య. దేశంలో వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్న ఉత్పాతాలు ఆందోళనకరంగా పరిణమించాయి. మూడేళ్ల క్రితం నాటి ఉత్తరాఖండ్ విలయం నుంచి ఇటీవల తమిళ నాడులో చెన్నై సహా 3 జిల్లాల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో కురిసిన కుండపోత వర్షాల వరకు పెరుగుతున్న ముప్పును సూచించేవే. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరువు, అకాల వర్షాలు ఏకకాలంలో వ్యవసాయాన్ని దెబ్బతీశాయి. తెలంగాణలో తీవ్ర కరువు ఏర్పడింది. దాదాపు 20 రాష్ట్రాలు వరదలు, కరువు బారిన పడ్డాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. వేసిన పంటల్లో 70 శాతానికి మించి ఉత్పత్తి చేతికి అందని దుస్థితి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రబీ సాగు 50% మించదని అంచనా. పర్యావరణ మార్పుల వల్ల గత కొన్నేళ్లుగా రుతు క్రమమే తారుమారయింది. తొలకరి పడినా, తర్వాత సుదీర్ఘమైన వర్షాభావం ఏర్పడటం, ఆ వెను వెంటనే అకాల వర్షాలు పడటం గత కొన్నేళ్లుగా ఎదురవు తున్న విచిత్ర పరిస్థితి. ఎప్పుడు సాగు ప్రారంభించాలో, ఏ పంటలు వేయాలో అర్థం కాని అయోమయం. ఈ పరిస్థి తులకు అనుగుణంగా రైతులకు సరైన అవగాహన కల్పించ లేకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం. వాతావరణ మార్పుల ఉత్పాతాల వల్ల రైతాంగానికి గతంలో కంటే ఎక్కువ నష్టం వాటిల్లుతున్నది. కానీ ప్రభుత్వం వారికి అండగా నిలవడం లేదు. పంట నష్ట పరిహారం, బీమా అందడం లేదు. దిక్కుతోచని రైతులు పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తక్షణం రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం.. ప్రభుత్వాల ఉదాసీన వైఖరికి చెంపపెట్టు. చైనా, భారత్‌లు వ్యవసాయోత్పత్తుల్లో 70% మేర వృద్ధిని సాధించగలిగితే తప్ప, 2050 నాటికి తమ ప్రజల ఆకలిని తీర్చలేవని అంచనా. ఆ వృద్ధిని సాధించాలంటే వ్యవసాయ పరిశోధన రంగంలో కనీసం 3,000 కోట్ల డాలర్లు ఖర్చు చేయాలి. లేకపోతే ఆహార భద్రత ప్రశ్నార్థకమే. ఈ విషయంలో దక్షిణాసియాలోనే భారత్ వెనుకబడి ఉంది. ఇటీవలే కేంద్రం కళ్లు తెరిచి ఏటా 4% ఆహార ధాన్యాల వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకుంది. భారత్, చైనాలలో ఆహార కొరత ఏర్పడితే తమ ఎగుమతులను పెంచుకోవాలని అగ్రరాజ్యాలు ఆశపడుతున్నాయి. అవి మన వ్యవసాయాభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తాయనుకోలేం. మన రైతుకు రక్షణగా స్వీయ కార్యాచరణను రూపొందించుకొని, వ్యవసాయరంగ తక్షణ అవసరాలను తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్న వాస్తవాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి. -డా॥వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు సెల్ : 99890 24579 -
క్లైమెట్ జస్టిస్‌పై మోదీ కొత్త బుక్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాసిన తాజా పుస్తకం 'కాన్వినియెంట్ యాక్షన్-కంటిన్యూటీ ఫర్ ఛేంజ్' బుధవారం పారిస్‌లో విడుదల అయింది. వాతావరణ మార్పుల సదస్సు కాప్-21 సందర్భంగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హొలాండ్, పలువురు ప్రపంచాధినేతలు పాల్గొన్నారు. ఈ పుస్తకం గురించిన విశేషాలు - వాతావరణ మార్పుల సమస్య తీవ్రతను తగ్గించేందుకు భారత్ చేస్తున్న కృషి, వాతావరణ న్యాయం ఆవశ్యకతను వివరిస్తూ తాను ఈ పుస్తకం రాసినట్టు ప్రధాని మోదీ గురువారం ఉదయం ట్వీట్ చేశారు. -తక్కువ కార్బన్ విడుదల చేసే ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మార్చేందుకు జరుగుతున్న కృషిని ఆయన పుస్తకంలో వివరించారు. - ఈ పుస్తకాన్ని లెక్సిస్నెక్సిస్ సంస్థ ప్రచురించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా, జపాన్ వంటి దేశాల ప్రధాన నగరాల్లో పుస్తకం విడుదలైంది. -గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మోదీ 'కన్వినియెంట్ యాక్షన్: గుజరాత్ రెస్పాన్స్ టు చాలెంజ్స్ ఆఫ్ క్లైమెట్ ఛేంజ్' పుస్తకాన్ని రాశారు. -
భూతాపంపై యుద్ధం
భూతాపం పెరుగుతోంది.. ప్రకృతి ప్రకోపిస్తోందనే ప్రకటనలే తప్ప ఇన్నాళ్లూ ఈ దిశగా ప్రపంచ దేశాలు చేసిన ప్రయత్నం తక్కువే. దీంతో ఏడాదికేడాది వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయే తప్ప సానుకూల ఫలితాలు వస్తున్న దాఖలాలే కనిపించటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో యాభై ఏళ్లలో ప్రపంచ చిత్రపటమే మారిపోనుంది. ఈ నేపథ్యంలో.. మారుతున్న వాతావరణ పరిస్థితులపై సమరశంఖం పూరించేందుకు ప్రపంచం సిద్ధమైంది. నేటినుంచి పారిస్‌లో జరగనున్న కాప్-21 సదస్సులో భారీ నిర్ణయాలు తీసుకునేందుకు ఐక్యరాజ్యసమితి ఏర్పాట్లు చేసింది. ఇకపై ప్రపంచదేశాలు వేసే ప్రతి అడుగూ పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకునే వేసేలా పలు ఒప్పందాలకు రూపకల్పన జరగనుంది. ఈ పారిస్ సదస్సు ప్రత్యేకతలు, లక్ష్యాలు, భారత్ పాత్ర వంటి అంశాలను ఓసారి గమనిస్తే.. * పర్యావరణ మార్పుపై పారాహుషార్! * నేటి నుంచి పారిస్‌లో కాప్-21 కాప్ - 21 అంటే? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ను క్లుప్తంగా కాప్ అని పిలుస్తారు. ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్నది 21వ సదస్సు. దాదాపు 190 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో (ఒక్కో దేశం ఒక్కో పార్టీ అన్నమాట) భూతాపోన్నతి ప్రభావంతో వాతావరణ మార్పుల రూపంలో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని నివారించే చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో ఓ ఒప్పందం జరగనుంది. నవంబరు 30వ తేదీ నుంచి డిసెంబరు 11వ తేదీ వరకూ ఈ సదస్సు జరగనుంది. ఎందుకు ఇంత ప్రాముఖ్యత? ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అకాల వర్షాలు, వరదలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులోనూ.. ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్లకోసారి కాప్ సదస్సు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ జరిగిన సదస్సులు ఒక ఎత్తై.. ఫ్రాన్స్‌లో జరగనున్న ఈసారి కాప్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ సదస్సులో 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీల కంటే ఎక్కువగా పెరగకుండా ఉండేం దుకు ఏం చేయాలనే దానిపై 190 దేశాల ప్రతినిధుల మధ్య కీలకమైన ఒప్పందం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న ఈ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత కూడా చాలా ప్రమాదకరమే. చాలా దేశాలు, పెద్ద దేశాల్లోనూ తీర ప్రాంతాల్లోని కీలక పట్టణాలు కనుమరుగయ్యేందుకు ఇది కారణం కానుంది. ఇది తమను తీవ్రంగా నష్టపరుస్తుందని, దేశాలకు దేశాలు సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందని కొన్ని చిన్న ద్వీప దేశాల అధినేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఏ లక్ష్యానికి కట్టుబడతాయి? అగ్రరాజ్యాలు కొత్త ఒప్పందం సక్రమంగా అమలయ్యేందుకు ఎంతమేరకు ఆర్థిక సహకారం అందిస్తాయన్నది ఈ సదస్సులో కీలకం కానుంది. సదస్సు సాధించేదేమిటి? అంతర్జాతీయంగా అన్ని దేశాలు చట్టపరంగా కట్టుబడే ఒప్పందాన్ని రూపొందించాలన్నది ఈ సదస్సు లక్ష్యం. గత కాప్ సదస్సులతో పోలిస్తే ఈ సదస్సు మరింత అర్థవంతంగా జరుగుతుందనేందుకు ఈ లక్ష్యం ఒక ఉదాహరణ. అన్ని దేశాల మధ్య ఇలాంటి ఓ భారీ ఒప్పందం జరిగే విధంగానే ఐక్యరాజ్యసమితి ఏర్పాట్లు చేసింది. తొలిరోజు నుంచి దేశాధినేతలందరూ సదస్సుకు హాజరయ్యేలా చేయడం ఇందులో భాగమే. మన పరిస్థితి ఏమిటి? పారిస్ సదస్సులో మరో ముఖ్య భాగం ‘ఇన్టెండెడ్ నేషనల్లీ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్స్’ (ఐఎన్డీసీ). అంశం. సదస్సులో పాల్గొనే దేశాలు తమతమ స్థాయిలో కర్బన ఉద్గారాలను ఎంత శాతం మేరకు తగ్గించుకుంటాయన్నది ఐఎన్డీసీ ద్వారా వెల్లడవుతుంది. భారత్ గత నెల మొదటి వారంలో ఐక్యరాజ్యసమితికి తన ఐఎన్డీసీ లక్ష్యాల పూర్తి వివరాలను సమర్పించింది. వాటి ప్రకారం 2030 నాటికల్లా కర్బన ఉద్గారాలను 33 నుంచి 35 శాతం వరకూ తగ్గించుకుంటామని భారత్ తెలిపింది. ఇది 2005 సంవత్సర నాటి స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా నిర్ణయమవుతుంది. ఈ క్రమంలో 2030 నాటికి దేశంలోని మొత్తం విద్యుదుత్పత్తిలో 40 శాతం సౌర, పవన వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా జరిగేలా చూస్తామంటూ ఐరాసకు హామీ ఇచ్చింది. -
'వాతావరణం'మారేనా?
మానవాళికిది జీవన్మరణ సమస్య. మానవ నాగరికతకు అస్తిత్వ సమస్య. పారిస్‌లో నేడు ప్రారంభం కానున్న వాతావరణ మార్పుల సదస్సు, పరిష్కారాన్ని చూపాల్సిన అంతర్జాతీయ వేదిక. దాదాపు ప్రపంచ దేశాలన్నీ హాజరవుతున్న ఆ సదస్సు అలాంటి భరోసాను ఇవ్వాలని ప్రపంచ ప్రజల ఆకాంక్ష. రెండు దశాబ్దాలుగా వాతావరణ మార్పులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతున్నా, శాస్త్ర వేత్తలంతా కోరుతున్నట్టు ఈ శతాబ్ది చివరికి భూమి సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల పారిశ్రామికీకరణ పూర్వ దశ కంటే 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు మించి పెరగదనే హామీ ఎండమావిగానే ఉంటోంది. ఆ పరిమితిని దాటితే తిరిగి మరల్చరాని విపత్కర వాతావరణ మార్పులు తప్పవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2015 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించే ఒప్పందాన్ని సాధించాలని ఐక్య రాజ్య సమితి వాతావరణ మార్పుల వేదిక (యూఎన్ఎఫ్సీసీ), తన 2011 దర్బన్ వార్షిక సమావేశంలో (కాప్-17) లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి పారిస్‌లో జరుగుతున్న 21వ వార్షిక సదస్సు(కాప్-21)లోనైనా ప్రపంచదేశాలన్నీ చట్టపరంగా కట్టుబడి ఉండాల్సిన ఉద్గారాల కోతలకు, భూతాపం పెరుగుదల వల్ల కలుగుతున్న వాతావరణ మార్పుల దుష్ర్పభావాలను ఉపశమింపజేసే చర్యలకు అంగీకరిస్తాయని అంతా ఆశిస్తున్నారు. అయితే రెండు దశాబ్దాలుగా వాదోపవాదాలే తప్ప కర్బన ఉద్గారాల విడుదల, అందుకు ప్రధాన కారణమైన బొగ్గు, చమురు, సహజ వాయువుల వంటి కర్బన ఇంధనాల వాడకం పెరుగుతూనే ఉన్నాయి. ప్రత్యామ్నాయ, శాశ్వత ఇంధన వనరుల అభివృద్ధి, ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి లేదు. పర్యవసానంగా భూతాపం పెరుగుతూనే ఉంది. ప్రపంచం అనూహ్యమైన వాతావరణ మార్పులను చవిచూడాల్సి వస్తోంది. పారిస్ సదస్సుకు హెచ్చరికలాగా ఐరాస వాతావరణ సంస్థ, 2015 అత్యంత అధిక ఉష్ణోగ్రతను నమోదు చేసిన సంవత్సరం కావచ్చనే చేదు వార్తను వినిపిం చింది. ఈ వేసవిలో కనీవినీ ఎరుగని విధంగా 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండలను మన దేశం భరించాల్సివచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాది వేసవితో పోలిస్తే ఈ వేసవిలో రెట్టింపుకు పైగా ఎండలకు చనిపోయారు. వచ్చే ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని భావిస్తున్నారు. గత రెండేళ్లుగా దుర్భిక్షం, అకాల, అధిక వర్షాలతో తల్లడిల్లుతున్న దేశ ప్రజలు, ప్రత్యేకించి తెలుగు రైతాంగం వాతావరణ మార్పుల దుష్ర్పభావాలకు ప్రత్యక్ష సాక్షులు. ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న 350 కోట్ల పేదలే వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా నష్ట పోతున్నవారు. అంటే భారత్ వంటి వర్ధమాన దేశాలే ప్రధానంగా వాతావరణ మార్పుల పర్యవసానాలను మోయాల్సివస్తోంది. చేయని తప్పుకు శిక్షను అనుభ వించాల్సి వస్తోంది. 150 ఏళ్లుగా విచ్చలవిడిగా చౌకగా లభించే కర్బన ఇంధనాలను వాడి భూతాపం పెరుగుదలకు కారణమైనవి అభివృద్ధిచెందిన దేశాలే. అవే నేడు సమాన బాధ్యతా సూత్రాన్ని వల్లెవేస్తూ, తమ చారిత్రక బాధ్యతను దాటవేయాలని చూడటం విచిత్రం. 1992 ఐరాస ధరిత్రీ సదస్సు 'వాతావరణపరమైన క్షీణతకు వివిధ దేశాలు భిన్న స్థాయిల్లో కారణమైన రీత్యా వాటికి ఉమ్మడి లక్ష్యాలు, వేరు వేరు స్థాయిల బాధ్యతలు ఉంటాయి'అని సూత్రీకరించింది. ఆ చారిత్రక బాధ్యత నుంచి తప్పించుకోడానికే అమెరికా 1997 క్యోటో వాతావరణ మార్పుల ఒప్పం దానికి దూరంగా ఉంది. నేటికీ అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలది అదే వైఖరి. పారిస్ సదస్సుకు 'భారత్ ఒక సవాలు కానుంది' అంటూ అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పది రోజుల క్రితం చేసిన వ్యాఖ్య దాని కొనసాగింపే. చైనా, భారత్, బ్రెజిల్, దక్షిణాఫిక్రా, దక్షిణ కొరియా తదితర దేశాలను వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా వర్గీకరించారు. అవి కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పాటూ ఉద్గారాల కోతలకు, ఉపశమన చర్యల వ్యయాలను భరించడానికి అంగీకరించాలని అమెరికా చాలా కాలంగా వాదిస్తోంది. భారత్ వంటి వర్ధమాన దేశాలు కొత్తగా పారిశ్రామికీకరణను ప్రారంభించిన దేశాలు. చౌకగా లభించే కర్బన ఇంధనాలపై ఆధారపడటం వాటికి తప్పనిసరి. లేదా అవి ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారడానికి అయ్యే వ్యయాన్ని అభివృద్ధి చెందిన దేశాలే భరించాలి. ప్రధాని నరేంద్ర మోదీ 2022 నాటికి భారత శాశ్వత ఇంధన ఆధారిత విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 175 జిగా వాట్లకు పెంచుతామన్నారు. ఈ భారీ లక్ష్యం సాధ్యా సాధ్యాలపై ఉన్న విమర్శల సంగతి పక్కనపెడితే, అందుకు తగిన ఆర్థిక, సాంకేతిక వనరులను సమకూర్చుకోవడం ఎలా? అనే సమస్యకు మోదీ ప్రభుత్వం సమా దానం పారిస్ సదస్సుకు సంబంధించి కీలకమైనది. 'పాశ్చాత్య దేశాలు ప్రపం చానికి, భూమికి కలుగజేసిన నష్టానికి మూల్యాన్ని చెల్లించాల్సిందే' అని విద్యుత్, శాశ్వత ఇంధన వనరుల సహాయ మంత్రి పియూష్ గోయల్ ఈ ఏడాది మేలో లండన్‌లో వాతావరణ మార్పుల సమావేశంలో స్పష్టం చేశారు. తలసరి ఇంధనం లేదా విద్యుత్తు వినియోగం దృష్ట్యా చూసినా, తలసరి కర్బన ఉద్గారాల విడుదల దృష్ట్యా చూసినా అభివృద్ధిచెందిన దేశాలతో పోలిస్తే భారత్ వంటి దేశాలపైన వాతావరణ మార్పుల విషయంలో ఆంక్షలు, భారం మోపలేమనే వాస్తవాన్ని సంపన్న దేశాలు గుర్తించనంతవరకు వాతావరణ మార్పుల సమస్యకు పరిష్కారం దొరకదు. వర్ధమాన దేశాలలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభి వృద్ధికి ఆర్థిక, సాంకేతిక సహాయం చేయడంతోపాటూ అవి స్వయంగా కర్బన ఇంధనాల నుంచి హరిత ఇంధనాలకు మరలాల్సి ఉంటుంది. అప్పుడే వెనుకబడిన దేశాల అభివృద్ధికి వీలుగా మరింత కార్బన్ స్పేస్ వాటికి అందుబాటులోకి వస్తుంది. వర్ధమాన దేశాల న్యాయమైన ఈ డిమాండ్లేవీ సంపన్న దేశాలకు సమంజ సంగా కనబడటం లేదు. ఈ నేపథ్యంలో పారిస్ సదస్సులో భారత్ కీలక పాత్రధారి కానుంది. అమెరికాసహా సంపన్న దేశాలు తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తూ, వాతావరణాన్ని శుభ్రం చేసే భారాన్ని ఎక్కువగా మోసేలా ఒప్పించడానికి భారత్, వర్ధమానదేశాల జీ-77తోనూ, చైనాతోనూ కలిసి కృషి చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అభివృద్ధిచెందిన దేశాలు తమ సంకుచిత, స్వార్థపూరిత వైఖరిని విడనా డందే వాతావరణ మార్పుల విపత్తుకు సమర్థవంతమైన సమాధానం దొరకదు. సంపన్న దేశాలలో అలాంటి మార్పునకు పారిస్ నాంది కాగలదని ఆశిద్దాం.