వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్న దుష్పలితాలపైనా, ప్రత్యే కించి ఆహారభద్రతకు ముంచు కొస్తున్న ముప్పుపైనా ప్రపంచం దృష్టి సారించింది. వాతావరణ మార్పులపై గత ఏడాది పారిస్‌లో నవంబర్-డిసెంబర్ మాసాలలో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు ‘కాప్-21’ ‘వాతావరణ విధానపత్రాన్ని’ రూపొందించింది. అయితే సంపన్న దేశాలు, వాటి హామీలను నిలబెట్టు కోగలవా? సందేహమే. ఆర్థికాభివృద్ధి పేరుతో కాలుష్యాన్ని వెదజల్లుతున్న అమెరికా లాంటి సంపన్న దేశాలు... అభివృద్ధి చెందుతున్న దేశాలను దోషులుగా చూపుతున్నాయి. ఈనేపథ్యంలో భారతదేశం తాను ఎదుర్కొంటున్న వాతావరణ సమస్యలను, ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను సొంతంగా పరిష్కరించుకోడానికి పూనుకోవాలి.
పెరిగిపోతున్న భూతాపం, వ్యవసాయ రంగానికి ప్రధాన శత్రువు. ప్రత్యక్షంగా అవి రైతులపైనే తీవ్ర ప్రభావం చూపుతాయి. నైసర్గికంగా మన దేశానికి ఉత్తరాదిన హిమాలయ మంచు పర్వత శ్రేణులు, దక్షిణా దిన మూడు వైపులా మహా సముద్రాలు, ఆగ్నేయ ప్రాంతంలో విశా లమైన థార్ ఎడారి, మధ్య ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి. దీంతో అసాధారణ వాతావరణ వైవిధ్యం నెలకొని ఉంది. పైగా భౌగోళికంగా కర్కాటక, మకర రేఖల మధ్య ఉన్న అనేక వర్ధమాన వ్యవసాయక దేశాలలో మన దేశం ఒకటి. ఈ కారణంగానే దేశాన్ని 7 వాతావరణ జోన్లుగా వర్గీకరించారు. ఆయా జోన్లలో రుతుపవనాల గమనం ఆధారంగా వ్యవసాయం అనాదిగా సాగుతోంది. గత కొన్నేళ్లుగా దేశ వ్యవసాయ రంగానికి ఊహించని ఉత్పాతాలు ఎదురయ్యాయి. ఇవి వాతావరణంలో తరచూ చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల సంభవించుతున్నవే! ప్రధానంగా పెట్రోల్, డీజిల్, నత్రజని ఎరువులు తదితర కర్బన, రసాయనాల వినియోగం వల్ల భూవాతావరణం లోని ‘గ్రీన్‌హౌస్’ వాయువులు పెరిగిపోతున్నాయి. వాటిని నియంత్రించకుండా, ప్రస్తుత స్థాయిలోనే పెరగనిస్తే రాబోయే 100 ఏళ్లలో భూమి ఉష్ణోగ్రత ప్రస్తుత 1.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 4.5 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుందని అంచనా. ఇది జీవరాశి ఉనికికే ముప్పు. 2015 జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా భూ, సముద్ర ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో అధికంగా నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దేశాల్లో మన దేశం 5వ స్థానానికి చేరింది.
పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు వ్యవసాయ ఉత్పత్తుల్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఒక డిగ్రీ సెల్సియస్ మేర భూతాపం పెరిగితే, ఆ ప్రాంతంలో ధాన్యం ఉత్పత్తి 20% పడిపోతుంది. వరి వెన్ను పుష్పించే సమయంలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటితే అది పనికి రాకుండా పోతుంది. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉన్న మనదేశంలో వాతావరణ మార్పుల వల్ల రాబోయే దశాబ్ద కాలంలో వ్యవసాయ దిగుబడులు రమారమి 30% క్షీణిస్తాయి. వాతావరణ మార్పుల వల్ల అనేక రాష్ట్రాల్లో వరి, గోధుమ దిగుబడులు గణనీయంగా తగ్గాయని, దేశ ఆహార భద్రతపై కూడా అవి తీవ్ర ప్రభావం చూపగలవని కేంద్ర వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. పర్యావరణ మార్పుల కారణంగానే 2016లో ప్రపంచంలో అదనంగా కోటి మంది పేదలు ఆకలి, దుర్భిక్షాల బారిన పడబోతున్నారని అంచనా.
కాలుష్యాన్ని నిరోధించడం, తగ్గించడం, వడబోయడం, పునరుత్పాదక ఇంధనాలను వాడటం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతామని అన్ని దేశాలూ హామీలు ఇచ్చాయి. రాబోయే 15 ఏళ్లలో కర్బన ఉద్గారాలను 30% నుంచి 35% మేరకు తగ్గించుకుంటామని ప్రకటించాయి. ప్రధాని మోదీ సౌరశక్తిని భారీగా వినియోగంలోకి తేవడం కోసం అంతర్జాతీయ సౌరశక్తి కూటమి ఏర్పాటుకు అంకు రార్పణ చేశారు. డీజిల్ పంపుసెట్లకు బదులుగా సౌరశక్తితో నడిచే పంపు సెట్లను సమకూర్చే ప్రక్రియను ప్రారంభించారు. అయితే, దేశీయ వ్యవసాయరంగానికి తక్షణమే ముంచుకొస్తున్న పెను ప్రమాదాల నివారణకు అవి ఏ మేరకు పరిష్కారం చూపుతాయన్నదే ప్రధాన సమస్య.
దేశంలో వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్న ఉత్పాతాలు ఆందోళనకరంగా పరిణమించాయి. మూడేళ్ల క్రితం నాటి ఉత్తరాఖండ్ విలయం నుంచి ఇటీవల తమిళ నాడులో చెన్నై సహా 3 జిల్లాల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో కురిసిన కుండపోత వర్షాల వరకు పెరుగుతున్న ముప్పును సూచించేవే. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరువు, అకాల వర్షాలు ఏకకాలంలో వ్యవసాయాన్ని దెబ్బతీశాయి. తెలంగాణలో తీవ్ర కరువు ఏర్పడింది. దాదాపు 20 రాష్ట్రాలు వరదలు, కరువు బారిన పడ్డాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. వేసిన పంటల్లో 70 శాతానికి మించి ఉత్పత్తి చేతికి అందని దుస్థితి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రబీ సాగు 50% మించదని అంచనా. పర్యావరణ మార్పుల వల్ల గత కొన్నేళ్లుగా రుతు క్రమమే తారుమారయింది. తొలకరి పడినా, తర్వాత సుదీర్ఘమైన వర్షాభావం ఏర్పడటం, ఆ వెను వెంటనే అకాల వర్షాలు పడటం గత కొన్నేళ్లుగా ఎదురవు తున్న విచిత్ర పరిస్థితి. ఎప్పుడు సాగు ప్రారంభించాలో, ఏ పంటలు వేయాలో అర్థం కాని అయోమయం. ఈ పరిస్థి తులకు అనుగుణంగా రైతులకు సరైన అవగాహన కల్పించ లేకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం.
వాతావరణ మార్పుల ఉత్పాతాల వల్ల రైతాంగానికి గతంలో కంటే ఎక్కువ నష్టం వాటిల్లుతున్నది. కానీ ప్రభుత్వం వారికి అండగా నిలవడం లేదు. పంట నష్ట పరిహారం, బీమా అందడం లేదు. దిక్కుతోచని రైతులు పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తక్షణం రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం.. ప్రభుత్వాల ఉదాసీన వైఖరికి చెంపపెట్టు.
చైనా, భారత్‌లు వ్యవసాయోత్పత్తుల్లో 70% మేర వృద్ధిని సాధించగలిగితే తప్ప, 2050 నాటికి తమ ప్రజల ఆకలిని తీర్చలేవని అంచనా. ఆ వృద్ధిని సాధించాలంటే వ్యవసాయ పరిశోధన రంగంలో కనీసం 3,000 కోట్ల డాలర్లు ఖర్చు చేయాలి. లేకపోతే ఆహార భద్రత ప్రశ్నార్థకమే. ఈ విషయంలో దక్షిణాసియాలోనే భారత్ వెనుకబడి ఉంది. ఇటీవలే కేంద్రం కళ్లు తెరిచి ఏటా 4% ఆహార ధాన్యాల వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకుంది. భారత్, చైనాలలో ఆహార కొరత ఏర్పడితే తమ ఎగుమతులను పెంచుకోవాలని అగ్రరాజ్యాలు ఆశపడుతున్నాయి. అవి మన వ్యవసాయాభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తాయనుకోలేం. మన రైతుకు రక్షణగా స్వీయ కార్యాచరణను రూపొందించుకొని, వ్యవసాయరంగ తక్షణ అవసరాలను తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్న వాస్తవాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి.
-డా॥వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు
సెల్ : 99890 24579
‘పారిస్’ భరోసాను ఇచ్చేనా?
Published Fri, Jan 29 2016 10:11 AM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM
Advertisement