environmental problems
-
ఎన్విరాన్మెంటల్ ఫోటోగ్రాఫర్లు.. ఈ ఏడాది విజేతలు వీళ్లే (ఫోటోలు) PHOTO CREDITS- EPOTY
-
ఎన్విరాన్మెంటల్ ఫోటోగ్రాఫర్లు.. ఈ ఏడాది విజేతలు వీళ్లే
పర్యావరణ కాలుష్యం. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటి. ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారిన పర్యావరణ కాలుష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడమే పర్యావరణ ఫోటోగ్రఫీ. పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యల్ని హైలైట్ చేయడమే కాకుండా, తమ కెమెరా పనితీరుతో పర్యావరణ సంరక్షణ గురించి అనుక్షణం గుర్తు చేస్తారు. అలా ఈ ఏడాది కూడా అంతర్జాతీయ పర్యావరణ ఫోటోగ్రాఫర్ ఆప్ ది ఇయర్ విజేతలను ప్రకటించారు. చార్టర్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ (CIWEM) ఆద్వర్యంలో గత 16 ఏళ్లుగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 159 దేశాల నుంచి ప్రతిభావంతులైన ఫోటోగ్రాఫర్లు ఇందులో పాల్గొన్నారు. వారిలో ఆరుగురిని విజేతలుగా ప్రకటించారు. వాళ్లు తీసిన ఫోటోలు ఏంటి అన్నది తెలియాలంటే ఫోటోగ్యాలరీని క్లిక్ చేయండి. (ఫోటోగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వనరుల పొదుపు..కాలుష్యం అదుపు.. సర్క్యులర్ ఎకానమీ! అంటే తెలుసా?
టవల్ మసి గుడ్డగా మారడం... వంటింట్లో వ్యర్థాలు మొక్కలకు పోషకాలుగా వినియోగించడం... అవసరం మేరకే విద్యుత్, నీరు, సామాన్లు వాడటం.. ఇలాంటి వాటికి మనం పెట్టుకునే పేరు.. పొదుపు. ఆ తరహా పనులే ప్రపంచం మొత్తం మీద అన్ని రంగాల్లో చేపడితే..? అదే.. సర్క్యులర్ ఎకానమీ! -కంచర్ల యాదగిరిరెడ్డి ప్రపంచం మొత్తం మీద ఏటా వినియోగిస్తున్న వస్తువులు 10,000 కోట్ల టన్నులు. ఇందులో ఒకసారి మాత్రమే వాడగలిగిన ప్లాస్టిక్, లోహాలు, కలప, కాంక్రీట్, రసాయనాలు ఏకంగా 92 శాతం. కాంక్రీట్‌ను పక్కనబెడితే మిగిలినవన్నీ చెత్తకుప్పల్లోకి చేరి మనల్ని ఇబ్బంది పెట్టేవి, ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసేవే. ఈ విపత్కర పరిస్థితికి తరుణోపాయం సర్క్యులర్ ఎకానమీ అని నిపుణులుఅంటున్నారు. భూమి మీద ముడి చమురు, ఫాస్పరస్ వంటి రసాయనాలు, సాగుభూమి, తాగునీరు ఇలా అన్నీ పరిమితమైనవే. కానీ మనం ఈ వనరులను వృధా చేస్తున్నాం. ఎంత వృ«థా అంటే.. అవసరానికి మించి 1.6 రెట్లు వాడేస్తున్నామని ప్రపంచ ఆర్థిక వేదిక స్పష్టం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు అన్నిరకాల ఇబ్బందులూ తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉన్న వనరులను జాగ్రత్తగా వాడుకునేందుకు సర్క్యులర్ ఎకానమీ దోహదపడుతుంది. వాడుకుని వదిలేయకుండా.. ఇప్పటివరకు మనం వస్తువులను తయారు చేసి వాడుకున్న తర్వాత వదిలేయడం అనే సూత్రాన్ని అనుసరిస్తున్నాం. ఇంగ్లిషులో దీనిని ‘లీనియర్ ఎకానమీ మోడల్’అని పిలుస్తారు. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని, కాలుష్యం పెరుగుతోందని, వనరుల దుర్వినియోగం జరుగుతోందని 1970 దశకంలోనే కొంతమంది ఆర్థిక వేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దానికి విరుగుడుగా సర్క్యులర్ ఎకనామీ మోడల్‌ను ప్రతిపాదించారు. ఎలన్ మెకార్థర్ ఫౌండేషన్ వంటివి ఈ ఆలోచనకు మరింత పదునుపెట్టి అన్ని రంగాల్లోనూ అమలు చేసేందుకు ప్రయత్ని స్తున్నాయి. కొత్త సర్క్యులర్ ఎకానమీ మోడల్‌ను అమలు చేస్తే కేవలం కాలుష్యం, పర్యావరణ సమస్యలకు పరిష్కారం లభించడం మాత్రమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వనరుల వినియోగం.. ఎక్కువ మన్నిక సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థలో వస్తువులను వీలైనంత తక్కువ వనరుల వినియోగంతో తయారు చేస్తారు. వ్యర్థాలను, కర్బన ఉద్గారాలను వీలైనంతగా తగ్గించడం అనేది వీటి రూపకల్పనలో ముఖ్యాంశం. పైగా ఏ వస్తువైనా వీలైనంత ఎక్కువ సమయం ఉపయోగపడేలా ఉంటుంది. కొత్త మోడల్ వచ్చి నప్పుడల్లా పాత స్మార్ట్ఫోన్లను పడేసినట్లు కాకుండా.. చెడిపోతే మరమ్మతు చేయడం, డిజైన్లను మార్చడం ద్వారా సదరు వస్తువు జీవితకాలం పెంచడం, పూర్తిగా పనికిరాకుండా పోయిన తర్వాత రీసైకిల్ చేయడం సర్క్యులర్ ఎకానమీలో భాగం. ఉదాహరణకు.. యూరప్ దేశాలు ఏటా సుమారు 250 టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిని మళ్లీ వాడుకునేలా చేయడం ద్వారా కొత్త వాటిని కొనుక్కునే అవసరాన్ని తప్పిస్తారన్నమాట. ఇలా చేయడం వల్ల బోలెడు డబ్బు ఆదా అవుతుంది. అలాగే అవి తిరిగి పనిచేసేలా తయారు చేసేందుకు, మరమ్మతులు చేసేందుకు మానవ వనరులు అవసరమవుతాయి. అంటే కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయన్నమాట. ఇది ప్రపంచ వ్యాప్తంగా అమల్లోకి వస్తే 2030 నాటికి సర్క్యులర్ ఎకానమీ విలువ దాదాపు 4.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకోరకంగా చెప్పాలంటే 4.5 లక్షల కోట్ల డాలర్ల మొత్తాన్ని ఆదా చేయవచ్చని వారు చెబుతున్నారు. వ్యవస్థ మొత్తం మారితేనే.. ఇందుకోసం వ్యవస్థ మొత్తం మారాలి. వినియోగదారులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు అందరూ తమవంతు పాత్ర పోషించాలి. సులువుగా రీసైకిల్ చేయగలిగేలా, విడదీసేలా వస్తువులను డిజైన్ చేయడం ఒక పద్ధతి. దీనివల్ల తయారీకి ముడిసరుకులు తక్కువగా అవసరమవుతాయి. ఫెయిర్ ఫోన్ అనే స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను తయారు చేసింది. పాడైపోయిన భాగాలను తీసేసి కొత్తవి వేసుకోవడం ఈ స్మార్ట్‌ఫోన్‌లో సాధ్యమవుతుంది. కేవలం వాడుకున్నందుకే డబ్బులు..! కొత్తరకం బిజినెస్ మోడల్ ద్వారా కూడా సర్క్యులర్ ఎకానమీ అమలు చేసేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ల్యాప్‌టాప్, మోటార్‌సైకిల్, ఏసీ, ఫ్రిజ్ వంటి వాటిని కొనడం కాకుండా.. కేవలం వాడుకునేందుకు మాత్రమే కంపెనీలకు డబ్బులు చెల్లించడం ఈ కొత్తరకం బిజినెస్ మోడల్‌కు ఒక ఉదాహరణ. ఈ మోడల్లో ఆయా వస్తువుల జీవితకాలం ముగిసిన తర్వాత సదరు కంపెనీ వెనక్కి తీసుకుంటుంది. వాటిల్లోని పరికరాలను రీసైకిల్ చేస్తుంది. ఉపయోగపడే వస్తువులన్నింటినీ మళ్లీ మళ్లీ వాడుతుంది. వాడి పారేసే ప్లాస్టిక్ వాడకాన్ని 2040 నాటికల్లా దశలవారీగా తగ్గించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే పునర్వినియోగాన్ని, రీసైక్లింగ్‌నూ ప్రోత్సహించడం ద్వారా ఈ రంగంలో సర్క్యులర్ ఎకానమీని అమల్లోకి తెచ్చింది. వ్యర్థాల మోతాదు తగ్గాలి ఈ ఏడాది ఫ్రిబవరిలో ప్రపంచవ్యాప్తంగా సర్క్యులర్ ఎకానమీ అమలుపై ఒక నివేదిక వెలువడింది. ‘ద సర్క్యులేటరీ గ్యాప్ రిపోర్ట్’గా పిలిచే ఈ నివేదిక ప్రకారం.. 1970తో పోలిస్తే మన వస్తు వినియోగం మూడు రెట్లు అంటే ఏడాదికి 10,000 కోట్ల టన్నులకు పెరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో సర్క్యులర్ ఎకానమీని కనుక అమలు చేయగలిగితే ఇందులో మూడొంతుల మేరకు వస్తు వినియోగాన్ని తగ్గించవచ్చు. సర్క్యులర్ ఎకానమీ అమల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం మరింత పెరగాలని, అన్ని రకాల పరిశ్రమల్లో వ్యర్థాల మోతాదును తగ్గించేందుకు ప్రయత్నాలు జర గాలని నివేదిక సూచించింది. నియోమ్‌లో వ్యర్థాలన్నీ రీసైకిల్ సౌదీ అరేబియా కడుతున్న సరికొత్త నగరం ‘నియోమ్’లో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే అత్యాధునిక డీశాలినేషన్ ప్లాంట్లను ఉపయోగించనున్నారు. ఆ దేశంలో ఇది కొత్త కాదు కానీ.. నియోమ్‌లోని ప్లాంట్ల వ్యర్థాల నుంచి విలువైన రసాయనాలను వెలికితీసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. బ్యాటరీల్లో వాడే లిథియంతో పాటు పొటా షియం, సోడియం వంటి అనేక లవణాలు, ఖనిజాలు సమ్రుదపు నీటిలో ఉంటాయన్నది తెలిసిన విషయమే. నియోమ్ ప్లాంట్ల వ్యర్థాల నుంచి జిప్సమ్‌ను వేరు చేసి దాన్ని సిమెంట్ తయారీలో వాడాలన్న ఆలోచన సాగుతోంది. కాగా నియోమ్‌లో వ్యర్థాలన్నింటినీ పూర్తిగా రీసైకిల్ చేయనున్నారు. ఘన వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా ఎరువులు, మురుగునీటి లోంచి నైట్రోజన్, ఫాస్పరస్ (సబ్బులు, డిటర్జెంట్ల వాడకంతో కలుస్తుంటాయి) వంటి వనరులను వెలికితీయనున్నారు. వాడేసిన వంట నూనెలతో వాహనాల పరుగు ఇంగ్లండ్‌లోని బౌర్న్మౌత్ ప్రాంతంలో చెత్తను సేకరించే వాహనాలన్నీ వాడేసిన వంటనూనెలతో నడుస్తున్నాయి. ఈ నూనెలను రీసైకిల్ చేసి తయారు చేసిన హైడ్రోట్రీటెడ్ వెజిటబుల్ ఆయిల్ (హెచ్‌వీఓ)ను ఉపయోగిస్తున్నారు. ఆమ్స్టర్డ్యామ్లో మెక్‌డొనాల్డ్స్ కేంద్రాల్లో వాడేసిన నూనెలను రీసైకిల్ చేసి చెత్త సేకరించే వాహనాలకు, స్విగ్గీ, జొమాటో వంటి ఆహారం సరఫరా చేసే కంపెనీలకు అందిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యేక రసాయనాల ద్వారా విడగొట్టి ఆ ద్రావణాన్ని కొత్త ప్లాస్టిక్ తయారీకి వాడేలా సింగపూర్ ఇటీవలే ప్రయత్నాలు మొదలుపెట్టింది. -
‘పారిస్’ భరోసాను ఇచ్చేనా?
వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్న దుష్పలితాలపైనా, ప్రత్యే కించి ఆహారభద్రతకు ముంచు కొస్తున్న ముప్పుపైనా ప్రపంచం దృష్టి సారించింది. వాతావరణ మార్పులపై గత ఏడాది పారిస్‌లో నవంబర్-డిసెంబర్ మాసాలలో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు ‘కాప్-21’ ‘వాతావరణ విధానపత్రాన్ని’ రూపొందించింది. అయితే సంపన్న దేశాలు, వాటి హామీలను నిలబెట్టు కోగలవా? సందేహమే. ఆర్థికాభివృద్ధి పేరుతో కాలుష్యాన్ని వెదజల్లుతున్న అమెరికా లాంటి సంపన్న దేశాలు... అభివృద్ధి చెందుతున్న దేశాలను దోషులుగా చూపుతున్నాయి. ఈనేపథ్యంలో భారతదేశం తాను ఎదుర్కొంటున్న వాతావరణ సమస్యలను, ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను సొంతంగా పరిష్కరించుకోడానికి పూనుకోవాలి. పెరిగిపోతున్న భూతాపం, వ్యవసాయ రంగానికి ప్రధాన శత్రువు. ప్రత్యక్షంగా అవి రైతులపైనే తీవ్ర ప్రభావం చూపుతాయి. నైసర్గికంగా మన దేశానికి ఉత్తరాదిన హిమాలయ మంచు పర్వత శ్రేణులు, దక్షిణా దిన మూడు వైపులా మహా సముద్రాలు, ఆగ్నేయ ప్రాంతంలో విశా లమైన థార్ ఎడారి, మధ్య ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి. దీంతో అసాధారణ వాతావరణ వైవిధ్యం నెలకొని ఉంది. పైగా భౌగోళికంగా కర్కాటక, మకర రేఖల మధ్య ఉన్న అనేక వర్ధమాన వ్యవసాయక దేశాలలో మన దేశం ఒకటి. ఈ కారణంగానే దేశాన్ని 7 వాతావరణ జోన్లుగా వర్గీకరించారు. ఆయా జోన్లలో రుతుపవనాల గమనం ఆధారంగా వ్యవసాయం అనాదిగా సాగుతోంది. గత కొన్నేళ్లుగా దేశ వ్యవసాయ రంగానికి ఊహించని ఉత్పాతాలు ఎదురయ్యాయి. ఇవి వాతావరణంలో తరచూ చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల సంభవించుతున్నవే! ప్రధానంగా పెట్రోల్, డీజిల్, నత్రజని ఎరువులు తదితర కర్బన, రసాయనాల వినియోగం వల్ల భూవాతావరణం లోని ‘గ్రీన్హౌస్’ వాయువులు పెరిగిపోతున్నాయి. వాటిని నియంత్రించకుండా, ప్రస్తుత స్థాయిలోనే పెరగనిస్తే రాబోయే 100 ఏళ్లలో భూమి ఉష్ణోగ్రత ప్రస్తుత 1.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 4.5 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుందని అంచనా. ఇది జీవరాశి ఉనికికే ముప్పు. 2015 జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా భూ, సముద్ర ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో అధికంగా నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దేశాల్లో మన దేశం 5వ స్థానానికి చేరింది. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు వ్యవసాయ ఉత్పత్తుల్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఒక డిగ్రీ సెల్సియస్ మేర భూతాపం పెరిగితే, ఆ ప్రాంతంలో ధాన్యం ఉత్పత్తి 20% పడిపోతుంది. వరి వెన్ను పుష్పించే సమయంలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటితే అది పనికి రాకుండా పోతుంది. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉన్న మనదేశంలో వాతావరణ మార్పుల వల్ల రాబోయే దశాబ్ద కాలంలో వ్యవసాయ దిగుబడులు రమారమి 30% క్షీణిస్తాయి. వాతావరణ మార్పుల వల్ల అనేక రాష్ట్రాల్లో వరి, గోధుమ దిగుబడులు గణనీయంగా తగ్గాయని, దేశ ఆహార భద్రతపై కూడా అవి తీవ్ర ప్రభావం చూపగలవని కేంద్ర వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. పర్యావరణ మార్పుల కారణంగానే 2016లో ప్రపంచంలో అదనంగా కోటి మంది పేదలు ఆకలి, దుర్భిక్షాల బారిన పడబోతున్నారని అంచనా. కాలుష్యాన్ని నిరోధించడం, తగ్గించడం, వడబోయడం, పునరుత్పాదక ఇంధనాలను వాడటం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతామని అన్ని దేశాలూ హామీలు ఇచ్చాయి. రాబోయే 15 ఏళ్లలో కర్బన ఉద్గారాలను 30% నుంచి 35% మేరకు తగ్గించుకుంటామని ప్రకటించాయి. ప్రధాని మోదీ సౌరశక్తిని భారీగా వినియోగంలోకి తేవడం కోసం అంతర్జాతీయ సౌరశక్తి కూటమి ఏర్పాటుకు అంకు రార్పణ చేశారు. డీజిల్ పంపుసెట్లకు బదులుగా సౌరశక్తితో నడిచే పంపు సెట్లను సమకూర్చే ప్రక్రియను ప్రారంభించారు. అయితే, దేశీయ వ్యవసాయరంగానికి తక్షణమే ముంచుకొస్తున్న పెను ప్రమాదాల నివారణకు అవి ఏ మేరకు పరిష్కారం చూపుతాయన్నదే ప్రధాన సమస్య. దేశంలో వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్న ఉత్పాతాలు ఆందోళనకరంగా పరిణమించాయి. మూడేళ్ల క్రితం నాటి ఉత్తరాఖండ్ విలయం నుంచి ఇటీవల తమిళ నాడులో చెన్నై సహా 3 జిల్లాల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో కురిసిన కుండపోత వర్షాల వరకు పెరుగుతున్న ముప్పును సూచించేవే. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరువు, అకాల వర్షాలు ఏకకాలంలో వ్యవసాయాన్ని దెబ్బతీశాయి. తెలంగాణలో తీవ్ర కరువు ఏర్పడింది. దాదాపు 20 రాష్ట్రాలు వరదలు, కరువు బారిన పడ్డాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. వేసిన పంటల్లో 70 శాతానికి మించి ఉత్పత్తి చేతికి అందని దుస్థితి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రబీ సాగు 50% మించదని అంచనా. పర్యావరణ మార్పుల వల్ల గత కొన్నేళ్లుగా రుతు క్రమమే తారుమారయింది. తొలకరి పడినా, తర్వాత సుదీర్ఘమైన వర్షాభావం ఏర్పడటం, ఆ వెను వెంటనే అకాల వర్షాలు పడటం గత కొన్నేళ్లుగా ఎదురవు తున్న విచిత్ర పరిస్థితి. ఎప్పుడు సాగు ప్రారంభించాలో, ఏ పంటలు వేయాలో అర్థం కాని అయోమయం. ఈ పరిస్థి తులకు అనుగుణంగా రైతులకు సరైన అవగాహన కల్పించ లేకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం. వాతావరణ మార్పుల ఉత్పాతాల వల్ల రైతాంగానికి గతంలో కంటే ఎక్కువ నష్టం వాటిల్లుతున్నది. కానీ ప్రభుత్వం వారికి అండగా నిలవడం లేదు. పంట నష్ట పరిహారం, బీమా అందడం లేదు. దిక్కుతోచని రైతులు పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తక్షణం రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం.. ప్రభుత్వాల ఉదాసీన వైఖరికి చెంపపెట్టు. చైనా, భారత్‌లు వ్యవసాయోత్పత్తుల్లో 70% మేర వృద్ధిని సాధించగలిగితే తప్ప, 2050 నాటికి తమ ప్రజల ఆకలిని తీర్చలేవని అంచనా. ఆ వృద్ధిని సాధించాలంటే వ్యవసాయ పరిశోధన రంగంలో కనీసం 3,000 కోట్ల డాలర్లు ఖర్చు చేయాలి. లేకపోతే ఆహార భద్రత ప్రశ్నార్థకమే. ఈ విషయంలో దక్షిణాసియాలోనే భారత్ వెనుకబడి ఉంది. ఇటీవలే కేంద్రం కళ్లు తెరిచి ఏటా 4% ఆహార ధాన్యాల వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకుంది. భారత్, చైనాలలో ఆహార కొరత ఏర్పడితే తమ ఎగుమతులను పెంచుకోవాలని అగ్రరాజ్యాలు ఆశపడుతున్నాయి. అవి మన వ్యవసాయాభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తాయనుకోలేం. మన రైతుకు రక్షణగా స్వీయ కార్యాచరణను రూపొందించుకొని, వ్యవసాయరంగ తక్షణ అవసరాలను తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్న వాస్తవాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి. -డా॥వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు సెల్ : 99890 24579