టవల్ మసి గుడ్డగా మారడం... వంటింట్లో వ్యర్థాలు మొక్కలకు పోషకాలుగా వినియోగించడం... అవసరం మేరకే విద్యుత్, నీరు, సామాన్లు వాడటం.. ఇలాంటి వాటికి మనం పెట్టుకునే పేరు.. పొదుపు. ఆ తరహా పనులే ప్రపంచం మొత్తం మీద అన్ని రంగాల్లో చేపడితే..? అదే.. సర్క్యులర్ ఎకానమీ!
-కంచర్ల యాదగిరిరెడ్డి
ప్రపంచం మొత్తం మీద ఏటా వినియోగిస్తున్న వస్తువులు 10,000 కోట్ల టన్నులు. ఇందులో ఒకసారి మాత్రమే వాడగలిగిన ప్లాస్టిక్, లోహాలు, కలప, కాంక్రీట్, రసాయనాలు ఏకంగా 92 శాతం. కాంక్రీట్‌ను పక్కనబెడితే మిగిలినవన్నీ చెత్తకుప్పల్లోకి చేరి మనల్ని ఇబ్బంది పెట్టేవి, ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసేవే. ఈ విపత్కర పరిస్థితికి తరుణోపాయం సర్క్యులర్ ఎకానమీ అని నిపుణులుఅంటున్నారు.
భూమి మీద ముడి చమురు, ఫాస్పరస్ వంటి రసాయనాలు, సాగుభూమి, తాగునీరు ఇలా అన్నీ పరిమితమైనవే. కానీ మనం ఈ వనరులను వృధా చేస్తున్నాం. ఎంత వృ«థా అంటే.. అవసరానికి మించి 1.6 రెట్లు వాడేస్తున్నామని ప్రపంచ ఆర్థిక వేదిక స్పష్టం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు అన్నిరకాల ఇబ్బందులూ తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉన్న వనరులను జాగ్రత్తగా వాడుకునేందుకు సర్క్యులర్ ఎకానమీ దోహదపడుతుంది.
వాడుకుని వదిలేయకుండా..
ఇప్పటివరకు మనం వస్తువులను తయారు చేసి వాడుకున్న తర్వాత వదిలేయడం అనే సూత్రాన్ని అనుసరిస్తున్నాం. ఇంగ్లిషులో దీనిని ‘లీనియర్ ఎకానమీ మోడల్’అని పిలుస్తారు. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని, కాలుష్యం పెరుగుతోందని, వనరుల దుర్వినియోగం జరుగుతోందని 1970 దశకంలోనే కొంతమంది ఆర్థిక వేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దానికి విరుగుడుగా సర్క్యులర్ ఎకనామీ మోడల్‌ను ప్రతిపాదించారు.
ఎలన్ మెకార్థర్ ఫౌండేషన్ వంటివి ఈ ఆలోచనకు మరింత పదునుపెట్టి అన్ని రంగాల్లోనూ అమలు చేసేందుకు ప్రయత్ని స్తున్నాయి. కొత్త సర్క్యులర్ ఎకానమీ మోడల్‌ను అమలు చేస్తే కేవలం కాలుష్యం, పర్యావరణ సమస్యలకు పరిష్కారం లభించడం మాత్రమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ వనరుల వినియోగం.. ఎక్కువ మన్నిక
సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థలో వస్తువులను వీలైనంత తక్కువ వనరుల వినియోగంతో తయారు చేస్తారు. వ్యర్థాలను, కర్బన ఉద్గారాలను వీలైనంతగా తగ్గించడం అనేది వీటి రూపకల్పనలో ముఖ్యాంశం. పైగా ఏ వస్తువైనా వీలైనంత ఎక్కువ సమయం ఉపయోగపడేలా ఉంటుంది. కొత్త మోడల్ వచ్చి నప్పుడల్లా పాత స్మార్ట్‌ఫోన్లను పడేసినట్లు కాకుండా.. చెడిపోతే మరమ్మతు చేయడం, డిజైన్లను మార్చడం ద్వారా సదరు వస్తువు జీవితకాలం పెంచడం, పూర్తిగా పనికిరాకుండా పోయిన తర్వాత రీసైకిల్ చేయడం సర్క్యులర్ ఎకానమీలో భాగం.
ఉదాహరణకు.. యూరప్ దేశాలు ఏటా సుమారు 250 టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిని మళ్లీ వాడుకునేలా చేయడం ద్వారా కొత్త వాటిని కొనుక్కునే అవసరాన్ని తప్పిస్తారన్నమాట. ఇలా చేయడం వల్ల బోలెడు డబ్బు ఆదా అవుతుంది. అలాగే అవి తిరిగి పనిచేసేలా తయారు చేసేందుకు, మరమ్మతులు చేసేందుకు మానవ వనరులు అవసరమవుతాయి. అంటే కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయన్నమాట. ఇది ప్రపంచ వ్యాప్తంగా అమల్లోకి వస్తే 2030 నాటికి సర్క్యులర్ ఎకానమీ విలువ దాదాపు 4.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకోరకంగా చెప్పాలంటే 4.5 లక్షల కోట్ల డాలర్ల మొత్తాన్ని ఆదా చేయవచ్చని వారు చెబుతున్నారు.
వ్యవస్థ మొత్తం మారితేనే..
ఇందుకోసం వ్యవస్థ మొత్తం మారాలి. వినియోగదారులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు అందరూ తమవంతు పాత్ర పోషించాలి. సులువుగా రీసైకిల్ చేయగలిగేలా, విడదీసేలా వస్తువులను డిజైన్ చేయడం ఒక పద్ధతి. దీనివల్ల తయారీకి ముడిసరుకులు తక్కువగా అవసరమవుతాయి. ఫెయిర్ ఫోన్ అనే స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను తయారు చేసింది. పాడైపోయిన భాగాలను తీసేసి కొత్తవి వేసుకోవడం ఈ స్మార్ట్‌ఫోన్‌లో సాధ్యమవుతుంది.
కేవలం వాడుకున్నందుకే డబ్బులు..!
కొత్తరకం బిజినెస్ మోడల్ ద్వారా కూడా సర్క్యులర్ ఎకానమీ అమలు చేసేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ల్యాప్‌టాప్, మోటార్‌సైకిల్, ఏసీ, ఫ్రిజ్ వంటి వాటిని కొనడం కాకుండా.. కేవలం వాడుకునేందుకు మాత్రమే కంపెనీలకు డబ్బులు చెల్లించడం ఈ కొత్తరకం బిజినెస్ మోడల్‌కు ఒక ఉదాహరణ.
ఈ మోడల్‌లో ఆయా వస్తువుల జీవితకాలం ముగిసిన తర్వాత సదరు కంపెనీ వెనక్కి తీసుకుంటుంది. వాటిల్లోని పరికరాలను రీసైకిల్ చేస్తుంది. ఉపయోగపడే వస్తువులన్నింటినీ మళ్లీ మళ్లీ వాడుతుంది. వాడి పారేసే ప్లాస్టిక్ వాడకాన్ని 2040 నాటికల్లా దశలవారీగా తగ్గించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే పునర్వినియోగాన్ని, రీసైక్లింగ్‌నూ ప్రోత్సహించడం ద్వారా ఈ రంగంలో సర్క్యులర్ ఎకానమీని అమల్లోకి తెచ్చింది.
వ్యర్థాల మోతాదు తగ్గాలి
ఈ ఏడాది ఫ్రిబవరిలో ప్రపంచవ్యాప్తంగా సర్క్యులర్ ఎకానమీ అమలుపై ఒక నివేదిక వెలువడింది. ‘ద సర్క్యులేటరీ గ్యాప్ రిపోర్ట్’గా పిలిచే ఈ నివేదిక ప్రకారం.. 1970తో పోలిస్తే మన వస్తు వినియోగం మూడు రెట్లు అంటే ఏడాదికి 10,000 కోట్ల టన్నులకు పెరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో సర్క్యులర్ ఎకానమీని కనుక అమలు చేయగలిగితే ఇందులో మూడొంతుల మేరకు వస్తు వినియోగాన్ని తగ్గించవచ్చు. సర్క్యులర్ ఎకానమీ అమల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం మరింత పెరగాలని, అన్ని రకాల పరిశ్రమల్లో వ్యర్థాల మోతాదును తగ్గించేందుకు ప్రయత్నాలు జర గాలని నివేదిక సూచించింది.
నియోమ్‌లో వ్యర్థాలన్నీ రీసైకిల్
సౌదీ అరేబియా కడుతున్న సరికొత్త నగరం ‘నియోమ్’లో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే అత్యాధునిక డీశాలినేషన్ ప్లాంట్లను ఉపయోగించనున్నారు. ఆ దేశంలో ఇది కొత్త కాదు కానీ.. నియోమ్‌లోని ప్లాంట్ల వ్యర్థాల నుంచి విలువైన రసాయనాలను వెలికితీసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. బ్యాటరీల్లో వాడే లిథియంతో పాటు పొటా షియం, సోడియం వంటి అనేక లవణాలు, ఖనిజాలు సమ్రుదపు నీటిలో ఉంటాయన్నది తెలిసిన విషయమే.
నియోమ్ ప్లాంట్ల వ్యర్థాల నుంచి జిప్సమ్‌ను వేరు చేసి దాన్ని సిమెంట్ తయారీలో వాడాలన్న ఆలోచన సాగుతోంది. కాగా నియోమ్‌లో వ్యర్థాలన్నింటినీ పూర్తిగా రీసైకిల్ చేయనున్నారు. ఘన వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా ఎరువులు, మురుగునీటి లోంచి నైట్రోజన్, ఫాస్పరస్ (సబ్బులు, డిటర్జెంట్ల వాడకంతో కలుస్తుంటాయి) వంటి వనరులను వెలికితీయనున్నారు.
వాడేసిన వంట నూనెలతో వాహనాల పరుగు
ఇంగ్లండ్‌లోని బౌర్న్‌మౌత్ ప్రాంతంలో చెత్తను సేకరించే వాహనాలన్నీ వాడేసిన వంటనూనెలతో నడుస్తున్నాయి. ఈ నూనెలను రీసైకిల్ చేసి తయారు చేసిన హైడ్రోట్రీటెడ్ వెజిటబుల్ ఆయిల్ (హెచ్‌వీఓ)ను ఉపయోగిస్తున్నారు. ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో మెక్‌డొనాల్డ్స్ కేంద్రాల్లో వాడేసిన నూనెలను రీసైకిల్ చేసి చెత్త సేకరించే వాహనాలకు, స్విగ్గీ, జొమాటో వంటి ఆహారం సరఫరా చేసే కంపెనీలకు అందిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యేక రసాయనాల ద్వారా విడగొట్టి ఆ ద్రావణాన్ని కొత్త ప్లాస్టిక్ తయారీకి వాడేలా సింగపూర్ ఇటీవలే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment