త్వరలో భారీ అగ్నిపర్వత విస్ఫోటం
ప్రపంచానికి పెను ఇక్కట్లే: సైంటిస్టులు
ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గులు
భారీగా పడిపోనున్న ఆహారోత్పత్తి
అమెరికాలో అతి పెద్దదైన కిలోవెయా అగ్నిపర్వతం సోమవారం బద్దలైంది. విస్ఫోటనం ధాటికి అగ్నిపర్వతం నుంచి ఏకంగా 80 మీటర్ల ఎత్తుకు పైగా లావా ఎగసిపడుతోంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అతి త్వరలో అంతకు మించి భారీ స్థాయిలో అగ్నిపర్వత విస్ఫోటం తప్పకపోవచ్చని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ‘‘అదెక్కడన్నది ఇప్పటికిప్పుడు స్పష్టం కావడం లేదు. కానీ ముప్పు పొంచి ఉందన్నది మాత్రం సుస్పష్టం’’అని చెబుతున్నారు.
దాని దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. పర్యావరణ సమస్యలు మొదలుకుని ఆహార కొరత దాకా మానవాళికి కొన్నేళ్ల పాటు అన్నివిధాలా కనీవినీ ఎరగని కష్టనష్టాలు తప్పకపోవచ్చంటున్నారు. ప్రపంచంలో ఏదో ఒక మూలన జరిగే అగ్నిపర్వత పేలుడు మొత్తం ప్రపంచాన్ని ఇంతగా ఎలా ప్రభావితం చేస్తుందంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ, వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా పచ్చి నిజమిది’’అని సైంటిస్టులు చెబుతున్నారు...!
అది 1815. ఇండోనేసియాలోని మౌంట్ తంబోరా అగ్నిపర్వతం ఉన్నట్టుండి బద్దలైంది. ఎంతలా అంటే, మానవాళి చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అతి భారీ విస్ఫోటంగా అది రికార్డుల్లో నిలిచిపోయింది. ఆ తీవ్రత ధాటికి భారీ పరిమాణంలో ఎగిసిపడ్డ దుమ్ము, ధూళి రేణువులు తదితరాలు వాతావరణంలో కిలోమీటర్ల ఎత్తున, అత్యంత విస్తారంగా పరుచుకుపోయాయి.
భూమిని చేరే సూర్యరశ్మిని అవి అడ్డుకున్నాయి. దాంతో ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు ఏకంగా ఒక డిగ్రీకి పైగా పడిపోయాయి. ఆ ఏడాది ఆ ప్రాంతంలో ఎక్కడా వేసవే లేకుండా పోయింది. ఫలితంగా వానలు ముఖం చాటేయడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిని దిగుబడి భారీగా తగ్గిపోయింది. దేశాలకు దేశాలే తిండికి అలమటించిపోయాయి. ఎటు చూసినా కరువు మరణాలే అన్నట్టుగా తయారైంది. వాతావరణ మార్పుల కారణంగా కలరా వంటి మహమ్మారులు విజృంభించి మరింత భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. ఇదంతా కేవలం ఒకే ఒక్క అగ్నిపర్వత విస్ఫోటం చేసిన నష్టం.
అందుకే, త్వరలోనే అలాంటి విస్ఫోటానికి ప్రకృతి రంగం సిద్ధం చేసుకుంటోందన్న జియాలజిస్టుల హెచ్చరికలు వణుకు పుట్టిస్తున్నాయి. అందుకు ఆరింట ఒక శాతం అవకాశమున్నట్టు జెనీవా యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త మార్కస్ స్టొఫెల్ అంచనా వేశారు. ‘‘ఈసారి జరగబోయే పర్యావరణ విధ్వంసం అంచనాకు కూడా అందనిది. పైగా ఈ విపత్తును ఎదుర్కోవడానికి మన దగ్గర ఎలాంటి ప్రణాళికా లేకపోవడం మరింత గుబులు పుట్టించే అంశం’’అంటూ వాపోయారు. అంతేకాదు, ‘‘1815తో పోల్చుకుంటే ఈసారి జరగబోయే నష్టం అంచనాలకు కూడా అందని స్థాయిలో ఉంటుంది’’అని అభిప్రాయపడ్డారు.
ఏం జరుగుతుంది?
అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భారీగా లావాను వెదజల్లుతాయన్నది తెలిసిందే. దాంతోపాటు అత్యంత భారీ పరిమాణంలో బూడిదతో పాటు పలు రకాల వాయువులు కూడా విడుదలవుతాయి. వాటిలో సల్ఫర్ డయాక్సైడ్ చేసే హాని అంతా ఇంతా కాదు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఏకంగా వాతావరణానికి మాతృ స్థానమైన ట్రోపోస్పియర్ దాకా చేరుతుంది. దాని దిగువన, అంటే భూమికి దాదాపు 7 మైళ్ల ఎత్తున ఉండే స్ట్రాటోస్పియర్‌లో భారీగా పరుచుకుని ఏరోసెల్ అణువుల పుట్టుకకు దారితీస్తుంది.
అవి సూర్యరశి్మని అడ్డుకుని దాన్ని భూమికి చేరకుండా అంతరిక్షంలోకే తిప్పి పంపుతాయి. ఫలితంగా భూమి చల్లబడుతుంది. ఈ అణువులు కనీసం రెండేళ్లపాటు వాతావరణంలో అలాగే ఉండిపోతాయి. 1991లో ఫిలిప్పీన్స్‌లో మౌంట్ పినాటుబో అగ్నిపర్వత పేలుడు వల్ల దాదాపు 1.5 కోట్ల టన్నుల సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలైందని అంచనా. దాని దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వాతావరణం 0.5 డిగ్రీ సెల్సియస్ మేరకు చల్లబడిపోయింది.
1815 తరహావి, అంతకు మించిన భారీ అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తే భూమి ఏకంగా 1.5 డిగ్రీల దాకా చల్లబడిపోయే ఆస్కారముంది. అదే జరిగితే ఈసారి నష్టతీవ్రత మరింత భారీగా ఉంటుందని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైకేల్ రాంపినో అన్నారు. ‘‘ప్రస్తుతం రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలే అందుకు కారణం. వేడి వాతావరణంలో ఏరోసెల్ అణువులు మరింత చిన్న పరిమాణంలో ఏర్పడతాయి. దానికి తోడు వాతావరణపు పై పొరల్లో శరవేగంగానూ, సుదూరాలకూ పయనిస్తాయి.
దాంతో సూర్యరశి్మని అవి మరింత ఎక్కువగా అడ్డుకుని భూ వాతావరణాన్ని గణనీయంగా చల్లబరుస్తాయి’’అని వివరించారు. గ్లోబల్ వారి్మంగ్‌తో సతమతమవుతున్న నేపథ్యంలో ఇది మంచిదే కదా అనిపించడం సహజం. కానీ ఇది మరీ విపత్కర పరిణామాలకు బాటలు వేస్తుందని రాంపినో హెచ్చరించారు. ‘‘క్రీస్తుపూర్వం 43లో అలస్కాలోని ఓక్మోక్ అగ్నిపర్వతం బద్దలైన కారణంగా దక్షిణ యూరప్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 7 డిగ్రీల సెల్సియస్ దాకా పడిపోయాయి.
ఆ దెబ్బకు ఆహారోత్పత్తి దాదాపుగా పడకేసింది. ఆ ప్రాంతాల్లోని దేశాలన్నీ నరకం చవిచూశాయి. నాటితో పోలిస్తే ఇప్పుడు జనాభా ఊహాతీతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 80 కోట్ల పైచిలుకు జనాభా చురుగ్గా ఉన్న అగ్నిపర్వతాలకు కేవలం 60 మైళ్ల దూరంలోనే విస్తరించి ఉంది’’ అని చెప్పారాయన. ‘‘కనుక చల్లని వాతావరణం ప్రపంచ ఆహారోత్పత్తిలో కీలకపాత్ర పోషించే భారత్‌తో పాటు అమెరికా, చైనా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దేశాలన్నీ ఆహార సంక్షోభంతో అల్లాడుతాయి’’అని ఆందోళన వెలిబుచ్చారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment