Kilauea volcano
-
తరుముకొస్తున్న ఉత్పాతం
అమెరికాలో అతి పెద్దదైన కిలోవెయా అగ్నిపర్వతం సోమవారం బద్దలైంది. విస్ఫోటనం ధాటికి అగ్నిపర్వతం నుంచి ఏకంగా 80 మీటర్ల ఎత్తుకు పైగా లావా ఎగసిపడుతోంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అతి త్వరలో అంతకు మించి భారీ స్థాయిలో అగ్నిపర్వత విస్ఫోటం తప్పకపోవచ్చని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ‘‘అదెక్కడన్నది ఇప్పటికిప్పుడు స్పష్టం కావడం లేదు. కానీ ముప్పు పొంచి ఉందన్నది మాత్రం సుస్పష్టం’’అని చెబుతున్నారు. దాని దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. పర్యావరణ సమస్యలు మొదలుకుని ఆహార కొరత దాకా మానవాళికి కొన్నేళ్ల పాటు అన్నివిధాలా కనీవినీ ఎరగని కష్టనష్టాలు తప్పకపోవచ్చంటున్నారు. ప్రపంచంలో ఏదో ఒక మూలన జరిగే అగ్నిపర్వత పేలుడు మొత్తం ప్రపంచాన్ని ఇంతగా ఎలా ప్రభావితం చేస్తుందంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ, వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా పచ్చి నిజమిది’’అని సైంటిస్టులు చెబుతున్నారు...! అది 1815. ఇండోనేసియాలోని మౌంట్ తంబోరా అగ్నిపర్వతం ఉన్నట్టుండి బద్దలైంది. ఎంతలా అంటే, మానవాళి చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అతి భారీ విస్ఫోటంగా అది రికార్డుల్లో నిలిచిపోయింది. ఆ తీవ్రత ధాటికి భారీ పరిమాణంలో ఎగిసిపడ్డ దుమ్ము, ధూళి రేణువులు తదితరాలు వాతావరణంలో కిలోమీటర్ల ఎత్తున, అత్యంత విస్తారంగా పరుచుకుపోయాయి. భూమిని చేరే సూర్యరశ్మిని అవి అడ్డుకున్నాయి. దాంతో ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు ఏకంగా ఒక డిగ్రీకి పైగా పడిపోయాయి. ఆ ఏడాది ఆ ప్రాంతంలో ఎక్కడా వేసవే లేకుండా పోయింది. ఫలితంగా వానలు ముఖం చాటేయడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిని దిగుబడి భారీగా తగ్గిపోయింది. దేశాలకు దేశాలే తిండికి అలమటించిపోయాయి. ఎటు చూసినా కరువు మరణాలే అన్నట్టుగా తయారైంది. వాతావరణ మార్పుల కారణంగా కలరా వంటి మహమ్మారులు విజృంభించి మరింత భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. ఇదంతా కేవలం ఒకే ఒక్క అగ్నిపర్వత విస్ఫోటం చేసిన నష్టం. అందుకే, త్వరలోనే అలాంటి విస్ఫోటానికి ప్రకృతి రంగం సిద్ధం చేసుకుంటోందన్న జియాలజిస్టుల హెచ్చరికలు వణుకు పుట్టిస్తున్నాయి. అందుకు ఆరింట ఒక శాతం అవకాశమున్నట్టు జెనీవా యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త మార్కస్ స్టొఫెల్ అంచనా వేశారు. ‘‘ఈసారి జరగబోయే పర్యావరణ విధ్వంసం అంచనాకు కూడా అందనిది. పైగా ఈ విపత్తును ఎదుర్కోవడానికి మన దగ్గర ఎలాంటి ప్రణాళికా లేకపోవడం మరింత గుబులు పుట్టించే అంశం’’అంటూ వాపోయారు. అంతేకాదు, ‘‘1815తో పోల్చుకుంటే ఈసారి జరగబోయే నష్టం అంచనాలకు కూడా అందని స్థాయిలో ఉంటుంది’’అని అభిప్రాయపడ్డారు. ఏం జరుగుతుంది? అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భారీగా లావాను వెదజల్లుతాయన్నది తెలిసిందే. దాంతోపాటు అత్యంత భారీ పరిమాణంలో బూడిదతో పాటు పలు రకాల వాయువులు కూడా విడుదలవుతాయి. వాటిలో సల్ఫర్ డయాక్సైడ్ చేసే హాని అంతా ఇంతా కాదు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఏకంగా వాతావరణానికి మాతృ స్థానమైన ట్రోపోస్పియర్ దాకా చేరుతుంది. దాని దిగువన, అంటే భూమికి దాదాపు 7 మైళ్ల ఎత్తున ఉండే స్ట్రాటోస్పియర్లో భారీగా పరుచుకుని ఏరోసెల్ అణువుల పుట్టుకకు దారితీస్తుంది. అవి సూర్యరశి్మని అడ్డుకుని దాన్ని భూమికి చేరకుండా అంతరిక్షంలోకే తిప్పి పంపుతాయి. ఫలితంగా భూమి చల్లబడుతుంది. ఈ అణువులు కనీసం రెండేళ్లపాటు వాతావరణంలో అలాగే ఉండిపోతాయి. 1991లో ఫిలిప్పీన్స్లో మౌంట్ పినాటుబో అగ్నిపర్వత పేలుడు వల్ల దాదాపు 1.5 కోట్ల టన్నుల సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలైందని అంచనా. దాని దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వాతావరణం 0.5 డిగ్రీ సెల్సియస్ మేరకు చల్లబడిపోయింది. 1815 తరహావి, అంతకు మించిన భారీ అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తే భూమి ఏకంగా 1.5 డిగ్రీల దాకా చల్లబడిపోయే ఆస్కారముంది. అదే జరిగితే ఈసారి నష్టతీవ్రత మరింత భారీగా ఉంటుందని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైకేల్ రాంపినో అన్నారు. ‘‘ప్రస్తుతం రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలే అందుకు కారణం. వేడి వాతావరణంలో ఏరోసెల్ అణువులు మరింత చిన్న పరిమాణంలో ఏర్పడతాయి. దానికి తోడు వాతావరణపు పై పొరల్లో శరవేగంగానూ, సుదూరాలకూ పయనిస్తాయి. దాంతో సూర్యరశి్మని అవి మరింత ఎక్కువగా అడ్డుకుని భూ వాతావరణాన్ని గణనీయంగా చల్లబరుస్తాయి’’అని వివరించారు. గ్లోబల్ వారి్మంగ్తో సతమతమవుతున్న నేపథ్యంలో ఇది మంచిదే కదా అనిపించడం సహజం. కానీ ఇది మరీ విపత్కర పరిణామాలకు బాటలు వేస్తుందని రాంపినో హెచ్చరించారు. ‘‘క్రీస్తుపూర్వం 43లో అలస్కాలోని ఓక్మోక్ అగ్నిపర్వతం బద్దలైన కారణంగా దక్షిణ యూరప్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 7 డిగ్రీల సెల్సియస్ దాకా పడిపోయాయి. ఆ దెబ్బకు ఆహారోత్పత్తి దాదాపుగా పడకేసింది. ఆ ప్రాంతాల్లోని దేశాలన్నీ నరకం చవిచూశాయి. నాటితో పోలిస్తే ఇప్పుడు జనాభా ఊహాతీతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 80 కోట్ల పైచిలుకు జనాభా చురుగ్గా ఉన్న అగ్నిపర్వతాలకు కేవలం 60 మైళ్ల దూరంలోనే విస్తరించి ఉంది’’ అని చెప్పారాయన. ‘‘కనుక చల్లని వాతావరణం ప్రపంచ ఆహారోత్పత్తిలో కీలకపాత్ర పోషించే భారత్తో పాటు అమెరికా, చైనా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దేశాలన్నీ ఆహార సంక్షోభంతో అల్లాడుతాయి’’అని ఆందోళన వెలిబుచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అగ్నిపర్వతం దెబ్బ.. కారు క్షణాల్లో కరిగిపోయింది
హవాయి : అగ్నిపర్వతం పేలితే ఎలా ఉంటుందో ఇప్పటి వరకూ చాలా మంది పుస్తకాల్లో చదివి ఉంటారు. మరికొందరు సినిమాల్లోనో చూసి ఉంటారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. టెక్నాలజీ పెరిగింది. ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకుంటున్నారు. అలాగే హవాయి దేశంలోని కిలౌయి లోని అగ్నిపర్వతం పేలడం.. అది సృష్టించిన విధ్వంసం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటనలో సుమారు 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందల సంఖ్యలో ఇళ్లు, భవనాలు, క్షణాల్లో బూడిదై పోయాయి. అగ్ని పర్వతం నుంచి వచ్చిన లావా గాల్లో సుమారు 70 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతోంది. అంతేకాకుండా దీని కారణంగా చుట్టు పక్కల ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. లావా ఎలా పరుగులెడుతుందో చూడండి. దారి పక్కన నిలిపిఉన్న కారును క్షణాల్లో కాల్చి బూడిద చేసేసింది. పరిసర ప్రాంతాలను దగ్ధం చేస్తున్న లావా.. కాలిపోతున్న గృహాలు రోడ్డుపై ప్రవహిస్తున్స లావా -
అగ్నిపర్వతం దెబ్బ.. కారు క్షణాల్లో బూడిదైపోయింది
-
హవాయి గజగజ : చరిత్రలో భారీ భూకంపం
హోనలులు, హవాయి : ఫసిఫిక్ మహాసముద్రంలోని హవాయి దీవుల్లో అత్యంత ప్రమాదకరమైన(క్రీయాశీల) అగ్నిపర్వతంగా పేరున్న కిలౌయి అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున లావాను వెదజల్లుతోంది. శనివారం హవాయి దీవుల చరిత్రలో భారీ భూకంపం సంభవించింది. గత నలభై ఏళ్ల ఈ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. రిక్టర్ స్కేలుపై 7.4గా భూకంప తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) వెల్లడించింది. శుక్రవారం వరుసగా రెండు భూకంపాలు(5.6 ; 6.9 తీవ్రతలతో) సంభవించాయి. దీంతో ద్వీప ప్రజలు భయంతో వణికిపోయారు. తూర్పు హవాయి ద్వీపం వైపు పెద్ద ఎత్తున లావా వస్తుండటంతో ఆ ప్రాంతంలోని 1700 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంపాలు సంభవిస్తుండటం వల్ల భూమి నుంచి పెద్ద ఎత్తున సల్ఫర్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోంది. ఈ వాయువును పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ముక్కు, గొంతులో తీవ్రంగా మంట వచ్చి శ్వాస తీసుకోలేక మనిషి చనిపోవచ్చు. స్వల్పస్థాయి భూకంపాలను కలుపుకుని గత వారం రోజుల్లో హవాయిలో 1000కి పైగా సంభవించాయి. సునామీ అవకాశం లేదు ద్వీపాల్లో అతి భారీ భూకంపాలు సంభవించినప్పుడు సునామీ సంభవించడం సహజం. కానీ, హవాయికి ఆ ముప్పు లేదని సునామీ నిపుణులు చెబుతున్నారు. -
ప్రాణాలకు తెగించి.. అద్భుతాన్ని ఒడిసిపట్టాడు!
ప్రకృతి అనేక అద్భుతాలకు నెలవు. కానీ అలాంటి అద్భుతాలను ఒడిసిపట్టాలంటే కొన్నిసార్లు ప్రాణాలకు తెగించి.. రిస్క్ చేయాల్సి ఉంటుంది. అలాంటి రిస్క్ను చేసి.. లావా ఎగజిమ్ముతున్న అగ్నిపర్వతానికి సంబంధించి అత్యద్భుతమైన ఫొటోలను ఫొటోగ్రాఫర్ మైక్మెజ్ తన కెమెరాలో బంధించాడు. అతడు తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఈ ఫొటోలు నెటిజన్లను విస్మయపరుస్తున్నాయి. పసిఫిక్ సముద్రంలోని హవాయ్ ద్వీపంలో ఉన్న కిలావయా అగ్నిపర్వతం లావా ఎగిజమ్ముతుండగా.. అక్కడి అత్యద్భుతమైన దృశ్యాలను ఈ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటోలు నిజంగా అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు కీర్తిస్తున్నారు. -
ఈమె మామూలు మహిళ కాదు!
-
ఈమె మామూలు మహిళ కాదు!
'ఫిమేల్ ఇండియానా జోన్స్' పేరు ఎప్పుడైనా విన్నారా? పోనీ, అలిసన్ టీల్? తెలియదంటే మాత్రం కొద్దోగొప్పో మిస్ అయినట్టే! 30 ఏళ్ల ఈ మిస్.. సామాన్య మహిళ కాదు.. అడ్వెంచరిస్టులకే అమ్మమ్మ లాంటిది! పుట్టడంతోటే ప్రపంచ బాట పట్టిన ఈ హవాయిన్ పడతి ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టొచ్చింది. చుట్టిరావడమంటే కేవలం చూసి రావడంకాదు, అక్కడి సంసృతి, జీవన విధానం, ప్రకృతి రహస్యాలు మొదలైన అంశాలను లోతుగా అధ్యయనం చేసి, ఆ వివరాలు మనకు తెలియజేస్తుంది. 'ఇండియానా జోన్స్'లో హారిసన్ ఫోర్డ్ కు టోపి, తాడు ఎలానో.. ఈ 'ఫిమేల్ ఇండియానా' అలిసన్ కు సర్ఫ్ బోట్ అలా. ప్రపంచంలోని అన్ని సముద్రాల్లో సర్ఫింగ్ చేసిందీమె. మరో అడ్వెంచరిస్ట్ తో కలిసి అలిసన్ చేసిన సాహసాలు 'నేక్డ్ అండ్ అఫ్రైడ్' పేరుతో డిస్కవరీ చానెల్ లో ప్రసారం అయ్యాయి. ఆ కార్యక్రమం ఓ సంచలనం. ఇప్పటివరకు తాను చేసిన సాహసయాత్రలపై 'అలిసన్ అడ్వెంచర్స్' పేరుతో ఫిలిం సిరీస్ ను కూడా రూపొందించింది. తాజాగా అలిసన్.. హవాయి ద్వీపాల్లోని కిలాయే అగ్నిపర్వతం దగ్గర (ఫసిఫిక్ సముద్రంలో) సర్ఫింగ్ చేసింది. 2011లో బద్దలైన ఆ అగ్నిపర్వతం నుంచి ఐదేళ్లుగా లావా ప్రవహిస్తూనేఉంది. లావా సముద్రంలో పడే చోట సర్ఫింగ్ చేసి 'వాహ్వా' అనిపించింది. ప్రపంచ చరిత్రలో ఇలా లావాకు సమీపంలో సర్ఫింగ్ చేసిన మొదటి మహిళగా రాకార్డుకెక్కింది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ పెరిన్ జేమ్స్ ఈ కృత్యాన్ని తన కెమెరాతో అద్భుతంగా చిత్రీకరించాడు. 'అదొక అద్భుత దృశ్యం. లావా సముద్రంలో పడుతున్నప్పుడు వచ్చే శబ్ధం నిజంగా మనల్ని భయపెడుతుంది. అక్కడ నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి. సాహసాలు చేయడం నాకు అలవాటు కాబట్టి నేనిది చేశా. దయచేసి ఎవ్వరూ ఇలాంటివి చేయకండి' అని చెబుతోంది అలీసన్. ప్రముఖ అడ్వెంచర్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ బ్లెహెర్ట్.. అలిసన్ తండ్రి. తల్లి పేరు దెబోరా. అడ్వెంచర్లు చేస్తూ ప్రపంచం తిరిగే వీరు.. కూతుర్ని(అలిసన్) కూడా వెంటతీసుకెళ్లేవారు. అలా ప్రపంచమే నా పాఠశాల అయిందని, ప్రకృతి, విభిన్న సంస్కృతుల ప్రజలే తన గురువులని చెబుతుందీ డేర్ డెవిల్. అలిసన్ టీల్ కు సంబంధించిన మరిన్ని విశేషాలకు ఆమె వెబ్ సైట్ alisonsadventures.com ద్వారా తెలుసుకోవచ్చు. అలీసన్ జీవితం, ఆమె వీడియోల్సి చూశాక భూమ్మీద మనుషులు ఇలా కూడా బతుకుతారని, ఎక్కడైనాసరే బతుకు భారమేమీ కాదని అనిపించకమానదు! -
లావా ప్రవాహంతో ఇల్లు బుగ్గి...
అమెరికాలోని హావాయి దీవిలో జూన్ 26న బద్దలైన కెలియా అగ్నిపర్వతం నుంచి నెమ్మదిగా దిగువకు ప్రవహిస్తున్న లావా సోమవారం మధ్యాహ్నం ఓ ఇంటిని ఇలా దహించివేసింది. పహోవా గ్రామంలోని ఈ ఇల్లు నిమిషాల వ్యవధిలోనే బూడిదైపోయింది. అగ్నిపర్వతం నుంచి నెమ్మదిగా ప్రవహిస్తున్న లావా అక్టోబర్ 26న ఓ రోడ్డును దాటుకుని ఈ గ్రామ సమీపంలోకి చేరి సోమవారం ఇలా తొలి ఇంటిని బూడిద చేసింది. స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పాటు ఇతర ఇళ్లకు లావా చేరకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.