బెడిసికొట్టిన పాక్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియా యాడ్
ఇంటర్నెట్లో తీవ్ర విమర్శలు, మీమ్‌లు
మూర్ఖత్వమంటూ మండిపడ్డ ప్రధాని
పార్లమెంటులోనూ తీవ్ర చర్చ
సమగ్ర విచారణకు ప్రధాని ఆదేశం
ఈ ఫొటో చూస్తే ఏం గుర్తొస్తోంది? న్యూయార్క్ జంట టవర్లను విమానాలతో కూల్చేసిన 9/11 ఉగ్ర దాడే కదూ! కానీ నిజానికిది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) రూపొందించిన ప్రకటన! భద్రతా ఆందోళనలతో పీఐఏపై విధించిన నిషేధాన్ని నాలుగేళ్ల అనంతరం ఇటీవలే యూరోపియన్ యూనియన్ తొలగించింది. దాంతో పాక్ నుంచి యూరప్‌కు విమాన సర్విసులు తిరిగి మొదలయ్యాయి. దీనికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా పీఐఏ చేసిన ప్రయత్నమిది!
కాకపోతే ప్రకటనలో పీఐఏ విమానం నేరుగా పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి దూసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. పైగా, ‘పారిస్! ఈ రోజే మేమొచ్చేస్తున్నాం!’అంటూ క్యాప్షన్ కూడా జోడించారు!! అలా అచ్చం అమెరికాపై ఉగ్ర దాడిని గుర్తుకు తెస్తుండటంతో పీఏఐ ప్రకటన పూర్తిగా బెడిసికొట్టింది. యాడ్‌ను 9/11 ఉగ్ర దాడితో పోలుస్తూ నెటిజన్లంతా తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. దీనిపై పుట్టుకొచ్చిన మీమ్‌లు సోషల్ మీడియాలో రోజంతా వైరలయ్యాయి. సరదా కామెంట్లు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. పీఐఏకు కొత్త గ్రాఫిక్ డిజైనర్ చాలా అవసరమంటూ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమర్ చెణుకులు విసిరారు.
పార్లమెంటులోనూ ప్రస్తావన!
యాడ్ ఉదంతం అంతర్జాతీయంగా పరువు తీయడంతో తలపట్టుకోవడం పాక్ ప్రభుత్వం వంతయింది. ఇది మూర్ఖత్వానికి పరాకష్ట అంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు కూడా ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ అయితే ఈ అంశాన్ని ఏకంగా పార్లమెంటులోనే ప్రస్తావించారు.
‘ఫొటోయే చాలా అభ్యంతరకరం మొర్రో అంటే, క్యాప్షన్ మరింత దారుణంగా ఉంది’అంటూ వాపోయారు. ‘‘ప్రధాని కూడా దీనిపై చాల ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రకటనను ఎవరు అనుమతించారో విచారణలో తేలుతుంది. వారిపై కఠిన చర్యలు తప్పవు’’అని చెప్పుకొచ్చారు. న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 2001లో జరిగిన ఉగ్ర దాడిలో 3,000 మందికి పైగా మరణించడం తెలిసిందే. విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు జంట టవర్లను వాటితో ఢీకొట్టారు. దాంతో టవర్లు నేలమట్టమయ్యాయి.
తొలిసారేమీ కాదు
అర్థంపర్థం లేని ప్రకటనతో అభాసుపాలు కావడం పీఐఏకు కొత్తేమీ కాదు. 2016లో ఇస్లామాబాద్ విమానాశ్రయంలోనే గ్రౌండ్ స్టాఫ్ మేకను బలివ్వడం అంతర్జాతీయంగా పతాక శీర్షికలకెక్కింది. అంతకుముందు 1979లో ఏకంగా పాక్‌కు చెందిన బోయింగ్ 747 విమానం నేరుగా న్యూయార్క్ జంట టవర్లపైకి దూసుకెళ్తున్నట్టుగా పీఐఏ యాడ్ రూపొందించింది. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ గతానుభవాల నుంచి పీఐఏ ఏమీ నేర్చుకోలేదని తాజాగా రుజువైందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పీఐఏ గ్రాఫిక్స్ హెడ్‌కు చరిత్రకు సంబంధించి క్రాష్ కోర్స్ చేయిస్తే మేలంటూ సలహాలిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment