
ఏకతాటిపైకి దేశాలు
నేటి నుంచే పారిస్ సదస్సు పర్యావరణ పరిరక్షణకు సిద్ధం
* వాతావరణ మార్పుపై అంతర్జాతీయ ఒప్పందం లక్ష్యం
* భారత్ తరఫున పాల్గొంటున్న ప్రధాని మోదీ
* సౌర శక్తి దేశాల కూటమికి అంకురార్పణ
పారిస్: ప్రపంచానికి పెను సవాలుగా పరిణమించిన భూ తాపోన్నతిపై పోరుకు రంగం సిద్ధమైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 150కి పైగా దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు సమావేశమై వాతావరణ మార్పుపై పోరాటానికి కార్యాచరణను నిర్ణయించనున్నారు.
కర్బన ఉద్గారాల తగ్గింపు, తద్వారా పర్యావరణ పరిరక్షణకుద్దేశించిన చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందం లక్ష్యంగా నేటి(నవంబర్ 30) నుంచి డిసెంబర్ 11 వరకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ సదస్సు(సీఓపీ21) జరగనుంది. భూ తాపోన్నతిని 2 డిగ్రీల సెల్సియస్ లోపునకు పరిమితి చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా, రష్యా, చైనాల అధ్యక్షులు బరాక్ ఒబామా, వ్లాదిమిర్ పుతిన్, జీ జిన్‌పింగ్ పాల్గొంటున్నారు.
పారిస్‌పై ఇటీవల జరిగిన భారీ స్థాయి ఉగ్రదాడి నేపథ్యంలో నగరమంతటా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు. వాతావరణ మార్పుపై 2009లో కోపెన్‌హెగన్‌లో జరిగిన సదస్సులో 115 సభ్య దేశాలు పాల్గొన్నాయి. సదస్సు సందర్భంగా ఇటీవలి పారిస్ ఉగ్రదాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలో వేలాదిమంది మానవహారం ప్రదర్శించారు.
వాతావరణ ఉత్పాతం నుంచి భూగోళాన్ని రక్షించేందుకు ప్రపంచదేశాల నేతలు కృషి చేయాలంటూ నినదించారు. పారిస్‌లోని లె బౌర్జెట్‌లో జరగనున్న ఈ సదస్సులో 50 వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోలు, ఐరాస సంస్థలు, పౌర సమాజం, మీడియా.. తదితరాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఇండియా పెవిలియన్.. ‘పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించనున్నాం’ అని ఆదివారం పారిస్ బయల్దేరి వెళ్లేముందు మోదీ ట్వీట్ చేశారు. ప్రతీ నెల తాను రేడియోలో ఇచ్చే ప్రసంగం ‘మన్ కీ బాత్’లోనూ.. ‘వాతావరణ మార్పుపై ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది.. ఆందోళన వ్యక్తమవుతోంది. భూగోళ ఉష్ణోగ్రత ఇంకా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని పేర్కొన్నారు.
సదస్సు ప్రాంగణంలో సోమవారం ఇండియా పెవిలియన్‌ను మోదీ ప్రారంభిస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌తో కలిసి అంతర్జాతీయ సౌరశక్తి దేశాల కూటమిని మోదీ ప్రారంభిస్తారు. ఈ కూటమి ఆలోచన ఆయనదే. సదస్సు మొదటి రోజు మోదీ, ఒబామాల భేటీ జరగనుంది. ఒప్పందంపై ఏకాభిప్రాయం సాధించే దిశగా కీలక పక్షాలతో సంప్రదింపులు జరిపే కార్యక్రమంలో భాగంగా సదస్సు తొలి రోజు ఒబామా,, మోదీతో భేటీ అవుతున్నారు. కోపెన్‌హెగన్‌లో జరిగిన గత కాప్ సదస్సులో కీలక దేశాల అధినేతలు చివరలో పాల్గొనడంతో ఎలాంటి నిర్దిష్టమైన ఫలితం వెలువడలేదు.
ఒప్పందం సమధర్మంగా ఉండాలి: భారత్
పారిస్: భూ తాపోన్నతిని పరిమితం చేసేందుకు ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందం న్యాయబద్ధంగా, సమధర్మంతో, సంతులితంగా ఉండాలని భారత్ స్పష్టం చేసింది. సమధర్మ నియమాలు ఒప్పందంలో నిబిడీకృతమై ఉండాలని పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పారిస్‌లో పేర్కొన్నారు. పరస్పర విశ్వాసంతో కూడిన ఆచరణాత్మక ఒప్పందం కుదరాల్సిన అవసరం ఉందన్నారు. అందుబాటులో ఉన్న కార్బన్ స్పేస్‌లో మూడింట రెండొంతులు అభివృద్ధి చెందిన దేశాలు ఉపయోగిస్తున్నాయన్నారు.
కామన్వెల్త్ లోనూ..
వాలెట్టా: పారిస్ సదస్సులో చట్టబద్ధ, ఆచరణాత్మక అంతర్జాతీయ ఒప్పందం కోసం కృషి చేయాలని మాల్టాలో జరుగుతున్న కామన్వెల్త్ దేశాల 24వ సదస్సులో సభ్య దేశాలు నిర్ణయించాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు కృషి చేస్తున్న పేద దేశాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాయి. వాతావరణ మార్పుపై లోతుగా చర్చించారు. తీవ్రవాదంపై పోరుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాలకు దాని ద్వారా నిధులందజేయాలని నిర్ణయం తీసుకున్నాయి.
మాల్టా ప్రధాని మస్కట్ 100 కోట్ల డాలర్లు మూలనిధిగా ‘కామన్వెల్త్ గ్రీన్ ఫైనాన్స్ ఫెసిలిటీ’ని ప్రారంభించారు. వాతావరణ మార్పుపై పోరు కోసం పేద దేశాలకు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలు 2.5 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించాయి. భారత్, మరికొన్ని దేశాలు కలిసి కామన్‌వెల్త్ దేశాల్లోని బలహీన దేశాలకు స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో సహకారం అందించే లక్ష్యంతో 25 లక్షల డాలర్ల నిధిని సమకూర్చాలని నిర్ణయించాయి. కామన్వెల్త్‌లోని చిన్నదేశాల వాణిజ్య సహకారం కోసం 25 లక్షల డాలర్ల సాయాన్ని భారత్ ప్రకటించింది.
సదస్సుకు తెలుగు వ్యక్తి!
సాక్షి, హైదరాబాద్: పారిస్ సదస్సులో తెలుగు యువకుడు నాగుల శివ ప్రసాద్ పాల్గొననున్నారు. ఇండియన్ యూత్ క్లైమేట్ నెట్‌వర్క్ ప్రాంతీయ సమన్వయకర్తగా కొన్నేళ్లుగా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్.. అనేక పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల్లో క్రియాశీలక సభ్యుడు కూడా. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల పెరిగిపోతున్న భూ ఉష్ణోగ్రతలు, తద్వారా వస్తున్న వాతావరణ మార్పులపై మరింత అవగాహన కల్పించే లక్ష్యంతో కొన్నేళ్లుగా యువకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.