Telugu workers
-
సౌదీ జైల్లో తెలు‘గోడు’
3 నెలలుగా సఫార్ జైల్లో 1,800 మంది నరకయాతన - స్పందించని రాయబార కార్యాలయం - ‘సాక్షి’కి గోడు వెళ్లబోసుకున్న బాధితులు.. సాక్షి, హైదరాబాద్: ‘అకామ్ (పని చేసేందుకు ఇచ్చే పర్మిట్) గడువు పూర్తయ్యింది. తిరిగి అకామ్ స్టాంపు వేయించుకునేందుకు డబ్బులు లేవు. దీంతో చిన్నా చితకా పనులు చేసుకుంటున్న తరుణంలో జెడ్డా ప్రభుత్వం కానూన్ ప్రకటించింది. అంతే.. అక్కడి అధికారులు మమ్మల్ని దొరికినవారిని దొరికినట్లు పట్టుకున్నారు. మా దగ్గర ఉన్న డబ్బులు, సెల్ఫోన్లు లాక్కున్నారు. ఒకరిద్దరు దాచుకున్న ఒకటి, రెండు సెల్ఫోన్లు మా వద్ద మిగిలాయి. వాటి నుంచే ‘సాక్షి’కి సమాచారం అందిస్తున్నాం.’ ... సౌదీ జైల్లో మూడు నెలలుగా మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెంచల్ రెడ్డి సహా మరో 20 మంది తెలుగు కార్మికులు వెళ్లబోసుకున్న గోడు ఇది. బతుకుదెరువు కోసం ఇల్లు వదిలి... దేశం కాని దేశం వెళ్లి... చేతిలో చిల్లిగవ్వ లేక... తింటానికి తిండి లేక కటకటాల పాలైన ఈ నిరుపేదల్లో ఎవరిని కదిలించినా కన్నీటి గాథే! ఎడారిలో ఆక్రందన... ఎడారి దేశంలో వందలాది తెలంగాణ, ఏపీ వాసులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. పొట్ట కూటికి వెళ్లిన వీరు... పూర్తయిన పని గడువును పొడిగించుకొనే స్థోమత లేక అష్టకష్టాలూ పడుతున్నారు. పస్తులుండలేక ఎక్కడ పని దొరికితే అక్కడే ఉండిపోతున్నారు. గడువు ముగిసినా దేశంలో ఉన్నందుకు వీరందరినీ పట్టుకున్న సౌదీ అధికారులు జెడ్డా జైలులో బందీలను చేశారు. కొన్ని మాసాల కిందట ఇలాంటి వారందరినీ భారత్ రప్పించేందుకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చర్యలు తీసుకున్నారు. కానీ విదేశాంగ శాఖ సూచనలకు... సౌదీలోని భారత రాయబార కార్యాలయ అధికారులు అనుసరిస్తున్న తీరుకూ ఎక్కడా పొంతన లేక దాదాపు 1,800 మంది తెలుగు రాష్ట్రాల వారు మూడు నెలలుగా జైల్లోని 18 గదుల్లో మగ్గుతున్నారు. ‘మాతో పాటు జైల్లో ఉన్న ఇతర దేశాల వందలాది కూలీలను విడిపించుకునేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు వెంటనే స్పందించాయి. ఇక్కడ రాయబార కార్యాలయాలకు సమాచారం ఇస్తే తాత్కాలిక పాస్‌పోర్టు, టికెట్ తీసి నెలలోనే వారిని తీసుకెళ్లాయి. కానీ భారత రాయబార కార్యాలయ అధికారుల వైఖరి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మూడు నెలలుగా 30 మంది తెలుగువారిని మాత్రమే భారత్‌కు పంపారు. మిగిలిన మా పరిస్థితేంటీ’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షన్నర జరిమానా కట్టమంటున్నారు. ‘సౌదీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రూ.1.5 లక్షలు జరిమానా కట్టాలని డిమాండ్ చేస్తోంది. మా దగ్గర నయా పైసా లేదు. మా కుటుంబీకులు మా పరిస్థితి తెలిసి ఆందోళన చెందుతున్నారు. తాత్కాలిక పాస్‌పోర్టులు ఇవ్వకపోవడంతో భారత్‌కు రాలేకపోతున్నాం’... ఇది మరో బాధితుడి గోడు. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుతో పాటు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకొని తమకు విముక్తి కల్పించాలని వారు అభ్యర్థిస్తున్నారు. -
కార్మికులను ఆదుకోని లేబర్ అథారిటీ
మోర్తాడ్: ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన తెలుగు కార్మికులను అక్కడి కంపెనీలు మోసం చేయడంతో లేబర్ మానిటరింగ్ రిక్రూట్మెంట్ అథారిటీ (ఎల్ఎంఆర్ఏ)ని ఆశ్రయించారు. అయితే ఏడాది సీనియార్టీ ఉన్న కార్మికులకు మాత్రమే తాము ఇతర కంపెనీల్లో పని చూపగలమని, తక్కువ సీనియార్టీ ఉన్న కార్మికుల విషయంలో ఏమీ చేయలేమని ఎల్ఎంఆర్ఏ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో కార్మికులు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. ఇప్పటికే లక్షలు వెచ్చించి బహ్రెయిన్ వచ్చిన తాము మళ్లీ కోర్టులో కేసు వేయాలంటే మరింత అప్పు చేయాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కడప, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన దాదాపు 126 మంది కార్మికులు 4 నెలల క్రితం బహ్రెయిన్ వెళ్లారు. అక్కడి అట్లాస్, టీఎంఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీల్లో పని చేస్తున్నారు. అయితే బండెడు చాకిరీ చేయించుకున్న కంపెనీ యాజమాన్యం వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసింది. బహ్రెయిన్‌లో ఒక కంపెనీలో పని చేస్తూ మరో కంపెనీకి మారాలంటే ఎల్‌ఎంఆర్‌ఏను ఆశ్రయిస్తేనే మార్గం దొరుకుతుంది. కాగా బహ్రెయిన్ కార్మిక చట్టాల ప్రకారం ఏడాది సర్వీసు ఉన్న కార్మికులకే మరో కంపెనీలో పని చూపించడానికి ఎల్ఎంఆర్ఏ చర్యలు తీసుకుంటుంది. ఏడాది కంటే తక్కువ సర్వీసు ఉన్న కార్మికులు కోర్టును ఆశ్రయించాల్సిందే. ఒకవేళ కోర్టుకు వెళ్లకుండా సొంతంగా పనిచూసుకుంటే చట్టరీత్యా నేరం అవుతుంది. అలా చేస్తే జైలు పాలు కావాల్సిందే. కాగా, అట్లాస్, టీఎంఎస్ కంపెనీల్లో పని చేస్తున్న కార్మికులను ఎల్‌ఆర్‌ఎంఏ ఆదరించకపోవడం, కోర్టును ఆశ్రయించాలంటే సొంతంగా లాయర్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి రావడంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. -
బహ్రెయిన్‌లో తెలుగు కార్మికుల కష్టాలు
మోర్తాడ్: పొట్ట చేత పట్టుకుని దేశం కాని దేశానికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల వారిని అక్క డి కంపెనీ యాజమాన్యాలు వంచిస్తున్నాయి. ఏజెంట్ల మోసానికి కంపెనీ యాజమాన్యం వంచన కూడా తోడు కావడంతో తెలుగు కార్మికులకుది దిక్కుతోచని పరిస్థితి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలల్లోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కడప, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 126 మంది కార్మికులు నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లారు. అక్కడి కన్స్ట్రక్షన్ కంపెనీలైన అట్లాస్, టీఎంఎస్లలో పనికి కుదిరారు. హైదరాబాద్‌కు చెందిన రావు అలియాస్ రెడ్డి, తమిళనాడుకు చెందిన ఖాదర్‌సాహెబ్, నిజామాబాద్‌కు చెందిన శేఖర్ అనే ఏజెంట్ల ద్వారా వీరు బహ్రెయిన్‌కు వెళ్లారు. ఒక్కో కార్మికుడు వీసా కోసం రూ. 65 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు చెల్లించారు. రోజు ఎనిమిది గంటల పాటు డ్యూటీ, ఇండియన్ కరెన్సీలో నెలకు రూ.20 వేల వరకు వేతనం చెల్లించడానికి కంపెనీ యాజమాన్యం కార్మికులతో ఒప్పందం కుదుర్చుకుంది.కార్మికులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఒప్పందంలో పేర్కొన్నారు. బహ్రె యిన్ వెళ్లిన తరువాత వసతి, భోజనం కల్పించినా, చేసిన పనికి యాజమాన్యం మాత్రం వేతనం చెల్లించడం లేదని జిల్లాకు చెందిన పలువురు కార్మికులు ‘సాక్షి’కి ఫోన్లో సమాచారం అందించారు. కార్మికులకు మూడు నెలల వేతనాన్ని యాజమాన్యాలు చెల్లించాల్సి ఉంది. భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని కార్మికులు తెలిపారు. ఇటీవల బహ్రెయిన్‌లో పర్యటించిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు తాము ఫిర్యాదు చేసినట్లు కార్మికులు తెలిపారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కార్మికులు వివరించారు. -
మరోసారి ఇరాక్ వెళ్ళం.
-
తెలు‘గోడు’..
- ఇరాక్‌లోని బస్రాహ్‌లో చిక్కుకున్న 150 మంది తెలుగు కార్మికులు - తెలంగాణ జిల్లాలకు చెందినవారు 120 మంది - సర్కారు ఆదుకోవాలని విజ్ఞప్తి జగిత్యాల రూరల్ : ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో అక్కడ ఉపాధి కోసం వెళ్లిన తెలుగువారు ఇబ్బందుల్లో పడ్డారు. పలు కంపెనీలు మూతపడటంతో ఆదుకునే దిక్కులేక ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తమను స్వదేశం పంపించాలని కంపెనీ యాజమాన్యాలను, ఇరాక్ ఎంబసీ అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాక్‌లోని అల్ మన్‌హెల్ ముథిల్ కంపెనీ ఆధ్వర్యంలో బాగ్దాద్ సమీపంలోని బస్రాహ్ యూనివర్సిటీలో ఐదు వందల మంది భారతీయులు పనిచేస్తుండగా, అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 150 మంది ఉన్నారు. తెలంగాణకు చెందిన దాదాపు 120 మంది ఐదు నెలలుగా కంపెనీ వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు పదిహేను రోజులుగా అంతర్యుద్ధంతో కంపెనీ క్వార్టర్స్‌లో తలదాచుకుంటున్నారు. తమకు వేతనాలిచ్చి స్వదేశం పంపించాలని కంపెనీని వేడుకుంటున్నా యాజమాన్యం గానీ, ఎంబసీ గానీ స్పందించడం లేదని సోమవారం ‘సాక్షి’ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు. బాధితుల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డి.గోపాల్, దరూర్ రాజన్న, నారపాక గంగాధర్, నారపాక రవి, నారపాక వెంకట్ (ఉదుమ్‌పూర్, కడెం), దండెం వెంకటేశ్ (అక్కపల్లిగూడెం, జన్నారం), మండె మహేందర్ (రేండ్లగూడ, జన్నారం) ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తమను స్వదేశానికి చేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు.