- ఇరాక్‌లోని బస్రాహ్‌లో చిక్కుకున్న 150 మంది తెలుగు కార్మికులు
- తెలంగాణ జిల్లాలకు చెందినవారు 120 మంది
- సర్కారు ఆదుకోవాలని విజ్ఞప్తి
జగిత్యాల రూరల్ : ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో అక్కడ ఉపాధి కోసం వెళ్లిన తెలుగువారు ఇబ్బందుల్లో పడ్డారు. పలు కంపెనీలు మూతపడటంతో ఆదుకునే దిక్కులేక ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తమను స్వదేశం పంపించాలని కంపెనీ యాజమాన్యాలను, ఇరాక్ ఎంబసీ అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాక్‌లోని అల్ మన్‌హెల్ ముథిల్ కంపెనీ ఆధ్వర్యంలో బాగ్దాద్ సమీపంలోని బస్రాహ్ యూనివర్సిటీలో ఐదు వందల మంది భారతీయులు పనిచేస్తుండగా, అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 150 మంది ఉన్నారు.
తెలంగాణకు చెందిన దాదాపు 120 మంది ఐదు నెలలుగా కంపెనీ వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు పదిహేను రోజులుగా అంతర్యుద్ధంతో కంపెనీ క్వార్టర్స్‌లో తలదాచుకుంటున్నారు. తమకు వేతనాలిచ్చి స్వదేశం పంపించాలని కంపెనీని వేడుకుంటున్నా యాజమాన్యం గానీ, ఎంబసీ గానీ స్పందించడం లేదని సోమవారం ‘సాక్షి’ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు.
బాధితుల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డి.గోపాల్, దరూర్ రాజన్న, నారపాక గంగాధర్, నారపాక రవి, నారపాక వెంకట్ (ఉదుమ్‌పూర్, కడెం), దండెం వెంకటేశ్ (అక్కపల్లిగూడెం, జన్నారం), మండె మహేందర్ (రేండ్లగూడ, జన్నారం) ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తమను స్వదేశానికి చేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు.
తెలు‘గోడు’..
Published Tue, Jun 24 2014 1:46 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement