సౌదీ జైల్లో తెలు‘గోడు’
3 నెలలుగా సఫార్ జైల్లో 1,800 మంది నరకయాతన
- స్పందించని రాయబార కార్యాలయం
- ‘సాక్షి’కి గోడు వెళ్లబోసుకున్న బాధితులు..
సాక్షి, హైదరాబాద్: ‘అకామ్ (పని చేసేందుకు ఇచ్చే పర్మిట్) గడువు పూర్తయ్యింది. తిరిగి అకామ్ స్టాంపు వేయించుకునేందుకు డబ్బులు లేవు. దీంతో చిన్నా చితకా పనులు చేసుకుంటున్న తరుణంలో జెడ్డా ప్రభుత్వం కానూన్ ప్రకటించింది. అంతే.. అక్కడి అధికారులు మమ్మల్ని దొరికినవారిని దొరికినట్లు పట్టుకున్నారు. మా దగ్గర ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్లు లాక్కున్నారు. ఒకరిద్దరు దాచుకున్న ఒకటి, రెండు సెల్‌ఫోన్లు మా వద్ద మిగిలాయి. వాటి నుంచే ‘సాక్షి’కి సమాచారం అందిస్తున్నాం.’ ... సౌదీ జైల్లో మూడు నెలలుగా మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెంచల్ రెడ్డి సహా మరో 20 మంది తెలుగు కార్మికులు వెళ్లబోసుకున్న గోడు ఇది. బతుకుదెరువు కోసం ఇల్లు వదిలి... దేశం కాని దేశం వెళ్లి... చేతిలో చిల్లిగవ్వ లేక... తింటానికి తిండి లేక కటకటాల పాలైన ఈ నిరుపేదల్లో ఎవరిని కదిలించినా కన్నీటి గాథే!
ఎడారిలో ఆక్రందన...
ఎడారి దేశంలో వందలాది తెలంగాణ, ఏపీ వాసులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. పొట్ట కూటికి వెళ్లిన వీరు... పూర్తయిన పని గడువును పొడిగించుకొనే స్థోమత లేక అష్టకష్టాలూ పడుతున్నారు. పస్తులుండలేక ఎక్కడ పని దొరికితే అక్కడే ఉండిపోతున్నారు. గడువు ముగిసినా దేశంలో ఉన్నందుకు వీరందరినీ పట్టుకున్న సౌదీ అధికారులు జెడ్డా జైలులో బందీలను చేశారు. కొన్ని మాసాల కిందట ఇలాంటి వారందరినీ భారత్ రప్పించేందుకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చర్యలు తీసుకున్నారు. కానీ విదేశాంగ శాఖ సూచనలకు... సౌదీలోని భారత రాయబార కార్యాలయ అధికారులు అనుసరిస్తున్న తీరుకూ ఎక్కడా పొంతన లేక దాదాపు 1,800 మంది తెలుగు రాష్ట్రాల వారు మూడు నెలలుగా జైల్లోని 18 గదుల్లో మగ్గుతున్నారు. ‘మాతో పాటు జైల్లో ఉన్న ఇతర దేశాల వందలాది కూలీలను విడిపించుకునేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు వెంటనే స్పందించాయి. ఇక్కడ రాయబార కార్యాలయాలకు సమాచారం ఇస్తే తాత్కాలిక పాస్‌పోర్టు, టికెట్ తీసి నెలలోనే వారిని తీసుకెళ్లాయి. కానీ భారత రాయబార కార్యాలయ అధికారుల వైఖరి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మూడు నెలలుగా 30 మంది తెలుగువారిని మాత్రమే భారత్‌కు పంపారు. మిగిలిన మా పరిస్థితేంటీ’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
లక్షన్నర జరిమానా కట్టమంటున్నారు.
‘సౌదీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రూ.1.5 లక్షలు జరిమానా కట్టాలని డిమాండ్ చేస్తోంది. మా దగ్గర నయా పైసా లేదు. మా కుటుంబీకులు మా పరిస్థితి తెలిసి ఆందోళన చెందుతున్నారు. తాత్కాలిక పాస్‌పోర్టులు ఇవ్వకపోవడంతో భారత్‌కు రాలేకపోతున్నాం’... ఇది మరో బాధితుడి గోడు. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుతో పాటు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకొని తమకు విముక్తి కల్పించాలని వారు అభ్యర్థిస్తున్నారు.