కోహ్లితో పాంటింగ్ (PC: BCCI/IPL)
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు మేటి జట్లు ఈ టెస్టు సిరీస్‌లో నువ్వా- నేనా అన్నట్లు పోటీ పడుతుంటే క్రికెట్ ప్రేమికులకు లభించే ఆ కిక్కే వేరు. ఆసీస్- భారత ఆటగాళ్ల మధ్య పరస్పర స్లెడ్జింగ్‌తో పాటు.. మ్యాచ్‌ను విశ్లేషిస్తూ కామెంటేటర్లు విసిరే ఛలోక్తులు, చమక్కులకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
కామెంట్రీకి దూరం
ఇరుజట్లకు చెందిన మాజీ క్రికెటర్లలో చాలా మంది ఆసీస్ - భారత్ మధ్య ఈ టెస్టు సిరీస్‌ను తమ వ్యాఖ్యలతో మరింత ఆసక్తికరంగా మారుస్తూ ఉంటారు. ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కూడా ఈ కోవకు చెందినవాడే. అయితే, అతడు ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టు కామెంట్రీకి దూరం కానున్నట్లు సమాచారం.
కారణం ఇదే
పాంటింగ్‌తో పాటు ఆసీస్ మరో మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ కూడా పెర్త్ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ వార్తా పత్రిక ‘ది ఏజ్’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విధుల కారణంగా.. పాంటింగ్- లాంగర్ పెర్త్‌లో జరిగే.. మొదటి టెస్టు కామెంట్రీకి దూరంగా ఉండనున్నట్లు తెలిపింది.
కాగా రిక్కీ పాంటింగ్ ఇటీవలే.. ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. అదే విధంగా.. జస్టిన్ లాంగర్ సైతం లక్నో సూపర్ జెయింట్స్ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనుంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగే ఆక్షన్‌కు కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటారు.
బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కిన ఆసీస్ మీడియా
అయితే, అంతకు రెండు రోజుల ముందే.. అంటే నవంబరు 22న ఆసీస్- భారత్ మొదటి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలోనే ‘ది ఏజ్’ పాంటింగ్- లాంగర్‌ల గురించి ప్రస్తావిస్తూ.. బీసీసీఐపై పరోక్షంగా అక్కసు వెళ్లగక్కింది.
‘‘సెవెన్ చానెల్, క్రికెట్ ఆస్ట్రేలియా గనుక.. ఇండియాలోని శక్తిమంతమైన క్రికెట్ అధికారుల నుంచి తమ ప్రయోజనాలను కాపాడుకోలేకపోతే.. పాంటింగ్, లాంగర్, ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డానియల్ వెటోరీ సైతం సౌదీ అరేబియాకు వెళ్లే పరిస్థితి ఉంది.
అక్కడి జెద్దా నగరంలో ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంటూ.. ఆటగాళ్ల కోసం వీళ్లంతా కార్డులు చూపిస్తూ మనకు కనిపిస్తారు. అప్పటికి తొలి టెస్టు ముగింపునకు వస్తుంది’’ అని ‘ది ఏజ్’ పేర్కొంది.
నేను కోహ్లిని అవమానించలేదు: పాంటింగ్
ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వ్యాఖ్యలపై రిక్కీ పాంటింగ్ స్పందించాడు. తానేమీ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని అవమానించలేదని.. ఆస్ట్రేలియా గడ్డపై అతడు ఫామ్‌లోకి రావాలని మాత్రమే ఆశించానన్నాడు. ఏదేమైనా కోచ్‌గా గౌతీ తన జట్టును డిఫెండ్ చేసుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.
కాగా కోహ్లి గత ఐదేళ్లలో కేవలం రెండే టెస్టు సెంచరీలు చేయడం ఏమిటని పాంటింగ్ విమర్శించగా.. మీడియా వేదికగా గౌతీ అతడికి కౌంటర్ ఇచ్చాడు. భారత క్రికెట్‌తో పాంటింగ్‌కు ఏం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతగా కావాలంటే.. ఆసీస్ ఆటగాళ్ల ఆట తీరును పరిశీలించుకోవాలని హితవు పలికాడు.
చదవండి: BGT 2024: అతడి బ్యాటింగ్ అద్భుతం.. భారత తుదిజట్టులో చోటివ్వాల్సిందే: ఆసీస్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment