మోర్తాడ్: ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన తెలుగు కార్మికులను అక్కడి కంపెనీలు మోసం చేయడంతో లేబర్ మానిటరింగ్ రిక్రూట్‌మెంట్ అథారిటీ (ఎల్‌ఎంఆర్‌ఏ)ని ఆశ్రయించారు. అయితే ఏడాది సీనియార్టీ ఉన్న కార్మికులకు మాత్రమే తాము ఇతర కంపెనీల్లో పని చూపగలమని, తక్కువ సీనియార్టీ ఉన్న కార్మికుల విషయంలో ఏమీ చేయలేమని ఎల్‌ఎంఆర్‌ఏ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో కార్మికులు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది.
ఇప్పటికే లక్షలు వెచ్చించి బహ్రెయిన్ వచ్చిన తాము మళ్లీ కోర్టులో కేసు వేయాలంటే మరింత అప్పు చేయాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కడప, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన దాదాపు 126 మంది కార్మికులు 4 నెలల క్రితం బహ్రెయిన్ వెళ్లారు. అక్కడి అట్లాస్, టీఎంఎస్ కన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో పని చేస్తున్నారు. అయితే బండెడు చాకిరీ చేయించుకున్న కంపెనీ యాజమాన్యం వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసింది.
బహ్రెయిన్‌లో ఒక కంపెనీలో పని చేస్తూ మరో కంపెనీకి మారాలంటే ఎల్‌ఎంఆర్‌ఏను ఆశ్రయిస్తేనే మార్గం దొరుకుతుంది. కాగా బహ్రెయిన్ కార్మిక చట్టాల ప్రకారం ఏడాది సర్వీసు ఉన్న కార్మికులకే మరో కంపెనీలో పని చూపించడానికి ఎల్‌ఎంఆర్‌ఏ చర్యలు తీసుకుంటుంది. ఏడాది కంటే తక్కువ సర్వీసు ఉన్న కార్మికులు కోర్టును ఆశ్రయించాల్సిందే. ఒకవేళ కోర్టుకు వెళ్లకుండా సొంతంగా పనిచూసుకుంటే చట్టరీత్యా నేరం అవుతుంది. అలా చేస్తే జైలు పాలు కావాల్సిందే. కాగా, అట్లాస్, టీఎంఎస్ కంపెనీల్లో పని చేస్తున్న కార్మికులను ఎల్‌ఆర్‌ఎంఏ ఆదరించకపోవడం, కోర్టును ఆశ్రయించాలంటే సొంతంగా లాయర్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి రావడంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
కార్మికులను ఆదుకోని లేబర్ అథారిటీ
Published Fri, Jun 26 2015 4:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM
Advertisement
Advertisement