బత్తుల వరలక్ష్మి (ఫైల్ ఫొటో)
పెదపట్నం (మామిడికుదురు): జీవనోపాధి కోసం బెహరైన్ వెళ్లిన పెదపట్నం అగ్రహారానికి చెందిన అవివాహిత బత్తుల వరలక్ష్మి(27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గత ఏడాది డిసెంబర్ 18న వరలక్ష్మి మృతి చెందినా కుటుంబ సభ్యులకు ఈ సమాచారం మంగళవారం అందడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. బెహరైన్‌లో పని చేస్తున్న విజయవాడకు చెందిన మహిళ ఫోన్ చేసి వరలక్ష్మి మరణ సమాచారాన్ని ఆమె కుటుంబం సభ్యులకు తెలిపింది. తమతో చివరి సారిగా డిసెంబర్ 8న ఫోన్‌లో మాట్లాడిందని తరువాత ఆమె నుంచి తమకు ఏవిధమైన సమాచారం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. రాజోలు మండలం చింతలపల్లికి చెందిన ఏజంట్ గుబ్బల లక్ష్మి అలియాస్ బండారు లక్ష్మి ఆమెను బెహరైన్ తీసుకు వెళ్లిందని చెబుతున్నారు.
వరలక్ష్మి నుంచి ఏవిధమైన సమాచారం లేకపోవడంతో ఏజెంట్‌ను సంప్రదించగా తమకు తప్పుడు సమాచారం చెబుతూ వచ్చిందని వాపోతున్నారు. వరలక్ష్మి మరణించిందన్న సమాచారం తెలిసిన తర్వాత ఆమెను నిలదీయగా వరలక్ష్మి మృతి చెందిందని ధ్రువీకరించిందన్నారు. వరలక్ష్మి తండ్రి సత్యనారాయణమూర్తి, తల్లి పెద్దిలక్ష్మి ఇద్దరూ కూలీలే. వీరికి ముగ్గురు కుమార్తెలు. కుటుంబ పోషణ భారాన్ని తనపై వేసుకున్న పెద్ద కుమార్తె వరలక్ష్మి గత ఏడాది ఏప్రిల్ 3న బెహరైన్ వెళ్లింది. ఆమె చెల్లెళ్లు శ్రీవాణి, శ్రీవేణి. వీరిలో శ్రీవేణికి గత ఏడాది జూలై 6న వివాహం జరిపించారు. తండ్రి సత్యనారాయణ మూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వరలక్ష్మి చనిపోయిందన్న సమాచారం తెలిసిన వెంటనే నేషనల్ వర్క్స్ వెల్ఫేర్ ట్రస్టు సభ్యుడు నల్లి శంకర్ ద్వారా ఇండియన్ ఎంబసీని సంప్రదించామని వరలక్ష్మి చిన్నాన్న బత్తుల అశోక్‌కుమార్ తెలిపారు. వరలక్ష్మి మృతదేహాన్ని స్వగ్రామం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇండియన్ ఎంబసీ ద్వారా దీనికి ప్రతిగా తమకు సమాచారం వచ్చిందని అశోక్‌కుమార్ చెప్పారు. బెహరైన్ పంపించేందుకు ఏజెంట్ రూ.రెండు లక్షలు తీసుకుందని, ఇంకా నగదు ఇవ్వాలని ఇబ్బంది పెడుతోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏజంట్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment