telangana overseas manpower company
-
ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు
ఆర్మూర్: తెలంగాణ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రవేశపెట్టిన టామ్‌కామ్ (TOMCOM) ద్వారా ఇజ్రాయెల్ (Israel) నిర్మాణ రంగంలో ఉపాధి కోసం వెళ్లిన నిరుద్యోగులు.. అక్కడ పనులు దొరక్క తీవ్రఇక్కట్లు పడుతున్నారు. ఇజ్రాయెల్ లోని నిర్మాణరంగంలో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు చైనాకు చెందినవారు కావడంతో భారతీయ కార్మికులు అనగానే పనులు లేవంటూ తిప్పి పంపుతున్నారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మాణ రంగంలో మల్టిపుల్ నైపుణ్యాలు (Multiple Skills) లేని కారణంగానే వారికి పనులు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. సమస్య తీవ్రతను ఇజ్రాయెల్‌లోని భారత రాయబార సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళితే వారు కూడా చేతులు ఎత్తేసినట్టు సమాచారం.తాము పని కల్పించలేమంటూ కార్మికులే పని వెతుక్కోవాలని వారు సూచిస్తున్నట్టు బాధితులు వాపోతున్నారు. కార్మికులు వెళ్లిన కన్స్ట్రక్షన్ కంపెనీ పరిధిలో పనులు దొరకని పక్షంలో ఆ కంపెనీని వదిలి బయటకు వెళ్లి రెఫ్యూజీలుగా (Refugees) పని చేసుకుందామంటే ఇజ్రాయెల్ దేశ చట్టాలు కఠినంగా ఉన్నాయి. దీంతో ఆ అవకాశమే లేకుండా పోయింది.పాలస్తీనాకు బ్రేక్ వేయడంతో... ఇజ్రాయెల్‌లో పాలస్తీనాకు చెందినవారు అధిక సంఖ్యలో ఉపాధి పొందేవారు. అయితే ఈ రెండు దేశాల మధ్య పోరు కొనసాగుతుండటంతో ఇజ్రాయెల్.. పాలస్తీనా వలస కార్మికుల రాకపోకలకు బ్రేక్ వేసింది. ఫలితంగా ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత తీవ్రమైంది. ఇజ్రాయెల్ పౌరులు ఎక్కువగా ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. దీంతో ఆ దేశంలో కార్మికులుగా పనిచేసేందుకు పరాయి దేశస్తుల అవసరం ఎంతో ఉంది.ఈ నేపథ్యంలో వలస కార్మికులకు దండిగా వీసాలను జారీ చేసేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇజ్రాయెల్‌లో వ్యవసాయ, భవన నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆ దేశం జారీ చేస్తున్న వీసాల ప్రక్రియలో దళారుల జోక్యాన్ని నివారిస్తూ టామ్ కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్) చర్యలు తీసుకుంది. టామ్‌కామ్ ఇజ్రాయెల్ వీసాలకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించి తెలంగాణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు వీసాలు కేటాయించి ఇజ్రాయెల్‌కు పంపించారు. నిర్మాణ రంగంలో అనుభవం లేని కార్మికులు హైదరాబాద్‌లోనే టామ్‌కామ్, న్యాక్ (నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్) సంస్థల ఆధ్వర్యంలో వలస కార్మికుల రిక్రూట్ చేపట్టారు. అయితే ఈ కార్మికులకు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం పెద్దగా లేని కారణంగా ఇజ్రా యెల్లో కాంట్రాక్టర్లు వారిని నిరాకరిస్తున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చిన కార్మికులు సివిల్, కరెంట్, టైల్స్, ప్లంబింగ్ లాంటి మల్టిపుల్ పనులు చేయడంలో నిష్ణాతులుగా ఉండటంతో అక్కడి కాంట్రాక్టర్లు వారికే ప్రాధాన్యం ఇస్తూ భారతీయ కార్మికులకు పనిఇవ్వడం లేదని తెలుస్తోంది.చదవండి: ‘అనాబ్ – ఎ–షాహి’ ఎక్కడోయి ?పరిస్థితి ఇలాగే ఉంటే కుటుంబపోషణ కోసం అప్పులు చేసి దేశం కాని దేశంలో తాము ఇక్కట్లు పడటమే కాకుండా తమ కుటుంబ సభ్యులను రోడ్డు మీదకు తెచ్చినట్టు అవుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇజ్రాయెల్‌లోని రాయబార సంస్థ అధికారులతో మాట్లాడి తమకు పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
సౌదీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వేతనం 50 వేలు!
రంగారెడ్డి జిల్లా: సౌదీ అరేబియాలోని ప్రఖ్యాత ఆస్పత్రుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి సోమ, మంగళవారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ అనుబంధ సంస్థ టామ్‌కమ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ) ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని సంస్థ ఎండీ కేవై నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. అనస్తీషియా టెక్నీషియన్, నర్సు, అసిస్టెంట్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, మెడికల్ కోడర్, ఎక్స్‌రే టెక్నీషియన్, ఫిజియోథెరపీ టెక్నీషియన్ తదితర కొలువుల్లో 156 ఖాళీలున్నాయన్నారు. ఈ ఉద్యోగాలకు సగటున రూ.50 వేల వేతనంతోపాటు నివాసం, భోజనం, రవాణా వసతి సౌకర్యాలన్నీ అభ్యర్థులను ఎంపిక చేసుకున్న కంపెనీ భరిస్తుందన్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు పాస్‌పోర్టు లేనప్పటికీ.. సదరు కంపెనీ ఈ సౌకర్యాన్ని సమకూరుస్తుందని, అర్హతలున్న అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో మెహిదీపట్నంలోని జీ పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో సంప్రదించాలని ఆయన సూచించారు.