
చిత్తూరు పోలీసు శాఖలో జరగాల్సిన బదిలీల కౌన్సెలింగ్‌లో అయినవారిని అందలం ఎక్కించడానికి కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారా..? ఇందులో భాగంగానే ఐదు ప్రధాన విభాగాలను అడగొద్దంటూ సిబ్బందికి ఆప్షనల్ ఫారమ్‌లో సూచించారా..? ఈ లెక్కన పదోన్నతి పొందిన సిబ్బందికి నిర్బంధ బదిలీ చేస్తున్నారా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ బదిలీ కావడంతో.. పోలీసుశాఖలో ‘కీ’లకంగా ఉన్న ఓ అధికారి బదిలీల వ్యవహారంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి, చిత్తూరు అర్బన్: పోలీసుల బదిలీల కౌన్సెలింగ్ ఉత్తర్వులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్షనల్స్‌గా కొన్ని విభాగాలను ఎంచుకోకూడదన్న నిబంధనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ శాఖలను ఎందుకు ఎంచుకోకూడదు? ఎవరికోసం ఆ నిబంధన పెట్టారు.. ఇంతకీ అక్కడ ఏముంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందికి పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. చిత్తూరు పోలీసు జిల్లాలో 104 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా.. 46 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతులు లభించాయి. వాస్తవానికి వీరికంతా పదోన్నతి వచ్చిన వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించి ఏ స్టేషన్లలో ఖాళీ ఉంటే అక్కడ పోస్టింగ్‌లు ఇవ్వాలి. అప్పటికింకా ఎన్నికల హడావుడి కూడా లేదు. కనీసం ఈ ఏడాది జనవరిలో బదిలీలు చేసుంటే సరిపోయి ఉండేది. అలా కాకుండా సార్వత్రిక ఎన్నికలు మొత్తం పూర్తయ్యాక పదోన్నతి పొందిన 150 మంది సిబ్బందికి రెండు రోజుల్లో కౌన్సెలింగ్ నిర్వహించడానికి ఓ అధికారి తహతహలాడుతున్నారు. ఇప్పటికే విక్రాంత్ పాటిల్ స్థానంలో చిత్తూరు ఎస్పీగా అప్పలనాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీచేసింది. ఇలాంటి తరుణంలో బదిలీల కౌన్సెలింగ్ పూర్తిచేయాలని చూడడం విమర్శలకు దారితీస్తోంది.
ఇంతకూ ఏముందో అక్కడ..?
బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సిన 150 మంది సిబ్బందికి జిల్లా పోలీసుశాఖ నుంచి ఓ ప్రొఫార్మా అందింది. ఇందులో సొంత ఊరు కోరుకోకూడదనే ఓ అంశాన్ని ఉంచారు. ఇది బాగానే ఉంది. ఎక్కడకు బదిలీ కావాలో అయిదే స్టేషన్లను ఎంచుకోవాలి సూచించారు. ఇది కూడా బాగానే ఉంది. అయితే స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ), డీసీఆర్‌బీ (క్రైమ్ రికార్డ్స్), ఐటీ కోర్, డీటీసీ, పోలీస్ కంట్రోల్ రూమ్‌లను ఆప్షనల్‌గా ఎంచుకోకూడదని చెప్పడం వివాదానికి తెరలేపినట్లయ్యింది. అంటే ఈ ఐదు విభాగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నవారికి బదిలీలు ఉండవా..? చేయకూడదా..? మరెవరూ ఇక్కడ పనిచేయకూడదా..? వాటికి అంత ప్రత్యేకత ఏముంది..? అంటూ కడుపుమండిన సిబ్బంది అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పైగా ఈ ఐదు విభాగాల్లో ఓ సామాజికవర్గానికి చెందిన సిబ్బంది ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. గత ఐదేళ్లలో అయితే టీడీపీ నేతలు చెప్పిందే అన్నట్లు కొందరు నడుచుకుని రూ.లక్షలు కూడబెట్టుకున్నారు. అలాంటి వారిని కదిలించకుండా బదిలీల్లో వీటిని కోరుకోకూడదని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు అడుగుతున్నారు.
పాతుకుపోయిన వారి పొజిషన్ ఏంటో..!
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న సిబ్బందిని కదిలించడానికి ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. గత ఏడాది కూడా ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి బదిలీల కౌన్సెలింగ్ చేపట్టలేదు. కొన్నిచోట్ల అటాచ్‌మెంట్ల పేరిట కాలం నెటుకొచ్చేవారు ఉన్నారు. పదోన్నతి పొందిన 150 మంది సిబ్బందికి స్టేషన్లు కేటాయించాలంటే లాంగ్ స్టాండింగ్, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆయా స్థానాల్లో కదిలించాలి. అప్పుడు ఏర్పడే ఖాళీలను కౌన్సెలింగ్‌లో ఉంచాలి. కనీసం స్టేషన్ల వారీగా ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని మంజూరయ్యాయనే వివరాలు కూడా చెప్పకుండా ఏకపక్షంగా బదిలీలు చేయడంపై సొంత శాఖలోని సిబ్బంది అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment