బదిలీపై వెళ్లిన డీఈఓ విజయకుమారి, ఇన్‌చార్జి డీఈఓగా నియమితులైన విజయలక్ష్మి
జిల్లాలో కలెక్టర్ నుంచి మొదలుకొని మండల స్థాయి ఎంఈఓల వరకు అందరూ అంతటా ఇన్‌చార్జిల పాలనే. ఎక్కడ కూడా రెగ్యులర్ అధికారులు కనిపించరు. ముఖ్యంగా జిల్లా విద్యాధికారులను మార్చుతున్న తీరు జిల్లా ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. కేవలం 16 నెలల్లో ఐదుగురు ఇన్‌చార్జి డీఈఓలు మారారంటే అర్థం చేసుకోవచ్చు జిల్లాలోని విద్యావ్యవస్థ ఏ విధంగా ఉందో? దీంతో పాటు జిల్లాలోని 20 మండలాలకు ఎక్కడా కూడా రెగ్యులర్ ఎంఈఓలు లేరు. ఉన్న తొమ్మిది మంది ఎంఈలతో 20 మండలాలను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల డీఆర్డీఓ పీడీ కూడా దీర్ఘకాలిక సెలవులపై వెళ్లారు. ఇలా ఇన్‌చార్జిలతో జిల్లా పాలనంతా అస్తవ్యస్తంగా తయారైంది. వేగంగా మారుతున్న జిల్లా విద్యాధికారులపై‘సాక్షి’ ప్రత్యేక కథనం..
సాక్షి,మెదక్: జిల్లాలోని విద్యార్థుల చదువులతో సర్కార్ ఆటలాడుతోంది. జిల్లా విద్యాధికారి పోస్టు మ్యూజికల్ చైర్ ఆటలాగా మారింది. ఏ క్షణాన ఎవరు వస్తారో..? ఏ రోజుకు ఎవరు మారుతారో ? తెలియని పరిస్థితి. పరీక్షల వేళ రాష్ట్ర విద్యాశాఖ చేస్తున్న బదిలీ ప్రయోగాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నెల 17న సంగారెడ్డి ఇన్‌చార్జి డీఈఓ విజయకుమారిని మెదక్ జిల్లా పూర్తిస్థాయి డీఈఓగా నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ 24 గంటల్లోనే ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకొని సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా కేవలం 16 నెలల కాలంలో 5మంది డీఈఓలు నియామకం కావడంతో ఒక్కో డీఈఓ పదవి కాలం కేవలం 3 నెలలకే మించి లేదు. వచ్చిన వారు కనీసం జిల్లాలోని పాఠశాలల పరిస్థితిని అవగాహన చేసుకునేలోగానే వారిపై బదిలీ వేటు పడుతోంది.దీంతో జిల్లా విద్యాశాఖలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
పనితీరుపై అసంతృప్తి..
జిల్లా కేంద్రం కావాలన్న ఇక్కడి ప్రజల 50 యేళ్ల పోరాటం 10 అక్టోబర్ 2016లో సాకారమైంది. దీంతో జిల్లాకు మొట్ట మొదటి డీఈఓగా రేణుకదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె నూతన జిల్లా ఏర్పడిన రోజునే పదవి బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేక నెలరోజుల వ్యవధిలోనే దీర్ఘకాలికపై సెలవుపై వెళ్లారు. అనంతరం 2016 అక్టోబర్ 27 నుంచి సిద్దిపేట డీఈఓ కృష్ణారెడ్డికి జిల్లా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆయన కాలంలోనే అప్పటి పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. 10 నెలల అనంతరం ఆయన రిటైర్మెంట్ అయ్యాడు. దీంతో ఆయన స్థానంలో సరోజినిదేవిని ఇన్‌చార్జి డీఈఓగా నియమించారు. ఆ కొద్దిరోజుల్లోనే కలెక్టర్ ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తరుణంలో సరోజిని ఆమె మాతృసంస్థకు వెళ్లిపోయారు. అనంతరం సంగారెడ్డి ఇన్‌చార్జి డీఈఓ విజయకుమారికి మెదక్ జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఈనెల 17న సిద్దిపేట డీఈఓ విజయలక్ష్మిని సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమిస్తూ సంగారెడ్డి ఇన్‌చార్జి విజయకుమారికి మెదక్‌జిల్లా డీఈఓగా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ మెదక్ జిల్లాలో పనిచేయడం ఇష్టంలేని విజయకుమారి కేవలం 24గంటల్లోనే తన బదిలీని రద్దు చేయించుకొని మేడ్చల్ డీఈఓగా పోస్టింగ్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సంగారెడ్డి డీఈఓ విజయలక్ష్మికి మళ్లీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే మెదక్ బాధ్యతలను స్వీకరించేందుకు ఆమె ఇష్టపడటం లేదని సమాచారం.
ఒక్కోరికి మూడు మండలాలు..
అలాగే మెదక్‌లో 20 మండలాలు ఉండగా ఒక్క రెగ్యులర్ ఎంఈఓ కూడా లేకపోగా 9మంది ఇన్‌చార్జి ఎంఈఓలు 20 మండలాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో ఒక్కో ఎంఈఓగా మూడు మండలాల అదనపు బాధ్యతలు ఉండటంతో రెంటికి చెడ్డ రేవడిగా వారి పరిస్థితి మారుతోంది. ఇటీవల కమిషనర్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కిషన్ తీసుకున్న నిర్ణయాలు నిలకడలేని నీటిమీది రాతలుగా మారుతున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని టీచర్లు సెలవులు తీసుకోవాలంటే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, ఎంఈఓల అనుమతి తప్పనిసరి అని జీఓ నం.83 విడుదల చేశారు. కానీ ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలతో ఆ జీఓను వెనక్కి తీసుకున్నారు. అలాగే మోడల్ స్కూటీచర్ల ఇంక్రిమెంట్ మంజూరీ అధికారాలు సంబంధిత ప్రిన్సిపాల్ కాకుండా డీఈఓలకే ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ ఉపాధ్యాయ సంఘాల ఆందోళనతో వీటిని సైతం ఉపసంహరించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈనెల 17న జారీ చేసిన డీఈఓల బదిలీ ఉత్తర్వులు సైతం 24గంటల్లోనే మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం.
జిల్లాకు ఇన్‌చార్జిలే దిక్కా?
మెదక్ జిల్లాలో మొదటి నుంచి ఇన్‌చార్జిల పాలనే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన డీఈఓలంతా ఇన్‌చార్జిలే కావడం గమనార్హం. ప్రస్తుతం కలెక్టర్ పోస్టు కూడా ఇన్‌చార్జితోనే కొనసాగుతుంది. డీఆర్డీఏ పీడీ కూడా ఇటీవల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇల్లా పాలనంతా ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు.
పదో తరగతి పరీక్షలు ఎలా?
జిల్లాకు పూర్తిస్థాయి విద్యాశాఖ అధికారి లేకుండా పదో తరగతి పరీక్షలు నిర్వహించడం కత్తిమీద సాములాంటిదే. మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో ఫిబ్రవరి నెల విద్యార్థులకు అత్యంత కీలకమైంది. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ లోగడ రూపొందిం చిన ప్రణాళికను పక్కాగా అమలు చేయాల్సిన తరుణమి ది. కానీ రెండు జిల్లాలకు ఒకే డీఈఓ ఉండటంతో రెండు పడవలపై సాగే ప్రయాణం సత్ఫలితాలు ఇచ్చే అవకాశం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment