అటవీ శాఖలో అవినీతి వృక్షం | Transfers In The Forest Department Have Become Controversial | Sakshi
Sakshi News home page

అటవీ శాఖలో అవినీతి వృక్షం

Published Mon, Jul 15 2019 1:05 PM | Last Updated on Mon, Jul 15 2019 1:05 PM

Transfers In The Forest Department Have Become Controversial - Sakshi

అటవీ శాఖలో బదిలీలు వివాదాస్పదంగా మారాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన అటవీ శాఖలోని ఒక ఉన్నతాధికారి బదిలీల్లో చేతివాటం ప్రదర్శించారు.     గత ప్రభుత్వం వెన్నుదన్నుతో ఐదేళ్లు ఒకే స్థానంలో విధులు వెలగబెట్టిన ఆ అధికారి వసూళ్లకు అడ్డూ అదుపులేకుండా పోయింది. గతంలో తిరుపతి డివిజన్‌లో పనిచేసిన ఆ అధి కారికి చిత్తూరు డివిజన్‌లో విధులు నిర్వహించిన అనుభవం ఉంది. దీంతో ఆ శాఖపై పూర్తిస్థాయి పట్టు సాధించారు. ఐదేళ్ల కాలంలో ఆయన అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోయిందనే ప్రచారముంది.

సాక్షి, తిరుపతి/పుత్తూరు: రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఇక స్థానచలనం తప్పదని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకున్నారు. ఇంతలో బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇదే అదనుగా భావించి డివిజన్‌ పరిధిలోని సిబ్బందిని ఇష్టారాజ్యంగా బదిలీలు చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కేవలం నెల క్రితం విధుల్లో చేరిన సిబ్బందిని సైతం బదిలీ చేసినట్లు సమాచారం. ముడుపులే ప్రామాణికంగా ఆ అధికారి బదిలీలకు తెరతీయడంతో సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం బది లీలను రద్దు చేసే అవకాశాలున్నాయి.

చేతులు మారిన రూ.30 లక్షలు
చిత్తూరు పశ్చిమ డివిజన్‌లో ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడం ద్వారా సదరు ఉన్నతాధికారి రూ.30 లక్షలు దం డుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డివిజన్‌ పరిధిలోని బీట్‌ ఆఫీసర్లు, సెక్షన్‌ ఆఫీసర్లు, గార్డులు, వాచర్లతో చిత్తూరులో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులనే బదిలీ చేయాల్సి ఉంది. ఆ అధికారి ప్రతి ఉద్యోగి నుంచి బదిలీలకు సంబంధించి మూడు ఆప్షన్లు ఇవ్వమన్నారు. కేవలం నెల నుంచి సంవత్సరం క్రితం విధుల్లో చేరిన ఉద్యోగులను సైతం ఒత్తిడి చేసి మరీ ఆప్షన్లు తీసుకున్నారు. తన చేతికి మట్టి అంటకుండా  దిగువస్థాయిలో నాయకులుగా చెలామణి అవుతున్న కొందరు ఉద్యోగులను రంగంలోకి దింపారు. వారి ద్వారా ముడుపుల బాగోతానికి తెరదీశారు. ఒక్కొక్కరి బది లీకి సంబంధించి రూ.25– 50 వేలు  వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఆది నుంచి వివాదాస్పదమే
గతంలో కుప్పం రేంజ్‌ అధికారిగా పనిచేస్తున్నప్పటి నుంచి ఆ అధికారిపై అవినీతి ఆరోపణలున్నట్లు సమాచారం. అక్కడి నుంచి పదోన్నతిపై తిరుపతి వైల్డ్‌లైఫ్‌ విభాగానికి బదిలీ కాగా, ఎర్రచందనం స్మగ్లర్లతో పరిచయాలు ఉన్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందా యి. 2014వ సంవత్సరం ఎన్నికలకు ముందు ఉన్నతస్థాయిలో పైరవీలు చేసుకుని గతంలో రేంజర్‌గా పనిచేసిన చిత్తూరు సబ్‌ డివిజన్‌కే ఉన్నతాధికారిగా బదిలీ చేయించుకున్నట్లు సమాచారం. కుప్పంలో పనిచేసినప్పటి రాజకీయ సంబంధాలు, సామాజిక నేపథ్యాన్ని చక్కగా ఉపయోగించుకున్న అధికారి అవినీతికి అర్రులు చాచినట్లు సమాచారం.

డివిజన్‌ పరిధిలోని పుంగనూరు రేంజ్‌లో నిబంధనలకు విరుద్ధంగా క్వారీలకు అనుమతిచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటవీ శాఖకు సంబంధించిన భూముల్లో నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ క్వారీలకు అనుమతిస్తూ ఎన్‌ఓసీ జారీ చేసినట్లు ఉన్నతా«ధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రస్తుతం శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఐదేళ్ల కాలంలో రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అధికారి చేస్తున్న అవినీతి అక్రమాలపై ఆ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటం గమనార్హం. 

ఒకే తేదీతో రెండు ఎస్‌ఓలు
బదిలీల్లో భాగంగా ఈనెల 10వ తేదీన అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్లకు సంబంధించి ఎస్‌ఓ (శాంక్చన్‌ ఆర్డర్‌) ఇచ్చిన ఉన్నతాధికారి ఇదే తేదీతో మరో ఎస్‌ఓను కూడా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే తేదీతో రెండు ఎస్‌ఓలు విడుదల కావడంతో ఏఎస్‌వో ప్రకారం బదిలీలు వర్తిస్తాయనే విషయం తెలియక ఉద్యోగులు తికమకపడుతున్నారు. 
► ఒక ఎస్‌ఓ ప్రకారం ఒక అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ను చిత్తూరు వెస్ట్‌ రేంజ్‌ నుంచి పుంగనూరు రేంజ్‌లోని వల్లిగట్ల బీట్‌కు బదిలీ చేశారు. మరో ఎస్‌ఓలో అదే ఉద్యోగిని పుంగనూరు రేంజ్‌లోని కందూరు బీట్‌కు బదిలీ చేశారు.

నిబంధనలకు పాతరేస్తూ...
డివిజన్‌ పరిధిలో జరిగిన బదిలీల్లో నిబంధనలకు పూర్తిగా పాతరేసినట్లు తెలుస్తోంది. ముడుపులివ్వని ఉద్యోగులను ఇష్టారాజ్యంగా బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 నెల క్రితమే మదనపల్లె రేంజ్‌లో విధుల్లో చేరిన ఒక మహిళా ఉద్యోగిని పలమనేరు రేంజ్‌కు బదిలీ చేశారు. ఆ ఉద్యోగిని నెల వేతనం కూడా తీసుకోకముందే బదిలీ అయ్యింది.
 రెండేళ్ల క్రితం పుంగనూరు రేంజ్‌లో విధుల్లో చేరి ప్రస్తుతం మెడికల్‌ సెలవుపై ఉన్న ఒక ఉద్యోగిని కుప్పం రేంజ్‌కు బదిలీ చేశారు.
 గత ఏడాది మదనపల్లె రేంజ్‌లో విధుల్లో చేరిన మరో ఉద్యోగిని పీలేరు సామాజిక అడవుల పెంపకం విభాగానికి బదిలీ అయ్యారు.
 ఆరు నెలల క్రితం మదనపల్లె రేంజ్‌లోని ఒక బీట్‌కు బదిలీపై వచ్చిన మ హిళా ఉద్యోగిని అదే రేంజ్‌ పరిధిలోని మరో బీట్‌కు బదిలీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement