గుంటూరు: ఎక్కడైనా సీనియర్లకు పదోన్నతిలో ప్రాధాన్యం ఇవ్వడం పరిపాటి. రాష్ట్ర వ్యవసాయశాఖ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో తీసుకున్న నిర్ణయాలు ఆ శాఖను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేశాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడుగురు జాయింట్ డెరైక్టర్ కేడర్ అధికారులు ఉన్నప్పటికీ, ఎనిమిది జిల్లాల్లో జేడీఏ పోస్టులను ఖాళీగా ఉంచి డిప్యూటీ డెరైక్టర్లను ఇన్‌ఛార్జి జేడీఏలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి జాబితాలో ఉన్న డిప్యూటీ డెరైక్టర్లు రింగ్‌గా ఏర్పడి వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను ప్రభావితం చేసి జేడీఏ పోస్టును ముందుగానే రిజర్వు చేసుకున్నారని, ఇందుకు భారీగా అడ్వాన్సులు చెల్లించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ బదిలీల ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలకూ ప్రాధాన్యం ఇవ్వలేదు. అర్హత కలిగిన ఒక అధికారికి ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా, వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో చర్చనీయాంశమైంది.
జిల్లాల వారీగా జరిగిన బదిలీల ప్రక్రియను పరిశీలిస్తే..
-శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ డెరైక్టర్ అప్పలస్వామిని ఇన్‌ఛార్జి జేడీఏగా నియమించారు. పదోన్నతి జాబితాలో ఉన్న అప్పలస్వామిని త్వరలో రెగ్యులర్ జేడిఏగా అక్కడే కొనసాగించడానికి ప్లాన్ రూపొందించినట్టు అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు.
-విజయనగరం జేడీఏగా పనిచేస్తున్న డి.ప్రమీలను శ్రీకాకుళం ఆత్మా పీడీగా బదిలీ చేసి, ఆ పోస్టులో విశాఖపట్నంలో డీడీగా పనిచేస్తున్న లీలావతిని విజయనగరం జేడీఏ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు.
-తూర్పుగోదావరి జిల్లాలో 15 ఏళ్లకుపైగా ఏఓగాను, ఏడీఏగాను, 5 ఏళ్లు డీడీగా పనిచేస్తున్న విజయకుమార్‌ను బదిలీ చేయకుండా ఇన్‌ఛార్జి జేడీఏగా నియమించారు. ఆయన కూడా పదోన్నతి జాబితాలో ఉండటంతో అక్కడే పదోన్నతి పొంది ఆ జిల్లాకు జేడీఏగా నియమించడానికి ఈ బదిలీ ఉత్తర్వులు జరిగినట్టు తెలుస్తోంది.
-కృష్ణాజిల్లాలో 15 ఏళ్లు ఏఓ, ఏడీఏగానూ, ఆరేళ్లకుపైగా డీడీఏగా పనిచేస్తున్న బాలూనాయక్‌ను బదిలీ చేయకుండా జేడీఏగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
-పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ఏళ్ల నుంచి డిడిఏగా పనిచేస్తున్న కృపాదాస్‌ను గుంటూరు జిల్లాకు బదిలీ చేసి జేడీఏగా అదనపు బాధ్యతలు కల్పించారు.
-గుంటూరు జేడీఏ ఆఫీసులో 6 ఏళ్లుగా డీడీఏగా పనిచేస్తున్న పద్మావతిని వేరే జిల్లాకు బదిలీ చేయకుండా అదే జిల్లాలో ఆత్మా పీడీ ఆఫీసుకు బదిలీ చేశారు.
-గుంటూరు జిల్లా బాపట్ల డీడీఏగా పనిచేస్తున్న వి.మురళీకృష్ణను ప్రకాశం జిల్లాకు బదిలీ చేసి జేడీఏగా అదనపు బాధ్యతలు కల్పించారు. -చిత్తూరు జిల్లాలో ఎనిమిదేళ్లకు పైగా ఏడీఏగా, డీడీఏగా పనిచేస్తున్న నిర్మల కుమార్‌ను బదిలీ చేయకుండా జేడీఏగా అదనపు బాధ్యతలు కల్పించారు.
-అనంతపురం జిల్లాలో ఐదేళ్లుగా డీడీఏగా పనిచేస్తున్న శ్రీరామమూర్తిని బదిలీ చేయకుండా అక్కడే ఉంచి జేడీఏగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు రెగ్యులర్ జేడీఏలుగా కొనసాగుతున్న సీనియర్ అధికారులను ఆత్మా పీడీలుగా బదిలీ చేశారు. ఈ తరహా బదిలీలు గత 30 ఏళ్లకు పైగా వ్యవసాయశాఖ చరిత్రలో జరగలేదనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.
వ్యవసాయ శాఖలో బదిలీల కలకలం
Published Fri, Aug 28 2015 10:57 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement