
అదేదో చంద్రబాబు వద్దే తేల్చుకుందాం: అయ్యన్న
బదిలీల విషయంలో టీడీపీ నాయకులకు, ఉన్నతాధికారులకు మధ్య ఇన్నాళ్లూ నడిచిన ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారింది. విశాఖ జిల్లాలో తాము చేయించిన బదిలీని ఎందుకు నిలిపివేయించారంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి, సీఎం ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రను టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి నిలదీశారు. అసలు తాము చేయించిన బదిలీని ఆపేందుకు మీరెవరంటూ మండిపడ్డారు. తాను ఈ విషయం ఏదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్దే తేల్చుకుందామంటూ ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు.
వాస్తవానికి ఇది ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్యపోరని తెలిసింది. విశాఖజిల్లాలో ఉన్న ఒక ఆర్డీవో బదిలీ విషయంలో సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు, మరో మంత్రి గంటా శ్రీనివాసరావుల మధ్య చెలరేగిన వివాదమే దీనంతటికీ కారణమైందని అంటున్నారు. తాను చేయించిన బదిలీని గంటా శ్రీనివాసరావు ఆపించడంతో.. ఒక్క అధికారిని కూడా బదిలీ చేయంచలేనా అంటూ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.
ఇంతకుముందు కూడా బదిలీల అంశం తెలుగుదేశం పార్టీలో కొంత ముసలానికి కారణమైంది. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ విషయంలో నేరుగా సీఎం చంద్రబాబుతోనే కొంత గొడవ పడ్డారు. తాను సిఫార్సు చేసిన బదిలీలు జరగకపోతే ఇక తనకు విలువ ఏముంటుందని కూడా అప్పట్పలో ఆయన నిలదీశారు.