అఖిలభారత సర్వీసు అధికారులే లక్ష్యంగా ఎర్రబుక్కు పైత్యం
బాబు తీరుపై దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్లు
రాజుని మించిన రాజభక్తి ప్రదర్శనలో మునిగి తేలుతున్న సీఎస్, డీజీపీలు.. పిచ్చోడి చేతిలో రాయిలా పాలన
నైతిక పతనంలో కొత్త రికార్డులు బద్దలుకొడుతున్న కూటమి ప్రభుత్వం
వల్లభాయ్ పటేల్ ప్రవచించిన ‘స్టీల్ ఫ్రేమ్’కు తూట్లు పొడిచే కుయత్నం
10 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్‌లకు అడుగడుగునా అవమానాలు.. 2 నెలలుగా పోస్టింగులు ఇవ్వని ప్రభుత్వం
ఐపీఎస్ అధికారులు రోజూ డీజీపీ ఆఫీసుకు రావాలంటూ మెమో
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వెయిటింగ్ హాల్లో ఉండాలని ఆదేశం
వాళ్లు అఖిలభారత సర్వీసు అధికారులు.. ప్రజాసేవను వృత్తిగా ఎంచుకుని ఉన్నతమైన లక్ష్యాలతో ఎన్నో కఠినపరీక్షలు గెలిచి ఈ అత్యున్నత సర్వీసుకు ఎంపికైనవారు. అలాంటి గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధ బాధ్యతలలో ఉన్న అధికారులను ఎలా చూడాలి? ఎవరి సామర్థ్యం ఏమిటో గుర్తెరిగి తగిన బాధ్యతలు అప్పగించడం ద్వారా మంచి ఫలితాలను సాధించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి.
కానీ చంద్రబాబు ప్రభుత్వం రూటు వేరు. నచ్చనివారికి నరకం చూపిస్తూ ఆనందించడం వారికి అలవాటు. అదిగో అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో బాగా పనిచేసిన ఓ పలువురు ఐఎఎస్ ఐపీఎస్‌లను ఎంచుకున్నారు. వారి ఆత్మగౌరవంపై ఆటవికంగా దాడిచేస్తున్నారు.. ఓ హోం గార్డుతోనో.. ఓ రౌడీషీటరుతోనో కిందిస్థాయి అధికారులు కూడా వ్యవహరించని రీతిలో డీజీ స్థాయి అధికారులనూ ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా అవమానిస్తోంది.
పోస్టింగ్ ఇవ్వకపోగా.. ఉదయం డీజీపీ ఆఫీసుకు వచ్చి సంతకం చేసి సాయంత్రం వరకు వెయిటింగ్ చేసి వెళ్లమంటున్నారు.. ఇందుకోసం ఏకంగా ఓ ఉత్తర్వు కూడా జారీ చేయడం చూసి యావత్ అఖిలభారత సర్వీసు అధికారులందరూ విస్తుపోతున్నారు. ఈ ఉన్మాద మెమో గురించి దేశమంతా చర్చించుకుంటోంది. ఇటువంటి దుర్మార్గమైన నిర్ణయం దేశ చరిత్రలో ఎవరూ తీసుకోలేదని మాజీ ఐపీఎస్ అధికారులు ప్రవీణ్‌కుమార్, స్వరణ్‌జిత్‌సేన్ వంటివారు వ్యాఖ్యానించారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి కక్షపూరిత రాక్షస పాలన కరాళ నృత్యం చేస్తోంది. ఓ పక్క ప్రజలపైనే టీడీపీ శ్రేణులు రాత్రీ పగలూ దాడులతో భయంకర వాతావరణాన్ని సృష్టిస్తుంటే.. ఇంకో పక్క ప్రభుత్వమే అధికారులపై పడింది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర కీలక అధికారులపై నారా లోకేశ్ విరచిత రెడ్ బుక్ రాజ్యాంగంతో విరుచుకుపడుతోంది. వెంటపడి వేధిస్తోంది. వారిపట్ల నిరంకుశంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తూ, అవమానాలకు గురిచేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది.
అఖిల భారత సర్వీసుల అధికారుల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఏపీలోని చంద్రబాబు కూటమి ప్రభుత్వ పోకడలపై జాతీయ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఏ పార్టీ అధికారంలో ఉందన్న దానితో సంబంధం లేకుండా ప్రభుత్వ విధానాలను అమలు చేయడం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి చోదక శక్తిగా వ్యవహరించేందుకు దేశంలో ప్రత్యేకంగా అఖిల భారత సర్వీసులకు రూపకల్పన జరిగింది. ఈ ఉన్నతాశయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోంది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోంది’ అని సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ఐపీఎస్ అధికారులకు పొస్టింగులు ఇవ్వకుండా వేధించడాన్ని వ్యతిరేకిస్తూ రిటైర్డు ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తన సోషల్ మీడియా లో పెట్టిన పోస్టు
దుష్ట సంప్రదాయానికి తెరతీసిన చంద్రబాబు
రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొంది, సీఎంగా బాధ్యతలు స్వీకరించక ముందే చంద్రబాబు దుష్ట సంప్రదాయాలకు తెరతీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డిని బలవంతంగా సెలవుపై పంపారు. అనంతరం ఏకంగా 10 మంది ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ అధికారులకు రెండు నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇంత కక్షపూరితంగా, నిరంకుశత్వంతో వ్యవహరించలేదు.
ప్రభుత్వం మారిన తరువాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం సహజమే. కొత్త ప్రభుత్వం తన ప్రాధాన్యతల ప్రకారం అధికారులకు పోస్టింగులు ఇస్తుంది. కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయమని కూడా ఆదేశిస్తుంది. ఆ తరువాత కొద్ది రోజులకే వారికి ఇతర ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చి, వారి సేవలను సద్వినియోగం చేసుకుంటుంది. అంతేగానీ ఏకంగా ఇన్నేసి రోజులు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టదు.
అపాయింట్‌మెంటూ ఇవ్వని బాస్‌లు
సాధారణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారి బాస్‌లైన సీఎస్, డీజీపీలను అపాయింట్‌మెంట్ అడిగి కలిసే వీలుంటుంది. తమ సర్వీసుకు సంబంధించిన సమస్యలు, ఇతరత్రా విషయాలను వారు సీఎస్, డీజీపీల దృష్టికే తీసుకువెళ్లాలి. వాటిని సరైన దృక్పథంతో పరిశీలించాల్సిన బాధ్యత సీఎస్, డీజీపీలపై ఉంది. కానీ సీఎం చంద్రబాబు చెప్పడంతో ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సీఎస్, డీజీపీ రెండు నెలలుగా అపాయింట్‌మెంటే ఇవ్వడం లేదు.
ఇక్కడితోనూ చంద్రబాబు రెడ్ బుక్ దాహం తీరలేదు. ఐపీఎస్ అధికారులను మరింతగా అవమానించాలని పట్టుబట్టారు. ఆ మేరకు టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ సీహెచ్ ద్వారకా తిరమలరావుకు ఆదేశాలు వెళ్లాయి. దాంతో డీజీపీ ఈ నెల 12న ఓ విభ్రాంతికరమైన మెమో జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న 23 మంది ఐపీఎస్ అధికారుల్లో 16 మందికి ప్రతి రోజూ డీజీపీ కార్యాలయానికి రావాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
‘ఉదయం 10 గంటలకు వచ్చి వెయిటింగ్ హాల్లో ఉన్న రిజిస్టర్‌లో సంతకం చేయాలని, సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండి, మళ్లీ ఆ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాలి’ అని ఆదేశించారు. రాష్ట్రంలో అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన డీజీపీ కేవలం రాజకీయ ఒత్తిడితో సాటి అధికారులను ఈ విధంగా ఆదేశించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వెయిటింగ్ మెమో.. ఇదేమి పద్ధతి?
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వనప్పుడు వారిని సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయమని ఆదేశిస్తారు. తరువాత కొద్ది రోజులకే వారికి పోస్టింగులు ఇస్తారు. ఇటీవల పోస్టింగులు ఇవ్వని 16 మంది ఐపీఎస్ అధికారులను కూడా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తాజా ఆదేశాల ప్రకారం వారు రోజూ డీజీపీ కార్యాలయానికి రావాలి.
వెయిటింగ్ హాల్లో పడిగాపులు కాయాలి. అన్ని గంటలపాటు వారు ఏం చేస్తారు అన్న కనీస జ్ఞానం కూడా చంద్రబాబు సర్కారుకు లేదు. ఇలా అధికారులను రోజుకో రీతిలో అవమానిస్తూ చంద్రబాబు ఓ రాజకీయ సైకోలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోమ్‌గార్డు స్థాయి ఉద్యోగి పట్ల కూడా గతంలో ఏ ప్రభుత్వమూ ఈ రీతిలో వ్యవహరించలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాజ్యాంగహక్కుల ఉల్లంఘనే.. డీవోపీటీకి నివేదిక..!
చంద్రబాబు ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపట్ల అమానవీయంగా, కర్కశంగా వ్యవహరించడం అధికారులుగానే కాదు.. పౌరులుగా కూడా వారి రాజ్యాంగప రౖమెన హక్కుల ఉల్లంఘనేనన్న విమర్శలు వస్తున్నాయి. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, డీజీపీలుగా, ఉన్నత హోదాల్లో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
చంద్రబాబు, లోకేశ్‌ల కక్షపూరిత చర్యలను ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాన్ని వాట్సాప్ గ్రూపుల్లో, ప్రైవేటు సంభాషణల్లో నిరసిస్తున్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల సర్వీసు నిబంధనలను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లాలని కూడా నిర్ణయించారు.
టీడీపీ నేత వెంకటరెడ్డి ట్వీటో, ఎల్లో మీడియా పోస్టులో రాష్ట్రంలో అధికారుల పోస్టింగులను నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది.
– అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా హరితకు పోస్టింగ్ ఇచ్చి, ఆ వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించిన ఉదంతంపై రిటైర్డ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు
గత రెండు నెలలుగా రాష్ట్రంలో చాలా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు సామాన్యులే లక్ష్యంగా టీడీపీ గూండాలు వరుస హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలతో బీభత్సం సృష్టిస్తుంటే.. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం అధికారిక కక్ష సాధింపులు, వేధింపులకు అఖిల భారత సర్వీసు అధికారులు బాధితులుగా మారడం విభ్రాంతి కలిగిస్తోంది.
– ఓ సామాజిక విశ్లేషకుడి అభిప్రాయమిది
టీడీపీ సోషల్ మీడియా వద్దంటే.. వద్దు
పోస్టింగులు ఇచ్చి మరీ ఉపసంహరణ
చంద్రబాబు ప్రభుత్వ దిగజారుడుతనానికి మరో ఉదాహరణ టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆడమన్నట్టల్లా ఆడటం. ఎవరికైనా పోస్టింగు ఇవ్వొద్దని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే చాలు ఆ అధికారిని ప్రభుత్వం పక్కన పెట్టేస్తోంది.
బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సోషల్ కార్యకర్తలు పోస్టులు పెట్టారు. అంతే.. ప్రభుత్వం గోపాలకృష్ణ ద్వివేదికి పోస్టింగు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.
జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆయన్ని ఆదేశించింది. మహిళా అధికారి డి.హరితను అనంతపురం జేసీగా నియమించిన 24 గంటల్లోనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం తాజా ఉదాహరణ. తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన డి.హరిత కొద్ది నెలలుగా వెయిటింగ్‌లో ఉన్నారు. ప్రభుత్వం ఆమెను రెండు రోజుల క్రితం అనంతపురం జేసీగా నియమించింది.
వెంటనే టీడీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు వ్యతిరేకించారు. అంతే.. 24 గంటల్లోనే ఆమె పోస్టింగ్ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కు తీసుకొని, జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికారుల పోస్టింగులు, బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. కానీ చంద్రబాబు వాటిని టీడీపీ ప్రధాన కార్యాలయం వ్యవహారంగా దిగజార్చేశారని అఖిలభారత సర్వీసు అధికారులు మండిపడుతున్నారు.
ఇవీ ఉత్తమ సంప్రదాయాలు
వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అప్పటికే చంద్రబాబు ప్రభుత్వంలో సీఎస్‌గా వ్యవహరించిన మోహన్ కందానే సీఎస్‌గా కొనసాగించారు. ఆయన రిటైరయ్యే వరకు ఆ పోస్టులోనే ఉన్నారు. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక పోస్టింగులు ఇచ్చింది.
చంద్రబాబు హయాంలో సీఎం కార్యాలయంలో విధులు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు సాయి ప్రసాద్‌ను కీలకమైన సీసీఎల్‌ఏ కార్యదర్శిగా, సతీష్‌చంద్రను ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. టీడీపీ ప్రభుత్వంలో డీజీపీగా చేసిన ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించి, ఆయన రిటైరైన తరువాత కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుడిగానూ నియమించింది. టీడీపీ రాజ్యసభ సభ్యుడి సమీప బంధువైన ఐపీఎస్ అధికారి కోయ ప్రవీణ్‌ను గ్రేహౌండ్స్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది. అంతేగానీ ఎవరికీ పోస్టింగు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచలేదు. చంద్రబాబు ఆ సత్సంప్రదాయాలను తుంగలో తొక్కింది.
మూర్ఖమైన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు అధికారులను వేధిస్తోంది. ఇటువంటి దుర్మార్గమైన, హేయమైన నిర్ణయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ దేశ చరిత్రలోగానీ ఎవరూ తీసుకోలేదు. ఏపీ, తెలంగాణలో పరిస్థితులు దారుణంగా దిగజారిపోయాయి. గొంతు విప్పలేనివారు, బలహీనవర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం గత నెల ఇద్దరు డీజీపీ స్థాయి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది.
ఏకంగా 16 మందికి పైగా ఐపీఎస్ అధికారులకు రెండు నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా అవమానిస్తోంది. వారి గాయాలపై కారం చల్లేలా ఏపీ డీజీపీ తాజాగా మెమో జారీ చేశారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించడం కేవలం కక్ష సాధింపు చర్యే. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను సంతృప్తి పరిచేందుకే ఈ మెమో జారీ చేశారు.
ఇది అత్యున్నత స్థాయిలో తీసుకున్న మూర్ఖపు నిర్ణయం. వెయింటింగ్ హాల్లో కూర్చొని ఆ అధికారులు ఏం చేయాలి? గాసిప్పులు మాట్లాడుకోవాలా? ధ్యానం చేయాలా? సీనియర్ అధికారులను వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. బదిలీ చేసిన వారికి ఎక్కడో ఒక చోట పోస్టింగు ఇచ్చి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి
ఏపీ ప్రభుత్వ చర్య అసంబద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు రెండు నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుండడం అసంబద్ధమైన చర్య. ఏపీ ప్రభుత్వ చర్యలు నిబంధనలకు విరుద్ధం కూడా. డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్ హాల్లో ఉండాలని 16 మంది ఐపీఎస్ అధికారులను ఆదేశించడం ఏమిటి? దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి అసంబద్ధమైన ఆదేశాలు జారీ చేయలేదు.
ఎంతో ప్రజాధనాన్ని వెచ్చించి ఆ అధికారులకు భారత ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. వారిని పక్కన కూర్చోబెడితే రాష్ట్రానికి, దేశానికే నష్టం. వారి సేవలను ఏదో రూపంలో సద్వినియోగం చేసుకోవాలి. బదిలీ చేసిన వారికి ఏపీ ప్రభుత్వం తక్షణం పోస్టింగులు ఇవ్వాలి.
– స్వరణ్‌జిత్ సేన్, ఉమ్మడి ఏపీ రిటైర్డ్ డీజీపీ
Comments
Please login to add a commentAdd a comment