
సాధారణ బదిలీలకు ‘బ్యాన్’ ఉందని ఏమాత్రం చింతించవలదు. అడ్డదారుల్లో చట్టబద్ధంగా చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందుకు ‘మెడికల్ లీవ్’ల ప్రక్రియ ఉంది. లేదంటే ‘అలిగేషన్ సరెండర్’ కింద అక్కడ బదిలీలు చేస్తాం. కాస్త పలుకుబడి.. చేయితడిపే స్తోమత ఉంటే చాలు 20 శాతం హెచ్‌ఆర్‌ఏ కలిగిన ప్రాంతానికి ‘ట్రాన్స్‌ఫర్’ జరిగిపోతుంది అని రాయలసీమ జిల్లాల వైద్య ఆరోగ్య సిబ్బంది అంటున్నారు. తాజాగా మారిన పరిస్థితుల్లో ఈ వ్యవహారం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
కడప రూరల్: కడప పాత రిమ్స్‌లోని వైద్య ఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం పరిధిలోకి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలు వస్తాయి. ఈ శాఖ పరిధిలో నాలుగు జిల్లాల ఉద్యోగులకు గడిచిన జూన్‌లో సాధారణ బదిలీలు జరిగాయి. అనంతరం బదిలీలను ప్రభుత్వం ‘బ్యాన్’ చేసింది. అంటే బ్యాన్‌ను ఎత్తేసే వరకు సాధారణ బదిలీలను చేపట్టకూడదు. ఈ తరుణంలో ఉద్యోగులు కోరుకున్న చోటికి ‘ట్రాన్స్‌ఫర్’ చేయించుకోవడానికి అడ్డదారుల్లో వెలుతున్నారు. ఆ అడ్డదారిని చట్టబద్ధ రహదారిగా మార్చడానికి కొంతమంది సహకరిస్తున్నారు. ఈ అంశం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అందరి నోటా ఈ బది‘లీలలు’ మాటే వినిపిస్తోంది.
‘మెడికల్ లీవ్’ల నెపంతో ...
ఒక స్థానంలో పనిచేసే ఉద్యోగి అనా రోగ్యానికి గురైతే జీఓ 119 ప్రకారం ‘మెడికల్ లీవ్’ (6 నెలల పాటు అంటే 180 రోజుల లాంగ్ లీవ్)లో వెళతారు. ఆ ప్రక్రియ సరైనదా కాదా? ఆ ఉద్యోగి అనా రోగ్యానికి గురయ్యారా..లేదా..? అనారో గ్యంతో ఉంటే ఎన్నిరోజులు సెలవు అవసరం అనేది సభ్యులతో కూడిన ఒక కమిటీ (మెడికల్ బోర్డు) నిర్ధారిస్తుంది. అలా ఆ వ్యక్తి 6నెలల పాటు మెడికల్ లీవ్‌లో ఉన్న సమయంలో ఖాళీగా ఉన్న ఆ స్థానంలో మరొక ఉద్యోగి గనుక పనిచేస్తూ ఉంటే మెడికల్ లీవ్‌లో ఉన్న ఉద్యోగిని నాలుగు జిల్లాలలో ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడికి బదిలీ చేయాలి. ఒకవేళ ఆ స్థానంలో అలాగే ఖాళీగా ఉంటే మెడికల్ లీవ్‌లో ఉన్న ఉద్యోగి యథావిధిగా అక్కడే పనిచేయాలి. ఇదీ మెడికల్ లీవ్‌ల తంతు. అయితే ఇక్కడ మరోవిధంగా జరుగుతోంది. ముందుగానే తమకు అనుకూలమైన ప్రాంతాల్లో ఖాళీలను సిబ్బంది గుర్తిస్తారు. అక్కడికి బదిలీ కావడానికి ‘మెడికల్ లీవ్’ను ఆశ్రయిస్తున్నారు. ఆరు నెలల తర్వాత కూడా ఆ స్థానం ఖాళీగా ఉన్నప్పటికీ కోరిన చోటికి బదిలీ అవుతున్నారు. అదీ 20 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తించే పట్టణ ప్రాంతాలకు దాదాపుగా బదిలీలు జరుగుతున్నాయి. ఇలా ఒక బదిలీకి రూ.2.50 లక్షలకు పైగా వసూలు చేస్తున్నట్లు ఆ శాఖ ఉద్యోగవర్గాలు చెప్పుకుంటున్నారు.
‘అలిగేషన్’ కింద...
ఇక మరొక మార్గం ఉంది. అదే ‘అలిగేషన్ సరెండర్. అంటే ఆ ఉద్యోగి భారీగా అవినీతికి పాల్పడినా, సహచర ఉద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా, విధి నిర్వహణలో తీవ్ర అలక్ష్యం ప్రదర్శించినా ఆ ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు చేపడతారు. అందులోభాగంగా ‘అలిగేషన్ సరెండర్’ వేటు వేస్తారు. ఆ ఉద్యోగిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నప్పడు మాత్రమే ఆ శాఖ ఈ చర్యలు చేపడుతుంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆ ఉద్యోగిపై కఠినచర్యలు చేపట్టాలి. ఆ వ్యక్తిని వేరే జిల్లాలకు అదీ మారుమూల ప్రాంతాలకు బదిలీచేయాలి. ఇందులోనూ నిబంధనలకు విరుద్ధంగానే బదిలీలు జరుగుతున్నాయి.
అనంతపురం కేంద్రంగా...
తాజాగా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల బదిలీలు తదితర వ్యవహారాలు చాలా వరకు అనంతపురం జిల్లా కేంద్రంగా నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇప్పటికే కడప పాత రిమ్స్‌లోని ఆ శాఖ ఆర్డీ కార్యాలయంలో గతంలో జరిగిన అవకతవకలపై ఆ శాఖకే చెందిన కొంతమంది ఉద్యోగులు ఫిర్యాదులు చేశారు. దీంతో అవినీతి నిరోధక శాఖ ఇటీవల రంగప్రవేశం చేసింది. పలు ఫైళ్లను తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరుగుతున్నాయని ఆ శాఖ ఉద్యోగులు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఈ బదిలీలు వాస్తవమైనవా..కాదా ? అనేది నిర్ధారించి నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టాలని లేనిపక్షంలో అందుకు కారకులైన వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
బది‘లీలలు’ వివరాలు ఇలా...
ఆప్రకారం ఇటీవలే అదీ ‘ఫారన్ డిప్యుటేషన్’ కింద అనంతపురం ప్రభుత్వ హస్పిటల్ నుంచి కడపలోని వేరే శాఖకు ఒక ఉద్యోగి, ఇదే తరహాలో వివిధ ప్రాంతాలకు మరో ఇద్దరు బదిలీ కావడం గమనార్హం. ఇక ‘మెడికల్ లీవ్’ల కింద కడప రిమ్స్ నుంచి తిరుపతి రూయా హస్పిటల్‌కు ఒకరు బదిలీ అయ్యారు. ఇకపై బదిలీలకు సిద్ధంగా ఉన్నవారి వివరాలను పరిశీలిస్తే కర్నూలు జీఎల్‌సీ యూనిట్ నుంచి అనంతపురానికి ఒకరు, అనంతపురం ప్రభుత్వ హస్పిటల్ నుంచి కడపకు ఒకరు, అక్కడి నుంచే కడపకు మరొకరు బదిలీ కావడానికి సిద్ధమవుతున్నారు. అంటే వారంతా ప్రస్తుతం ‘మెడికల్ లీవ్’లో ఉన్నారు. అందుకు సంబంధించి ఆయా జిల్లాల్లోని ఆరోగ్యశాఖ కార్యాలయాల నుంచి కడపలోని ఆర్డీ కార్యాలయానికి ఫైల్స్ రావాల్సివుంది. ‘అలిగేషన్ సరెండర్’ కింద కడపకు సమీపంలోని ఒక మండలంలోని పీహెచ్‌సీ నుంచి కడప రిమ్స్‌కు, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కర్నూలు జనరల్ హస్పిటల్‌కు బదిలీ కావడానికి ఫైల్స్ సిద్ధమవుతున్నాయి. ఈ అలిగేషన్ కిందనే ఇప్పటికే కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి అనంతపురానికి ఒకరు బదిలీ కావడం గమనార్హం.
నిబంధనల ప్రకారమే బదిలీలు
గతంలో ఏమి జరిగాయో నాకు తెలియదు. ఇక్కడ నేను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ బదిలీలు అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి. ‘ఫారన్ డిప్యుటేషన్ ’ బదిలీలను ప్రభుత్వమే చేపడుతుంది. వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగిఉంటే, ఆ విషయాలు నా దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు చేపడుతా. – డాక్టర్ వీణాకుమారి, రీజనల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ,కడప
Comments
Please login to add a commentAdd a comment