
అవినీతి ‘ఖజానా’
► జిల్లా ఖజానా శాఖలో ముడుపుల దందా
► ప్రతి పనికీ పర్సెంటేజీ
► ఉద్యోగుల వేతన బిల్లులకూ ఫిక్స్‌డ్ రేట్
► ‘కాసు’లివ్వకపోతే కొర్రీలే
అనంతపురం అర్బన్ : జిల్లా ఖజానా శాఖ, దాని అనుబంధంగా ఉన్న ఉప ఖజానా కార్యాలయాలు అవినీతికి చిరునామాగా నిలుస్తున్నాయి. ఇక్కడ ముడుపుల దందా బహిరంగంగానే సాగుతోంది. ఉద్యోగుల వేతన బిల్లులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, ఎల్‌టీసీ, ఇతర బిల్లులను క్లియర్ చేయూలంటే ఒక్కో బిల్లుకు ఒక్కో రేటు ఉంటుందని ఉద్యోగ వర్గాలే చెబుతున్నాయి. కాసులు ఇవ్వకపోతే అది ఎలాంటి బిల్లు అయినా కొర్రీలు వేసి వెనక్కు పంపుతారనే విమర్శలు ఉన్నాయి. ఇలా అడ్డు అదుపు లేకుండా ఖజానా శాఖలో అవినీతి వరదలా పారుతున్నా పట్టించుకునేవారు లేరనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి.
ముడుపులు బహిరంగమే...
జిల్లా ఖజానా కార్యాలయంలో మామూళ్ల పర్వం బహిరంగంగానే సాగుతుందునే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖల పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులకు ఇక్కడ క్లియరెన్స్ తప్పని సరి. క్లియరెన్స్‌కు వచ్చే బిల్లు మొత్తం కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇదే ఇక్కడి పనిచేస్తున్న కొందరు అక్రమార్కులకు అందివచ్చిన అవకాశంగా మారింది. లక్షల రూపాయల పనికి రూ.300 నుంచి రూ.500 ముడుపులు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ శాఖలకు సంబంధించి ప్రతి రోజు ఎంత లేదన్నా రూ.50 లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు బిల్లులకు క్లియరెన్స్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ ప్రకారం చూసుకుంటే అక్కడి అవినీతిపరుల అక్రమార్జన ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఉద్యోగుల బిల్లుకు ఫిక్డ్స్ రేట్
వివిధ శాఖల ఉద్యోగులకు సంబంధించి వేతన, మెడికల్ రీయింబర్స్‌మెంట్, ఇతరాత్ర బిల్లు చేసేందుకు ఇక్కడ ఫిక్డ్స్ రేట్ ఉన్నట్లు తెలిసింది. ప్రతి నెల వేతన బిల్లుతో పాటు నిర్ధారించిన మొత్తాన్ని ఇవ్వాల్సిందే. లేదంటే బిల్లులో ఏదో ఒక కొర్రీ వేస్తారని ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారు.
ప్రతి శాఖలో ఒక మధ్యవర్తి
జిల్లా ఖజానాలో బిల్లులు క్లియరెన్స్ చేయించేందుకు ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక మధ్యవర్తి ఉంటాడు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులకు వీరు కాంట్రాక్టర్ల నుంచి లక్ష రూపాయల బిల్లుకు 0.5 శాతం పర్సంటేజీ తీసుకుంటారు. అందులో కొంత మొత్తాన్ని వాటాగా వీరు తీసుకుని ఖజానా శాఖకు చెల్లించాల్సిన వాటా ఇచ్చేస్తారు. ఉద్యోగుల వేతన బిల్లు అయితే పర్సంటేజీ రూపంలో కాకుండా ఒక రేట్ నిర్ణరుుంచి ఆ మేరకు తీసుకుంటారు.
అంతా అలవాటు పడిపోయూరు
ఖజానా శాఖలో బిల్లు క్లియరెన్స్ కోసం ముడుపులు ఇవ్వడానికి కాంట్రాక్టర్లు, ఉద్యోగులు అలవాటు పడిపోయారు. లక్ష రూపాయలకు రూ.300 నుంచి రూ.500గా ఉండడంతో ఆ మొత్తాన్ని ఫైలుతో పాటు ముట్టచెబుతారని తెలిసింది. డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒక కొర్రీతో వెనక్కి వస్తుంది. దాన్ని సరిచేసి మరోమారు ఉంచితే మరో కొర్రీ వేసి పదేపదే తిప్పుతారనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఖర్చులు, సమయం వృథా. ఈ తిప్పలెందుకు పర్సంటేజీ ఇస్తే వాళ్లే అన్ని సరిచేసుకుని బిల్లు చేస్తారనే ఉద్దేశంతో ముడుపుల ఇవ్వడానికి అలవాటు పడిపోయారు.