రాముడు నడయాడిన ‘రామతీర్థం’ | Andhra pradesh Rameswaram Ramatheertha At Nellore | Sakshi
Sakshi News home page

రాముడు నడయాడిన ‘రామతీర్థం’

Published Sun, Jun 23 2019 9:35 AM | Last Updated on Sun, Jun 23 2019 9:35 AM

Andhra pradesh Rameswaram Ramatheertha At Nellore - Sakshi

త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ తూర్పు తీరాన వెళుతుండగా శివ పూజకు వేళ కావడంతో ఓ ప్రాంతానికి చేరుకుని అక్కడే శివ సైకత లింగాన్ని ప్రతిష్టించి కొలిచారని, అదే నేడు రామతీర్థంగా విరాజిల్లుతోందని పురాణ ప్రతీతి. శ్రీరాముడు నడయాడిన తీరంగా.. రామతీర్థం ప్రసిద్ధికెక్కింది. రాముడు నడయాడిన తీరంలో బ్రహ్మోత్సవాల వేళ సముద్ర స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతిష్టించిన స్పటిక లింగాన్ని గుర్తించిన పల్లవరాజులు 14వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. 

సాక్షి, రామతీర్థం(నెల్లూరు) : కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయం. ఈ ఆలయం రామతీర్థం గ్రామంలో సముద్రతీరాన ఉన్నది. సముద్ర తీరాన సూర్యోదయ సమయంలో శ్రీరామచంద్రుడు, సైకతం (ఇసుక)తో శివలింగాన్ని చేసి, శివార్చన చేసిన పవిత్రస్థలి ఇది. ఆంధ్రరాష్ట్ర రామేశ్వరంగా, దక్షిణ కాశీగా విలసిల్లుతున్న పవిత్ర శివక్షేత్రం. రాముడు శివార్చన చేసిన ఈ ప్రదేశంలో భక్తులు సముద్రస్నానం ఆచరించి, స్వామి వారికి మొక్కుకుంటే, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

యుగాలు మారినా తరగని భక్తితో స్వామివారి దర్శనానికి భారీగా తరలి రావడం విశేషం. రాముడు సేవించిన తీర్థం కావడంతో ‘రామతీర్థం’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే, శివకేశవులను ఒకేసారి దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రాచీనకాలం నుంచి దివ్యక్షేత్రంగా వెలుగొందుచూ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అమావాస్య నాడు సముద్ర స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవరాజులు స్వామి వారికి దేవాలయం నిర్మించారని ఇక్కడ చారిత్రిక ఆధారాలు ఉన్నవి. 18వ శతాబ్దంలో స్థానికుడైన కోటంరెడ్డి శేషాద్రిరెడ్డికి స్వామివారు స్వప్న దర్శనంతో ప్రేరణ పొంది ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. 

10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు
జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోన్న కామాక్షి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమై సుమారు 10 రోజుల పాటు జరుగుతాయి.  ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే  స్వామి వారి వివిధ అలంకరణలకు రామతీర్థం పరిసర ప్రాంతాల భక్తులు ఉభయకర్తలుగా వ్యవహరించడం ఆనవాయితీ. నేటికి ఇదే ఆచారంగా కోనసాగడం విశేషం. బ్రహ్మోత్సవాలు సందర్భంగా వరవడిన భక్తులకు సంతానం కలుగుతుందని భక్తులకు అపార నమ్మకం. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు పలు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  

బ్రహ్మోత్సవ వివరాలు 
అతి పురాతనమైన శైవక్షేత్రం రామతీర్థంలోని కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 23వ తేదీ ఆదివారం అంకురార్పణతో ప్రారంభమవుతాయి, 24వ తేదీ ధ్వజారోహణ, 25న చిలక వాహనం, 26న హంస వాహనం, 27న పులి వాహనం, 28న రావణసేవ,  29న నందిసేవ, 30న రథోత్సవం, జూలై 1న స్వామి వారికి కల్యాణం, 2న ముఖ్య ఘట్టం తీర్థవాది (సముద్రస్నానం), అదే రోజు రాత్రికి తెప్పోత్సవం, అశ్వ వాహనం, 3వ తేదీన ధ్వజావరోహణ, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే రథోత్సవం, స్వామి వారి కల్యాణం, తీర్థవాది ఘట్టాలకు స్వామి వారిని తరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తీర్థవాదికి సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఆలయ అధికారు మౌలిక వసతులను కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.    

ఎలా చేరుకోవాలంటే.. 
ఉత్సవాలు సందర్భంగా జిల్లా కేంద్రం నెల్లూరు నుంచి విడవలూరు మండలం రామతీర్థం గ్రామానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. నెల్లూరు నుంచి దాదాపు 30 కిలో మీటర్లు ఉంటుంది. అల్లూరు, పద్మనాభసత్రం నుంచి కూడా ప్రైవేట్‌ వాహనాలు నిత్యం రామతీర్థం వరకు నడుస్తుంటాయి. కావలి నుంచి కూడా నేరుగా రామతీర్థానికి బస్సు సౌకర్యం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement