ఆదిమానవుల అడ్డా
మౌలాలి గుట్ట... ఈ పేరు వినగానే మనకు స్ఫురించేది దానిపై ఉన్న చారిత్రక దర్గా. అసఫ్‌జాహీల కాలంలో నిర్మితమైన దర్గా చాలామందికి ఆరాధ్య ప్రాంతం. ఇప్పుడో ఆధ్యాత్మిక కేంద్రం. కానీ... ఎత్తుపల్లాలంటూ లేకుండా అన్ని వైపులా జారుడుగా ఉన్న విశాలమైన
ఈ ప్రాంతం ఒకప్పుడు ఆదిమానవుల ప్రధాన ఆవాస కేంద్రం. మధ్య శిలాయుగం నుంచి ఇనుప యుగం వరకు ఇక్కడ మానవ మనుగడ విలసిల్లిన అద్భుత ప్రాంతం. కానీ ఈ విషయం మరుగున పడిపోయింది. దాని గురించి పరిశోధించి తేల్చాల్సిన పురావస్తు శాఖ పట్టించుకోకపోవటంతో ఇప్పుడు నాటి మానవ జాడలు కూడా కనుమరుగయ్యాయి.
చుట్టూ అడవులు... విస్తారంగా నీటి వనరులు. జంతువులు దాడి చేసే అవకాశం లేని ఎత్తయిన.. చదునైన గుట్ట. ఆదిమానవులు ప్రధానంగా ఇష్టపడే అన్ని లక్షణాలున్న ప్రాంతం కావటంతో మౌలాలి గుట్టను అప్పట్లో ఆవాసంగా చేసుకున్నారు. దాదాపు 8 వేల సంవత్సరాల క్రితం ఇక్కడ మానవ సంచారం ఉండేదని పురావస్తు పరిశోధకులు అభిప్రాయం.
బయటపడిందిలా...
ఆంగ్లేయుల కాలంలో పురావుస్తు పరిశోధకుడిగా వెలుగొందిన రాబర్ట్ బ్రూస్ ఫుటే తొలిసారిగా మౌలాలి ప్రాంతంలో అధ్యయనం జరిపారు. అక్కడ అద్భుత రీతిలో ఆదిమానవుల మనుగడ సాగిందనే సత్యాన్ని తొలిసారి ఆయన 1863 ప్రాంతంలో ప్రపంచానికి చాటి చెప్పారు. సాధారణంగా ఆదిమానవులు కొంతకాలం పాటు జీవనం సాగించిన ప్రాంతాల్లో వారి సమాధులు కనిపిస్తాయి. మౌలాలి గుట్ట కింద అధిక సంఖ్యలో అలాంటి సమాధులను ఆయన గుర్తించారు. ఖననం చేసిన తర్వాత గుర్తుగా భూమి ఉపరితలంలో గుండ్రంగా రాళ్లను పాతుతారు. ఇలాంటి రాళ్ల సంఖ్య 18 నుంచి 25 వరకు ఉంటుంటాయి. ఇప్పటి వరకు గుర్తించిన అలాంటి సమాధుల వద్ద అంతే సంఖ్యలో రాళ్లు కనిపించాయి. కానీ మౌలాలి గుట్ట దిగువ భాగంలో ఓ సమాధి చుట్టూ 40 వరకు రాళ్లున్నట్టు అప్పట్లో గుర్తించారు. నాటి సమూహానికి అధిపతిగా వ్యవహరించిన వ్యక్తి సమాధి అయి ఉంటుందనేది నాటి అంచనా.
అసఫ్‌జాహీల కాలంలో పురావస్తు విభాగాన్ని పర్యవేక్షించిన గులాం యజ్దానీ కూడా 1924 ప్రాంతంలో మౌలాలి గుట్టపై పరిశోధనలు జరిపారు. దక్కన్ పీఠభూమికి సంబంధించిన పురావస్తు విషయాలపై ఆయన రాసిన పుస్తకంలో మౌలాలి గుట్టలో ఆదిమానవుల మనుగడను ప్రస్తావించారు. ఆ సమయంలో అక్కడ జరిపిన పరిశోధనల్లో రాతి పనిముట్లు, ఆయుధాలతో పాటు కత్తులు, డాగర్లు, త్రిశూలాకృతులను పోలిన ఇనుప ఆయుధాలు కూడా లభించాయి. అంటే మధ్య రాతి యుగం నుంచి ఇనుప యుగం వరకు ఇక్కడ మానవ మనుగడ సాగిందని స్పష్టమైంది. అయితే అంతకుమించి పరిశోధనలు జరపలేదు. ఆ తర్వాత పురావస్తు విభాగం పెద్దగా స్పందించకపోవటం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో గుట్ట చుట్టూ కాలనీలు వెలిశాయి. నాటి మానవ మనుగడ గుర్తులన్నీ క్రమంగా ధ్వంసమయ్యాయి.
రాయగిరి అవశేషాలతో పోలిక
మౌలాలి గుట్ట వద్ద ఆదిమానవుల అవశేషాలు... నల్గొండ జిల్లా రాయగిరి గుట్ట వద్ద లభించిన అవశేషాలతో పోలి ఉన్నాయి. అక్కడ లభించిన పెంకులపై ఉన్న గుర్తులు బ్రాహ్మీ లిపిని పోలి ఉన్నాయి. అవే తరహా చిహ్నాలు మౌలాలి గుట్ట వద్ద లభించిన అవశేషాల్లోనూ కనిపించాయి. ఆదిమానవులు అంతుబట్టని రీతిలో రూపొందించిన దాదాపు 140 వరకు చిహ్నాలను ఇప్పటి వరకు పురావస్తు పరిశోధకులు గుర్తించగా... ఈ రెండు ప్రాంతాల మధ్య ఏడు చిహ్నాలు ఒకే రకంగా ఉన్నట్టు నాటి పరిశోధనల్లో తేలింది. భట్టిప్రోలు వద్ద లభించిన బ్రాహ్మీ లిపి శాసనంలోని కొన్ని గుర్తులతో ఇవి పోలి ఉండటం విశేషం.