యాదాద్రికి సరికొత్త రూపు
♦ అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్పు
♦ పది జిల్లాల నుంచీ నేరుగా వచ్చేలా విశాలమైన రోడ్లు
♦ ఇళ్లు కోల్పోయేవారికి ప్రత్యామ్నాయ స్థలం, నిర్మాణ ఖర్చులు
♦ వ్యాపారాల్లో స్థానికులకే ప్రాధాన్యం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, సాహిత్య, సాంస్కృతిక, వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న రూపంలో కాకుండా పూర్తిస్థాయిలో నూతనంగా ఆవిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. యాదాద్రి పునర్నిర్మాణంపై శుక్రవారం సీఎం సమీక్ష జరిపారు.మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, ఆర్కిటెక్ట్, డిజైనర్ ఆనంద్‌సాయి, ఉన్నతాధికారులతో పాటు యాదాద్రి అభివృద్ధి పనుల్లో దుకాణాలు, ఇళ్లు కోల్పోతున్న వారి తరఫు ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. యాదాద్రి పనుల్లో జాప్యంపై గురువారం స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులపై ఆగ్రహించిన సీఎం, ఈ సమీక్షలో వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జరిగిన పనులతో పాటు మిగతావాటి పరిపూర్తికి పట్టే సమయాన్ని వారు సీఎంకు వివరించారు.
యాదాద్రికి రవాణా వ్యవస్థను పటిష్టపరచాలని సీఎం పేర్కొన్నారు. ‘‘తెలంగాణ పది జిల్లాల నుంచి నేరుగా చేరుకునేలా విశాలమైన రోడ్లను నిర్మించండి. అనువుగా ఉన్న నివాసాలను వ్యాపార కేంద్రాలుగా మార్చండి. దేవాలయంతో పాటు పరిసరాలూ ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలి. దేశవిదేశాల నుంచి భక్తులొచ్చే వాతావరణం క ల్పించాలి’’ అని చెప్పారు. ప్రధానాలయ ముఖద్వారం, వీధిపోటు తదితర వాస్తుల అంశాల నమూనా చిత్రాలను తిలకించి అధికారులకు సూచనలు చేశారు. గిరి ప్రదర్శన కోసం గుట్ట చుట్టూ రోడ్లను వెడల్పు చేయాలన్నారు. ఆ క్రమంలో భవనాలు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపడమేగాక భవనాల పునర్నిర్మాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.
గుట్టపైకి రెండు దారులు
గుట్టపైకి ఒకే మార్గంలో వాహనాలు వెళ్లి రావటం సరికాదని, రెండు విడి విడి దారులుండాలని సీఎం సూచించారు. వాటి వెంట పాదచారుల కోసం విశాలమైన కాలిబాటలు ఏర్పాటు చేయాలన్నారు. కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్న ఆలయ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. వారికి మానవతా దృక్పథంతో ప్రత్యామ్నాయం చూపించాలని సూచించారు. ‘‘ఇక గుట్టపై ఏర్పాటు చేసే దుకాణాలను ఎట్టి పరిస్థితిలోనూ ఇతరులకు కేటాయించబోం. కనీసం టెండర్లు కూడా పిలవం. స్థానికులకే కేటాయిస్తాం. వెయ్యెకరాల్లో తలపెట్టిన టెంపుల్ సిటీలో భారీ మినహా ఇతర వ్యాపారాల్లో స్థానికులకే ప్రాధాన్యమిస్తాం’’ అని వివరించారు. ఇంత విసృ్తత స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ మద్దతుంటుందని భవనాలు కోల్పోతున్న వారి తరపు ప్రతినిధులు సీఎంకు హామీ ఇచ్చారు. తమకిచ్చిన హామీలను సీఎం నెరవేరుస్తారన్న పూర్తి భరోసా ఉందన్నారు. అనంతరం వారికి భోజనం ఏర్పాటు చేశారు.