dussehra offer: రండీ బాబూ రండీ.. ఆలసించినా ఆశాభంగం. త్వరపడండి.. మంచి తరుణం మించినా దొరకదు. ఏంటీ హడావుడి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. సాధారణంగా దసరా పండుగకు జనమంతా షాపింగ్ చేయడం సర్వసాధారణం. అటు దుకాణాదారులు కూడా ఆఫర్లతో పాటు ఉచిత బహుమతులతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో దుకాణాలు, షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి.
ఇదిలావుంచితే రానున్న దసరా పండుగ సందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసులకు వెరైటీ ఆఫర్లు ప్రకటించారు. నేలకొండపల్లి చెందిన కొందరు యువకులు డ్రా ద్వారా బహుమతులు అందించాలని నిర్ణయించారు. అయితే, టీవీలు, కూలర్లు, బైక్‌లు వంటివి కాకుండా ఈసారి వినూత్న బహుమతులను ప్రకటించారు.
కేసు బీర్లు, నాటు కోళ్లు
రూ.100 చొప్పున టికెట్లు అమ్మకం చేపట్టి ఈనెల 10న తీయనున్న డ్రాలో మొదటి బహుమతి 10 కిలోల మేక ఇస్తామని పోస్టర్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. రెండో బహుమతిగా బ్రాండెడ్ మద్యం బాటిల్, మూడో బహుమతి కేసు బీర్లు, నాలుగో బహుమతి రెండు నాటు కోళ్లు, ఐదో బహుమతిగా మద్యం బాటిల్ ఇస్తామని ప్రకటించడంతో టికెట్లు జోరుగానే అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది.
వేములవాడలో కేసు
కాగా, నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామంలోనూ ఇంతకుముందు ఇలాంటి ఆఫర్లే ప్రకటించారు. ఈ ట్రెండ్ చాలా ఊర్లకు పాకింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం పోలీసులు కన్నెర్ర చేశారు. వేములవాడ పట్టణంలో “100 కొట్టు మేకను పట్టు” క్యాప్షన్‌తో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రైజ్‌మనీల పేరుతో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment