Buddhist temple
-
నేలకొండపల్లి.. బౌద్ధం వర్ధిల్లి..
ఖమ్మం జిల్లా కేంద్రానికి సుమారు 24 కిలోమీటర్ల దూరాన నేలకొండపల్లిలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన బౌద్ధ క్షేత్రం ఉంది. బౌద్ధుల ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిన ఈ క్షేత్రం.. దేశ, విదేశీ పర్యాటకుల రాకతో పర్యాటకంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. – నేలకొండపల్లి1976లో తొలిసారి తవ్వకాలు..ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి– ముజ్జుగూడెం మధ్య ఈశాన్య దిక్కుగా బౌద్ధ స్తూపం ఉంది. ఈ స్తూపం చరిత్ర ఎంతో ఘనమైనది. క్రీ.శ. 2 – 3వ శతాబ్దానికి చెందినదిగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. దేశంలో చరిత్ర కలిగిన బౌద్ధమతానికి ఇదొక ప్రధాన కేంద్రం. అయితే పూర్వం స్థానికులు దీనిని ఎర్రదిబ్బ అని పిలిచేవారు. 1976లో పురావస్తు శాఖ అధికారులు ప్రథమంగా తవ్వకాలు జరిపారు. రెండో దఫా 1984లోనూ పెద్దఎత్తున తవ్వకాలు జరిపారు. అనంతరం దీనికి ఒక ఆకారం తీసుకొచ్చాక బౌద్ధ స్తూపంగా గుర్తించారు. ఈ స్తూపం సుమారు 106 అడుగుల వ్యాసం, 60 అడుగుల ఎత్తుతో ఉంటుంది. స్తూపానికి మొత్తం 12 ఎకరాల çస్థలం ఉంది. ఇక్కడి తవ్వకాల్లో బుద్ధుని పాలరాతి విగ్రహాలు, మృణ్మయ పాత్రలు, మట్టిపూసలు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినుల కాలంనాటి నాణేలు, బుద్ధుని పద్మాసనం, పంచలోహ విగ్రహాలు అనేకం బయటపడ్డాయి. వీటిని పురావస్తు శాఖ అధికారులు మ్యూజియంలో ఉంచారు. ఈ బౌద్ధ స్తూపాన్ని పోలిన ఒక మినీ స్తూపాన్ని దగ్గరే ఏర్పాటు చేశారు. క్రీ.శ. 2 శతాబ్దంలో చరిత్రకారుడు టోలమీ రచించిన భూగోళ చరిత్ర గ్రంథంలో దీన్ని నెల్సిండా అని పేర్కొన్నారు. అదే నేడు నేలకొండపల్లిగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం. బౌద్ధ స్తూపం వద్ద నున్న బాలసముద్రం చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి.. నేలకొండపల్లి గ్రామ సమీపంలో గల బౌద్ధ స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2009లో రూ.1.26 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. బౌద్ధ స్తూపంతో పాటు ఫెన్సింగ్, పార్కు ఏర్పాటు చేశారు. ఆర్కియాలజీ వారి ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో దీనిని అభివృద్ధి చేశారు. గతేడాది మరో రూ.50 లక్షలతో పర్యాటకుల కోసం విశ్రాంతి భవనం నిర్మించారు. ఇటీవల రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. అభివృద్ధి కోసం రూ.2.50 కోట్లు మంజూరు చేశారు. మరో రెండెకరాల స్థలంలో వివిధ అభివృద్ధి పనులు చేసేలా చర్యలు చేపట్టారు. స్తూపం వద్దకు ఇలా చేరుకోవచ్చు..» ఖమ్మం నుంచి వచ్చే పర్యాటకుల కోసం నేలకొండపల్లి శివారులో బైపాస్‌రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి నుంచి దాదాపు కిలోమీటరు దూరం వెళితే బౌద్ధక్షేత్రం వద్దకు చేరుకోవచ్చు. » కోదాడ నుంచి వచ్చే పర్యాటకులు మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి మసీద్ సెంటర్ వైపుగా వెళ్లి ముజ్జుగూడెం రహదారి నుంచి వెళితే బౌద్ధక్షేత్రానికి చేరుకుంటారు. » కూసుమంచి వైపు నుంచి వచ్చే సందర్శకులు నేలకొండపల్లి వరకు వచ్చి సుందరయ్య చౌక్ మీదుగా ఆంజనేయస్వామి సెంటర్, మర్రి చెట్టు సెంటర్ నుంచి ముజ్జుగూడెం రహదారి వైపుగా వెళ్లాలి.» బౌద్ధక్షేత్రానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేదు. ప్రత్యేక వాహనాల్లో నేరుగా వెళ్లొచ్చు. లేదంటే నేలకొండపల్లి వరకు బస్సుల్లో చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో వెళ్లాలి. విదేశీ యాత్రికుల తాకిడి.. దక్షిణ భారతదేశంలోకెల్లా అతిపెద్దదైన బౌద్ధక్షేత్రానికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా చైనా, జపాన్ నుంచి ఎక్కువగా వస్తుంటారు. దేశంలోని బౌద్ధ పర్యాటకులు కూడా వస్తుంటారు. అందుకే బౌద్ధక్షేత్రం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. అంతేకాకుండా ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగానే వస్తున్నారు. పిక్నిక్, విహార యాత్రలకు వచ్చే వారు కోకొల్లలుగా ఉన్నారు. పర్యాటకులకు చరిత్రను వివరించేలా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో బోర్డులు ఏర్పాటుచేశారు. ప్రత్యేక ఆకర్షణగా చెరువు..బౌద్ధక్షేత్రాన్ని ఆనుకుని ఉన్న బాలసముద్రం చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బౌద్ధక్షేత్రం చుట్టూ తిరిగిన సందర్శకులు కట్టపైకెక్కి చెరువును తిలకిస్తారు. చెరువులో వివిధ రంగులలో పూలు ఆహ్లాదకరంగా ఉంటాయి. దీనిని గమనించిన టూరిజం అధికారులు చెరువులో బోటు షికారుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పర్యాటక చెరువుగా ఎంపిక చేసి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసింది. -
అల్లుడిదే కాదు.. ఆవేదన అందరిదీ!
హైదరాబాద్‌కు చెందిన శ్యాంప్రసాద్ అనే యువకుడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన యువతిని వివాహమాడాడు. నేలకొండపల్లిలో ఘన చరిత్రగల బౌద్ధ స్తూపం ఉందని తెలుసుకొని ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించాడు. అయితే స్తూపాన్ని, అక్కడి పరిసరాల పరిస్థితిని చూసి తీవ్ర నిరాశ చెందాడు. తన ఆవేదనను మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లగా ఆయన జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు రీట్వీట్ చేశారు. అయితే ఈ ఆవేదన నేలకొండపల్లి అల్లుడిది మాత్రమే కాదని ‘సాక్షి’ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. సాక్షి, ఖమ్మం డెస్క్: దక్షిణాదిలోకెల్లా అతిపెద్ద బౌద్ధక్షేత్రం.. సుమారు 106 అడుగులు వ్యాసార్థం, 60 అడుగుల ఎత్తు.. క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందినదిగా ఘనత.. 46 ఏళ్ల క్రితం తవ్వకాల్లో గుర్తింపు.. ఇటువంటి ప్రత్యేకతలున్న ఆ క్షేత్రాన్ని కుటుంబంతో సహా కలసి వెళ్లి చూడాలనుకుంటున్నారా? అయితే మీ కోరిక నెరవేరాలంటే మీరు ఎంతో కష్టపడాల్సిందే.. ఎందుకంటారా? ఆ స్తూపం వద్దకు వెళ్లేందుకు కనీస రవాణా సౌకర్యం లేకపోగా ఎలాగోలా వెళ్లినా తాగడానికి నీళ్లు, కూర్చోవడానికి నీడ లేక అల్లాడాల్సిందే..! ఖమ్మం జిల్లా కేంద్రానికి 24 కి.మీ. దూరంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలో నేలకొండపల్లి–ముజ్జుగూడెం గ్రామాల మధ్యన ఈశాన్య దిక్కున ఉన్న బౌద్ధక్షేత్రం వద్ద కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన నాలుగు బెంచీలు తప్ప తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం వంటివేవీ కనిపించవు. ప్రధాన ద్వారం వద్ద స్థూపం వివరాలతో కూడిన బోర్డు ఉన్నా దానిపై అక్షరాలు చెరిగిపోయి అది కూడా చెదిరిపోయిన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఒక అడుగు ముందుకు పడినా... నేలకొండపల్లి సమీపంలోని బౌద్ధస్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2009లో రూ. 1.26 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కంచె, పార్కు ఏర్పాటు చేశారు. అలాగే పురావస్తుశాఖ ఆధ్వర్యంలో రూ. 50 లక్షలతో స్తూపం అభివృద్ధి చేపట్టారు. అసలైన బౌద్ధ స్థూపం చాలా ఎత్తుగా ఉండటంతో బౌద్ధ స్థూపాన్ని పోలిన మినీ స్తూపంతోపాటు చిన్న పార్కును, అందులో పిల్లలను ఆకర్షించేందుకు జంతువుల సిమెంట్ బొమ్మలను ఏర్పాటు చేశారు. అయితే వాటి నిర్వహణను గాలికి వదిలేయడంతో పార్కులో మొక్కలు పోయి పిచ్చిచెట్లు పెరిగి ఆ పరిసరాలు చిట్టడివిని తలపిస్తున్నాయి. కేటీఆర్‌కు శ్యాంప్రసాద్ చేసిన ట్వీట్ బోటింగ్ ఏదీ? బౌద్ధక్షేత్రాన్ని ఆనుకొని ఉన్న బాలసముద్రం చెరువులో పర్యాటకుల కోసం బోటింగ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వం రూ.50 లక్షలు నిధులు మంజూరు చేసినా ఇప్పటివరకు ఈ దిశగా ఒక్క చర్య కూడా అధికారులు చేపట్టలేదు. బౌద్ధస్తూపం.. మరికొన్ని సంగతులు ►బౌద్ధస్తూపం ఉన్న ఈ ప్రాంతాన్ని పూర్వం స్థానికులు ఎర్రదిబ్బగా పిలిచేవారు. ►క్రీస్తుశకం రెండో శతాబ్దంలో చరిత్రకారుడు టోలమీ రచించిన భూగోళ చరిత్ర గ్రంథంలో ఈ ప్రాంతాన్ని నెల్సిండా అని పేర్కొన్నట్లు చెబుతారు. ఆ ప్రాంతమే వ్యవహారంలో నేలకొండపల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం. ►నేలకొండపల్లి పరిసరాల్లో క్రీ.శ. 6వ శతాబ్దం వరకు బౌద్ధం విరాజిల్లినట్లు భావిస్తున్నారు. ►1976లో పురావస్తు శాఖ అధికారులు ప్రథమంగా, రెండో దఫా 1984లో చేపట్టిన తవ్వకాల్లో బుద్ధుని పాలరాతి విగ్రహాలు, మృణ్ముయ పాత్రలు, మట్టిపూసలు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినుల కాలంనాటి నాణాలు, పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని పురావస్తు శాఖ మ్యూజియాల్లో భద్రపరిచారు. -
15 నిమిషాల పాటు ఒళ్లో కూర్చుని..
బ్యాంకాక్: నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని ప్రార్థనలు చేస్తున్న ఓ బౌద్ధ సన్యాసి సహనాన్ని పిల్లి పరీక్షించింది. ప్రార్థనలో మునిగి ఉన్న ఆయనపైకి ఎక్కి.. పావుగంట సేపు నిమిరి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా థాయ్‌లాండ్‌లో దాదాపు 95 శాతం మంది ప్రజలు బౌద్ధ మతవిశ్వాసాన్ని ఆచరిస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2020కి స్వాగతం పలుకుతూ వాట్ ఉడోమ్రాంగ్సీ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలువురు బౌద్ధ సన్యాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 25 ఏళ్ల బౌద్ధ సన్యాసి ఒళ్లోకి చేరిన పిల్లి.. పదే పదే ఆయన ఏకాగ్రతకు భంగం కలిగించింది. సున్నితంగా వెళ్లగొట్టేందుకు ప్రయత్నించినా.. ఏమాత్రం కదలకుండా ఆయన శరీరాన్ని నిమురుతూ అక్కడే ఉండిపోయింది. ఈ విషయం గురించి సదరు సన్యాసి మాట్లాడుతూ.. ‘నేను పుస్తకం చదివేందుకు ప్రయత్నిస్తుంటే.. పిల్లి మాత్రం నా శ్రద్ధను తన వైపునకు తిప్పుకుంది’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. ‘సాటి జీవుల పట్ల దయగా వ్యవహరించాలనే బౌద్ధ సూక్తిని సన్యాసి ఆచరించి చూపించారంటూ’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా థాయ్‌లాండ్ బౌద్ధాలయాల్లో పిల్లులను స్వేచ్ఛగా తిరుగనిచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక ఈ ఘటన జరిగిన వాట్ ఉడోమ్రాంగ్సీ ఆలయంలో దాదాపు 12 పిల్లులు ఉన్నాయి. ఆలయానికి వచ్చిన భక్తులు వీటికి ఆహారం తినిపించడం ఇక్కడ పరిపాటి. -
‘ఇన్ని రోజులు జీవించడం ఆశ్చర్యకరమే’
కొలంబో : శ్రీలంకలోని ఓ ఉత్సవాలలో జరిగిన కవాతులో ఉపయోగించిన వృద్ధ ఏనుగు మంగళవారం రాత్రి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వన్యప్రాణిశాఖ అధికారి తెలిపారు. ‘టెంపుల్ ఆఫ్ ది టూత్’.. పవిత్రమైన బౌద్ధమత పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి ఏటా సాంప్రదాయ నృత్యాలతో పాటు దాదాపు 100 ఏనుగులతో వార్షిక పండుగను నిర్వహిస్తారు. ఎప్పటిలాగే నిర్వహించిన పెరెహర ఉత్సవాల్లో 70 ఏళ్ల వృద్ధ ఏనుగు టికిరిని పోటీల్లో నిలిపారు. అప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కవాతులో వృద్ధ ఏనుగును భారీ దుస్తులతో కప్పి దాని బలహీనతలను బయటికి కనిపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయిన్పటికీ పోటీ మధ్యలోనే అది కుప్పకూలిపోవడంతో.. బలహీనమైన ఏనుగును కవాతులో ఉపయోగించడంపై గత నెలలో అనేక విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చివరి పోటీల నుంచి ఈ ఏనుగును తప్పించారు. అయితే అప్పటి నుంచి భారంగా బతుకునీడుస్తున్న ఈ వృద్ధ ఏనుగు తాజాగా ప్రాణాలు విడిచింది. ఏనుగుల నిపుణుడు జయంతా జయవర్ధనే మాట్లాడుతూ.. వృద్ధ ఏనుగు ఉత్సవాలలో పాల్గొన్న నాటి నుంచి పోషకాహార లోపంతో బాధపడుతుందని.. అయినప్పటికీ ఇన్ని రోజులు జీవించి ఉండటం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. చదవండి : అయ్యో! ఎంత అమానుషం -
అయ్యో! ఎంత అమానుషం
కొలంబో : శ్రీలంకలో నిర్వహించిన పెరెహర ఉత్సవాల్లో 70 ఏళ్ల వృద్ధ ఏనుగును కవాతుకు ఉపయోగించడం అందరి మనసులను కలచి వేస్తోంది. ఎసాలా పెరెహారా వార్షిక పోటీల్లో అనారోగ్యంతో ఉన్న ముసలి ఏనుగును అధికారులు కవాతుకు ప్రోత్సహించారు. దీంతో ఆ ఏనుగు అనారోగ్యంతో కుప్పకూలిపోయింది. దీనిపై జంతు ప్రేమికులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో స్పందించిన శ్రీలంక ప్రభుత్వం ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. టెంపుల్ ఆఫ్ ది టూత్.. పవిత్రమైన బౌద్ధమత పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి సంవత్సరం సాంప్రదాయ నృత్యాలతో పాటు దాదాపు 100 ఏనుగులతో వార్షిక పండుగను నిర్వహిస్తారు. కాండీలో జరిగిన పెరెహర ఉత్సవాలలో వృద్ధ ఏనుగుతో కవాతు చేయించటంపై ‘సేవ్ ఎలిఫింట్ ఫౌండేషన్’ వారు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలు నిర్వహించే యాజమాన్యం సదరు ఏనుగును బుధవారం జరిగిన తుది పోటీల నుంచి తప్పించారు. ఈ ఘటనపై స్పందించిన పర్యాటక, వన్యప్రాణి సంరక్షణ శాఖ మంత్రి జాన్ అమరతుంగా.. తికిరి అనే ముసలి ఏనుగు ఆరోగ్యం బాలేకపోయినా కవాతు చేయడానికి ఎలా ఉపయోగించారని వన్యప్రాణి అధికారులను ప్రశ్నించారు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఏనుగును ఉపయోగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాక అక్కడ ఉన్న మిగతా 200 ఏనుగులకు ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని వన్యప్రాణి అధికారులను హెచ్చరించారు. బౌద్ధ దేవాలయ ఉత్సవాల్లో ఏనుగులతో సాధారణంగా కవాతు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాగా ఇలాంటి పోటీల్లో ఏనుగులను అమానవీయంగా చూస్తున్నారని, తికారా చావుకు దగ్గరగా ఉందని ఏనుగుల నిపుణుడు జయంతా జయవర్ధనే పేర్కొన్నారు. కవాతులో వృద్ధ ఏనుగును భారీ దుస్తులతో కప్పి ఉంచినందున అది ఎంత బలహీనంగా ఉందో గమనించలేకపోయారని అవేదన వ్యక్తం చేశారు. -
గుడి మొత్తం బీర్ సీసాలతో...
బ్యాంకాక్: ఆలయం.. మద్యం... ఈ రెండింటికి చాలా దూరం. అలాంటిది ఏకంగా బీర్ బాటిళ్లతోనే గుడి కట్టేస్తే ఎలా ఉంటుంది. థాయ్‌లాండ్‌లో కొందరు దీనిని ఆచరించి చూపారు. బీర్ బాటిళ్లతో బుద్ధుడి ఆలయాన్ని నిర్మించగా, బౌద్ధ సన్యాసులే స్వయంగా ఈ నిర్మాణంలో పాలుపంచుకోవటం గమనార్హం. ఖూన్ హన్ జిల్లా సిసాకెట్ ప్రొవిన్స్‌లోని ‘వాట్ పా మహా చెది కయూ’ బుద్ధుడి ఆలయం. 1984లో సముద్ర ప్రాంతం వద్ద చెత్త సేకరణలో పాల్గొన్న కొందరు బౌద్ధ సన్యాసులు కుప్పులు కుప్పలుగా పడి ఉన్న బీర్ బాటిళ్లను గమనించారు. వెంటనే వారికి ఓ ఆలోచన తట్టింది. ఇటుకలకు బదులుగా బీర్ బాటిళ్లతో అందంగా ఆ గుడిని రూపొందించారు. సుమారు 10 లక్షలకు పైగానే ఖాళీ బీర్ సీసాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంతోపాటు, మెట్లు, నేల, వాష్‌రూమ్‌లు, విశ్రాంతి గది ఇలా అన్నీ బీర్ సీసాలతో నిర్మించినవే. అంతెందుకు బుద్ధుడి చిత్రాన్ని కూడా బీర్ బాటిళ్ల మూతలను రీ సైక్లింగ్ చేసి తయారు చేయటం విశేషం. హైనకెన్, ఛాంగ్ అనే రెండు బీర్ కంపెనీలకు చెందిన సీసాలే ఉన్నాయంట. ఈ బీర్ టెంపుల్ ద్వారా సిసాకెట్ పర్యాటక ప్రాంతంగా విరజిల్లుతోంది. -
ఆలయానికి జరిమానా వేశారు!
బీజింగ్: సింహాలను ఉంచారన్న ఆరోపణలతో ఓ దేవాలయానికి జరిమానా విధించారు. ఈ ఘటన చైనాలో శనివారం చోటుచేసుకుంది. షాంగ్ఘీ ప్రాంతంలోని ఓ బౌద్ధ దేవాలయంలో కొన్నేళ్లుగా సింహాన్ని ఉంచుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు దేవాలయానికి దాదాపు రూ.30 వేలు జరిమనా విధించారు. ఆలయంలో ఉన్న సింహాన్ని 'జూ'కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 2010లో ఈ దేవాలయానికి రెండు సింహాలను అప్పగించగా, ఓ సింహం అనారోగ్యంతో చనిపోయింది. రెండో సింహం ఆలయంలో ఉండిపోయింది. సింహాన్ని ఆలయప్రాంగణంలో ఎందుకు ఉంచుతున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా సింహాన్ని ఆలయంలో బంధించడం విషయంపై విచారణ ప్రారంభించారు. -
బౌద్ధలయాన్ని సందర్శించిన మోడీ
క్యోటో: జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండో రోజు టోజీలోని పురాతన పగోడా బౌద్ధలయాన్ని సందర్శించారు. జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి ఆలయానికి వచ్చిన మోడీ ఇక్కడ అరగంటపాటు గడిపారు. చెక్కతో ఐదు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని ఆసక్తిగా తిలకించారు. ఎనిమిదో శతాబ్దానికి చెందిన పగోడా బౌద్ధలయ విశేషాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రధాన బౌద్ధభిక్షువు మోరీ.. ఆలయ విశేషాలను మోడీకి వివరించారు. భారత ప్రధాని తమ ఆలయాన్ని సందర్శిచడం సంతోషంగా ఉందని ఇక్కడి బౌద్ధులు వ్యాఖ్యానించారు.